
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన రాహుల్ గాంధీకి మరో రెండు ప్రమోషన్లు లభించే అవకాశముంది. ఐక్య ప్రగతిశీల కూటమి(యూపీఏ) చైర్‌పర్సన్‌గా, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ(సీపీపీ) నాయకుడిగా ఆయనకు పట్టం కట్టేందుకు రంగం సిద్ధమైనట్టు అత్యంత విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయని ‘న్యూస్ 18’ తెలిపింది. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం ప్రకారం అధ్యక్ష స్థానంలో ఉన్నవారే సీపీపీ నాయకుడిగా వ్యవహరిస్తారు.
‘సోనియా గాంధీ గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీలో ప్రసంగాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ అధ్యక్షుడే సీపీపీ నాయకుడిగా వ్యవహరించడం ఇందిరా గాంధీ హయాం నుంచి మొదలైంద’ని కాంగ్రెస్ నాయకుడొకరు వెల్లడించారు. రెండు పదవుల మధ్య ఎటువంటి శత్రుత్వం లేకుండా చూసేందుకే ఈ నిబంధన పాటిస్తున్నట్టు వివరించారు.
యూపీఏ చైర్‌పర్సన్‌గా రాహుల్ ఎన్నికైతే భాగస్వామ్య పార్టీలతో నేరుగా సంప్రదింపులు జరిపేందుకు వీలుంటుంది. మమతా బెనర్జీ, లాలూ ప్రసాద్ యాదవ్, సీతారాం ఏచూరి లాంటి పాత మిత్రులను కలుపుకునిపోవడంలో ఇంతకాలం సోనియా గాంధీ సమర్థవంతంగా వ్యవహరించారు. రాహుల్ గాంధీ ఒకవేళ ఎన్డీఏ వ్యతిరేక కూటమి ఏర్పాటు చేయాలని భావిస్తే పాతమిత్రులను కలుపుకుని వెళ్లడం ఆయనకు సవాల్‌గా నిలుస్తుంది.
శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీని ముందుగా దారికి తెచ్చుకోవాల్సి ఉంటుంది. మహారాష్ట్ర, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీ ఒంటరిగా బరిలోకి దిగింది. ఆగస్టులో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అహ్మద్ పటేల్‌కు ఓటు వేయకుండా ఎన్సీపీ మోసం చేయడంతో రాహుల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో యూపీఏ భాగస్వాములను ఎన్నుకోవడంలో రాహుల్ మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సివుంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment