మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన గంజెళ్ల నాయకులు
ఎమ్మిగనూరు రూరల్ : గోనెగండ్ల మండలం గంజెళ్ల గ్రామానికి చెందిన టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు ఆ పార్టీలకు గుడ్‌బై చెప్పారు. ప్రజల పట్ల అంకిత భావం చూపే వైఎస్. జగన్ నాయకత్వం, ప్రత్యేక హోదా కోసం పోరాడే పార్టీ నికర వైఖరి పట్ల తామంతా ఆకర్షితులమై మేము సైతం పార్టీకి అండగా నిలవాలని ముందుకు కదిలామంటూ ముక్తకంఠంతో నినదించారు. మంగళవారం ఎంపీపీ నసురుద్దీన్, తిరుమలరెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే చెన్నకేశరెడ్డి సమక్షంలో వీరంతా వైఎస్సార్‌సీపీలో లాంఛనంగా చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మాట్లాడుతూ టీడీపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన వంద మంది నాయకులు, కార్యకర్తలు తమ పార్టీ పోరాటాలను గుర్తించి అండగా నిలవడం సంతోషంగా ఉందన్నారు. ఆ పార్టీల విధానాలు, వైఖరులు నచ్చకే వీరంతా పార్టీలో చేరారన్నారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐదు కోట్ల మందిని మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం చంద్రబాబునాయుడు పూటకోమాట మార్చుతూ నాటకాలు ఆడుతున్నాడని, చిత్తశుద్ధి ఉంటే తన పార్టీ ఎంపీలతో రాజీనామాలు చేయించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా విషయంలో నాలుగేళ్ల నుంచి మాటతప్పకుండా ఒకే మాటమీద నిలబడి నికరంగా పోరాటం చేస్తోంది వైఎస్సార్‌సీపీ మాత్రమేనని చెప్పారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌పై ప్రజలకు అపార నమ్మకం ఉందని, పాదయాత్రల సందర్భంగా ఎక్కడికి వెళ్లినా వేలాది మంది ఆయనను అనుసరించడమే అందుకు నిదర్శనమన్నారు. అధికారంలోకి వస్తే తన తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కంటే మంచి పాలన అందించి చరిత్ర సృష్టిస్తారని స్పష్టం చేశారు. రాబోయే సుపరిపాలన కోసం మనమంతా సైనికుల్లా పనిచేసి వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రి చేసేవరకు శ్రమించాలని పిలుపునిచ్చారు.
పార్టీలో చేరిన నాయకులు అంకిత భావతంతో పనిచేయాలని సూచించారు. పార్టీలో చేరిన వారిలో వెంకట్రాముడు, శాంతన్న, మల్లేష్, శ్రీనివాసులు, రంగస్వామి, గోపాల్, యంకన్న, చంద్ర, పెద్దయ్య, నాయుడు, గోరిల్లా, రాఘవేంద్ర, నాగార్జున, జయరాముడు, ఉరుకుందు, విజయ్, నాగరాజు, కృష్ణ, బారికి పరమేష్‌లతో పాటు మరి కొందరు ఉన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు బీఆర్ బసిరెడ్డి, ధర్మకారి నాగేశ్వరరావు, బందెనవాజ్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment