న్యూఢిల్లీ: ఒకే విషయాన్ని పదేపదే చెప్పేవారిని అరిగిపోయిన గ్రామ్‌ఫోన్ రికార్డుతో పోల్చే విషయం తెలుసు కదా. అదే ‘అరిగిపోయిన గ్రామ్‌ఫోన్ రికార్డు’ అంశం ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీల మధ్య వ్యంగ్య విమర్శలకు వేదికైంది. ఈ ఏడాది అక్టోబర్‌లో బీజేపీ కార్యకర్తల సమావేశంలో మోదీ మాట్లాడుతూ.. ‘గతంలో గ్రామ్‌ఫోన్ రికార్డులు ఉండేవి. కొన్నిసార్లు అవి చెడిపోయినా, అరిగిపోయినా ఒకే పదం పదేపదే వినిపించేది. ప్రస్తుతం ఇలాంటి వ్యక్తులు కొందరు(రాహుల్) ఒకే విషయాన్ని మాటిమాటికీ చెబుతున్నారు.
కేంద్ర ప్రభుత్వంపై వాళ్లు చెబుతున్న అబద్ధాలను ప్రజలు నమ్మకపోగా, నవ్వుకుంటున్నారు’ అంటూ రఫేల్‌పై రాహుల్ విమర్శలను పరోక్షంగా ప్రస్తావించిన విషయం తెలిసిందే. మోదీ కామెంట్స్‌పై కొంచెం లేట్‌గా రాహుల్ స్పందించారు. ఓ వీడియోను ఆదివారం తన ట్విటర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో తొలుత అక్టోబర్‌లో మోదీ చేసిన కామెంట్స్ వస్తాయి. అనంతరం వేర్వేరు బహిరంగ సభలు, సమావేశాల్లో నెహ్రూ, ఇందిర, రాజీవ్, సోనియా గాంధీల పేర్లను మోదీ అరిగిపోయిన గ్రామ్‌ఫోన్ రికార్డులా పదేపదే ప్రస్తావిస్తున్నట్లు ఆ వీడియోలో ఉంటుంది.
అలా, మోదీ వ్యంగ్యానికి టిట్ ఫర్ టాట్‌గా రాహుల్ స్పందించారు. వీడియోతో పాటు ‘ఈ వినోదభరితమైన వీడియోను మిస్టర్ 36(మోదీ) సమర్పిస్తున్నారు. దీన్ని మీరు ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నా. దయచేసి ఈ వీడియోను మీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు కూడా పంపండి. వాళ్లు కూడా సంతోషిస్తారు’ అని ట్వీట్ కూడా చేశారు. ఫ్రాన్స్ నుంచి 36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు కోసం ఎన్డీయే ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఆ వివాదాస్పద ఒప్పందాన్నే ‘మిస్టర్ 36’ అంటూ రాహుల్ వ్యంగ్యంగా ప్రస్తావించారు.
Comments
Please login to add a commentAdd a comment