ఎమ్మెల్యేల క్యాంపుపై పోలీసు దాడి?
ఎమ్మెల్యేల క్యాంపుపై పోలీసు దాడి?
Published Fri, Feb 10 2017 1:17 PM | Last Updated on Tue, Oct 30 2018 5:17 PM
తమిళనాడు ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని భావిస్తున్న శశికళ... ఎమ్మెల్యేలను దాచిపెట్టారని భావిస్తున్న క్యాంపుపై దాడికి పోలీసులు బయల్దేరారు. స్వయంగా రాష్ట్ర పోలీసు అత్యున్నతాధికారి అయిన డీజీపీ టీకే రామచంద్రన్ నేతృత్వంలో ప్రత్యేక పోలీసు బృందం గోల్డెన్ బే రిసార్టుల వద్దకు బయల్దేరింది. కాంచీపురం జిల్లాలోని మహాబలిపురం సమీపంలో సముద్రంలో గల ఒక దీవిలో ఉన్న ఈ రిసార్టులోనే అన్నాడీఎంకే ఎమ్మెల్యేలందరినీ దాచిపెట్టారని భావిస్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేలతో పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత అటు నుంచి అటే మొత్తం ఎమ్మెల్యేలందరినీ మూడు ఏసీ బస్సుల్లో ఈ రిసార్టులకు తరలించిన విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు పోలీసు బృందం బయల్దేరిన విషయం తెలిసి ఎమ్మెల్యేలను అక్కడినుంచి తరలించేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం అందుతోంది. ముందుగా పడవల్లో సముద్ర తీరానికి తీసుకొచ్చి, అక్కడినుంచి మొత్తం ఎమ్మెల్యేలను వేర్వేరు బృందాలుగా చేసి వేర్వేరు చోట్ల ఉంచాలని శశి వర్గం భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పుడు డీజీపీ బృందం అక్కడకు వెళ్లిన తర్వాత ఎంతమంది అక్కడ ఉంటారు, ఉన్నవాళ్లు ఏమని చెబుతారన్న విషయాన్ని బట్టి తదుపరి పరిణామాలు ఆధారపడి ఉంటాయి.
Advertisement
Advertisement