కరీంనగర్ సిటీ, న్యూస్‌లైన్: కాంగ్రెస్ కృతజ్ఞతా సభకు ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. పార్టీ వ్యవస్థాపక దినమైన ఈనెల 28న కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో పెద్ద ఎత్తున బహిరంగ సభను నిర్వహించనున్నట్లు మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. తెలంగాణ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలుపడం, అసెంబ్లీకి ముసాయిదా బిల్లు రావడానికి కారణమైన యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలకు ఈ సభ ద్వారా కృతజ్ఞతలు తెలుపుతామన్నారు.
శనివారం ఆయన కరీంనగర్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ వ్యవస్థాపక దినం సందర్భంగా 28న అన్ని గ్రామాల్లో, వార్డుల్లో పార్టీ జెండావిష్కరణ చేపట్టాలని, మధ్యాహ్నం ఒంటిగంటకు కృతజ్ఞతా సభకు పార్టీ నాయకులు, శ్రేణులు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. కులసంఘాలు, తెలంగాణ సంఘాలు, ఉద్యోగ, విద్యార్థి సంఘాలు, తెలంగాణ రాష్ట్ర సాధనకు వివిధ రూపాల్లో పోరాటం చేసిన ప్రతి ఒక్కరినీ సభకు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చ ఇప్పటికే మొదలైందని పునరుద్ఘాటించారు. జనవరి 3 నుంచి సమావేశాలు అని వెలువడిన బులిటెన్‌లోనే చర్చ మొదలైందని స్పష్టంగా పేర్కొన్నారని చెప్పారు.
డీసీసీ కార్యాలయంలో
సన్నాహక సమావేశం
కృతజ్ఞతా సభ విజయవంతానికి శనివారం డీసీసీ కార్యాలయంలో ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నాయకులతో మంత్రి శ్రీధర్‌బాబు భేటీ అయ్యారు. కనీసం లక్ష మందికి తగ్గకుండా జనసమీకరణ చేయాలన్నారు. అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా సభలు నిర్వహించాలని అనుకున్నా, గతంలో వాయిదా వేసినందున ముందుగా జిల్లా కేంద్రంలో కృతజ్ఞతా సభను నిర్వహించడానికే నాయికులు మొగ్గుచూపారు.
ఆ తరువాత నియోజకవర్గాల వారీగా సభలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశాల్లో సమావేశంలో ఎంపీ పొన్నం ప్రభాకర్, విప్ ఆరెపల్లి మోహన్, ఎమ్మెల్సీ టి.సంతోష్‌కుమార్, ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, డీసీసీ అధ్యక్షుడు కొండూరు రవీందర్‌రావు, మత్సపారిశ్రామిక సంస్థ చైర్మన్ చేతి ధర్మయ్య, వేములవాడ దేవస్థానం చైర్మన్ బొమ్మ వెంకటేశ్వర్, నగర అధ్యక్షుడు కన్న కృష్ణ, పీసీసీ ప్రధానకార్యదర్శి కోలేటి దామోదర్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు పనకంటి చంద్రశేఖర్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ డెరైక్టర్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, మాజీ మేయర్ డి.శంకర్, పీసీసీ కార్యదర్శులు వై.సునీల్‌రావు, బొమ్మ శ్రీరాంచక్రవర్తి, నేరెళ్ల శారద, అర్బన్‌బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆమ ఆనంద్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు గుగ్గిళ్ల జయశ్రీ, నందెల్లి రమ, ఎస్సీసెల్ జిల్లా చైర్మన్ అర్ష మల్లేశం, వి.అంజన్‌కుమార్ పాల్గొన్నారు.
28న కాంగ్రెస్ కృతజ్ఞతా సభ
Published Sun, Dec 22 2013 4:32 AM | Last Updated on Sat, Aug 25 2018 5:20 PM
Advertisement