పరిశోధన.. అపనింద కారాదు
సాక్షి, న్యూఢిల్లీ: ‘‘మీడియాలో పరిశోధన స్ఫూర్తి అపనిందల ప్రచారంలా మారకూడదు. పరిశోధనాత్మక జర్నలిజానికి కక్ష సాధింపులు ప్రత్యామ్నాయం కాదు. ప్రజోపయోగం స్థానాన్ని వ్యక్తిగత పక్షపాతాలు ఆక్రమించకూడదు’’ అని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ హితవుపలికారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో 75వ వార్షికోత్సవం సందర్భంగా కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ ఢిల్లీలోని రాయ్‌సీనా రోడ్‌లో అరవై కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన అత్యాధునిక జాతీయ మీడియా కేంద్రం (నేషనల్ మీడియా సెంటర్ )ను ప్రధాని మన్మోహన్, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీలు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. మీడియా అనేది కేవలం కార్యక్రమాలకు అద్దంపట్టేది మాత్రమే కాదని.. మొత్తం సమాజాన్ని అది ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. ఆర్థిక సంస్కరణలు, సరళీకరణలు తెచ్చిన గొప్ప సామాజిక మార్పుల ప్రక్రియను ప్రతిబింబించే క్రమంలో.. మీడియా కూడా ఆ మార్పుల ప్రభావానికి లోనయిందన్నారు. మార్పు అనేది సవాళ్లను కూడా తెస్తుందని.. మీడియా రంగంలోని వారు ఈ సవాళ్లను అధిగమించాల్సి ఉంటుందని చెప్పారు. భారత్ వంటి ప్రజాస్వామ్య దేశంలో పరిశోధన స్వేచ్ఛ, ప్రశ్నలకు సమాధానాల అన్వేషణ అనే బాధ్యతను నిర్వర్తించేటపుడు జాగరూకతతో వ్యవహరించాలని సూచించారు. పరిశోధనాత్మక జర్నలిజానికి కక్షసాధింపులు ప్రత్యామ్నాయం కాదని హితవు పలికారు. మీడియా చర్చలో ఒక్కోసారి హుందాతనం లోపిస్తోందని సోనియాగాంధీ వ్యాఖ్యానించారు.
రెండెకరాల విస్తీర్ణం.. అత్యాధునిక హంగులు
రాష్ట్రపతి భవన్‌కు, పార్లమెంటుకు సమీపంలో 1.95 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, మౌలిక సదుపాయాలతో నెలకొల్పిన ఈ కేంద్రం ప్రభుత్వ సమాచార కేంద్రంగా పనిచేస్తుంది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోను కూడా ఈ భవనంలోనే ఏర్పాటుచేస్తారు. ఈ మీడియా సెంటర్‌లోని ప్రధాన ప్రెస్ కాన్ఫరెన్స్ ఆడిటోరియంలో దాదాపు 300 మంది విలేకరులు కూర్చోగల సదుపాయం ఉంది. మరో హాల్‌లో 60మందికి పైగా కూర్చోవచ్చు. మీడియా ప్రతినిధుల కోసం 24 వర్క్‌స్టేషన్లు ఉంటాయి. మీడియా ప్రతినిధులకు లైబ్రరీ, కెఫెటీరియా, లాంజ్ కూడా అందబాటులో ఉంటాయి.
వివాదాస్పద వ్యాఖ్యలపై జస్టిస్ కట్జూ క్షమాపణ
వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్‌పర్సన్ మార్కండేయ కట్జూ ఇన్నాళ్లకు తన వ్యాఖ్యలపై సారీ చెప్పారు. 90 శాతం మంది భారతీయులు మూర్ఖులన్న ఆయన తన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ‘నా వ్యాఖ్యలతో కొందరు బాధపడ్డారు. అవి నిర్దిష్టమైన సందర్భాన్ని ఉద్దేశించి చేసినవి తప్ప.. ఎవరినో బాధపెట్టడానికి కాదు’ అని శనివారమిక్కడ చెప్పారు.
‘ముందస్తు’పై ఏమీ చెప్పలేను: సోనియా
న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల తర్వాత మళ్లీ యూపీఏ ప్రభుత్వం ఏర్పడుతుందని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ధీమా వ్యక్తంచేశారు. ప్రస్తుత యూపీఏ సర్కారు పూర్తికాలం కొనసాగటమే తమ లక్ష్యమని.. అయితే ముందస్తు ఎన్నికల గురించి ఏమీ చెప్పలేనని పేర్కొన్నారు. శనివారం ఢిల్లీలో జాతీయ మీడియా కేంద్రం ప్రారంభోత్సవం తర్వాత తనను చుట్టుముట్టిన విలేకరులతో ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ వెంటనే వెళ్లిపోగా.. సోనియాగాంధీ విలేకరుల ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ‘ఎన్నికల తర్వాత యూపీఏ-3 సర్కారు ఏర్పాటవుతుందా?’ అన్న ప్రశ్నకు.. ‘‘నూటికి నూరు శాతం ఏర్పడుతుంది’’ అని ఆమె బదులిచ్చారు. ‘లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు జరుగుతాయా?’ అని ప్రశ్నించగా, సర్కారు పూర్తి కాలం కొనసాగించటమే తమ లక్ష్యమన్నారు. ‘లోక్‌సభలో ఆహారభద్రత, భూసేకరణ బిల్లుల ఆమోదం తర్వాత ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందా?’ అని అడిగినపుడు, ‘‘నేనేమీ చెప్పలేను’’ అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ విజయాలుగా ప్రచారం చేయబోయే అంశాలపై ప్రశ్నించినపుడు.. దేశప్రజలకు ఇచ్చిన హక్కులను ప్రచారం చేస్తామన్నారు. ‘మేం చాలా హక్కులు అందించాం. సమాచార హక్కు, విద్యా హక్కు, ఇప్పుడు ఆహార హక్కు అందించబోతున్నాం’’ అని చెప్పారు.