పారదర్శకత సర్కారు బాధ్యత | Sakshi Editorial On Rafale Deal | Sakshi
Sakshi News home page

పారదర్శకత సర్కారు బాధ్యత

Published Sat, Feb 9 2019 12:24 AM | Last Updated on Sat, Feb 9 2019 1:29 AM

Sakshi Editorial On Rafale Deal

నాలుగేళ్లక్రితం రఫేల్‌ ఒప్పందంపై సంతకాలు అయింది మొదలు దాని చుట్టూ అల్లుకుంటున్న అనేకానేక ఆరోపణలకూ, సందేహాలకూ ఇప్పట్లో ముగింపు ఉండకపోవచ్చునని తాజాగా వెల్లడైన మరో అంశం నిరూపిస్తోంది.  మన దేశం, ఫ్రాన్స్‌ మధ్య ఈ ఒప్పందంపై చర్చలు సాగుతున్న సమ యంలో ప్రధాని కార్యాలయం అధికారుల తీరుపై రక్షణ శాఖ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు ఒక ఆంగ్ల దినపత్రిక వెల్లడించడంతో ఈ వ్యవహారంలో మళ్లీ కొత్త సందేహాలు పుట్టుకొ చ్చాయి. రఫేల్‌ ఒప్పందంపై ఏడుగురు సభ్యులున్న రక్షణ శాఖ అధికారుల బృందం ఫ్రాన్స్‌తో చర్చిస్తుండగా, దానికి సమాంతరంగా అదే అంశంపై ప్రధాని కార్యాలయం (పీఎంఓ) అధికారులు కూడా ఫ్రాన్స్‌తో మంతనాలు జరపడాన్ని అప్పట్లో ఆ శాఖను చూస్తున్న మంత్రి మనోహర్‌ పారికర్‌ దృష్టికి రక్షణ అధికారులు దృష్టికి తీసుకొచ్చారని ఆ కథనం చెబుతోంది. ఇది సరికాదని పీఎంఓకు చెప్పమన్నా పారికర్‌ ఈ విషయంలో చొరవ తీసుకోలేదు. ప్రస్తుత రక్షణ మంత్రి నిర్మలా సీతారా మన్‌ ఏం చెప్పినా, ఎలా సమర్థించుకున్నా ఆ విషయంలో రేగిన అనుమానాలు రూపుమాసిపోవు. 

ఒక వ్యవహారంలో ఆరోపణలొచ్చినప్పుడు, సందేహాలు వ్యక్తమైనప్పుడు దానికి సంబంధిం చిన సమస్త అంశాలను తేటతెల్లం చేయడం పాలకుల కనీస కర్తవ్యం. ప్రభుత్వం ఆ పని చేయనంత మాత్రాన వాస్తవాలు మరుగునపడి ఉండిపోతాయనుకోవడం సరికాదు. మీడియా చురుగ్గా పని చేసేచోట ఎప్పుడో ఒకప్పుడు అవి వెల్లడవుతాయి. ప్రభుత్వ తీరును ప్రశ్నార్థకం చేస్తాయి. అప్పుడు ఆ అనుమానాలు మరింత చిక్కబడతాయి. ఒప్పందంలో ఇంతవరకూ డబ్బులు చేతులు మారింది లేదు.. రఫేల్‌ విమానాలు మన దేశానికి వచ్చింది లేదని బీజేపీ నేతల వాదన. కాబట్టి స్కాం కాదం టున్నారు. అలాగే ఈ విమానాల ఉత్పత్తికి భారత్‌లో ఏ సంస్థను భాగస్వామిగా చేర్చుకోవాలో నిర్ణ యించుకునే స్వేచ్ఛ ఒప్పందం ప్రకారం రఫేల్‌ విమానాలు ఉత్పత్తి చేసే డస్సాల్ట్‌ సంస్థకే ఉంద న్నదీ నిజమే కావొచ్చు. కానీ ఎప్పటికప్పుడు సంజాయిషీ ఇవ్వడం తప్ప సమగ్రంగా అన్నిటినీ ప్రజల ముందు ఎందుకు ఉంచరు? రఫేల్‌ ఒప్పందంపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం విచా రణ సమయంలో కేంద్రం నివేదించిన వివరాల్లో పీఎంఓ పాత్ర గురించిన ప్రస్తావన ఎందుకు లేదు?  

ఒక్కసారి వెనక్కి వెళ్లి రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందానికి దారితీసిన పూర్వాప రాలు తెలుసుకుంటే ఇదిలా ఎడతెగకుండా సాగడం వల్ల జరిగే నష్టమేమిటో అర్ధమవుతుంది. 2012లో యూపీఏ ప్రభుత్వ హయాంలో ఇదే డస్సాల్ట్‌తో యుద్ధ విమానాల గురించి చర్చలు సాగాయి. దాదాపు ఒప్పందం కుదిరే దశలో అదంతా నిలిచిపోయింది. చర్చల సందర్భంగా ఆ సంస్థ 126 యుద్ధ విమానాలు మనకు సమకూర్చేందుకు...అందులో 18 విమానాలను 2015 కల్లా అందించేందుకు అవగాహన కుదిరింది. మిగిలిన 108 విమానాలనూ అవసరమైన సాంకేతిక పరి జ్ఞానాన్ని అందించడం ద్వారా హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హెచ్‌ఏఎల్‌)లో ఉత్పత్తి చేసేం దుకు ఏడేళ్లపాటు సహకరిస్తామని చెప్పింది. అయితే డస్సాల్ట్‌–హెచ్‌ఏఎల్‌ మధ్య జరిగిన తదుపరి చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. ఈలోగా రఫేల్‌ యుద్ధ విమానాల సామర్థ్యంపై సందేహాలు వ్యక్తమవుతూ మీడియాలో కథనాలు రావడంతో ఆ ఒప్పందం సాకారం కాలేదు. రక్షణ కొనుగోళ్లకు ఒప్పందాలు ఖరారు కావడానికి ముందో, తర్వాతో ఆరోపణలు ముసురుకోవడం మన దేశంలో రివాజుగా మారింది. రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు రక్షణ శాఖను తానే చూస్తూ,  తనకు అత్యంత సన్నిహితుడైన అరుణ్‌సింగ్‌ను ఆ శాఖలో సహాయమంత్రిగా నియమించారు. 1987లో బోఫోర్స్‌ శతఘ్నుల ఒప్పందంపై ముసురుకున్న వివాదం ఎన్ని మలుపులు తీసుకుందో, అత్యంత భారీ మెజారిటీ సాధించి అధికారంలోకొచ్చిన రాజీవ్‌ దాని పర్యవసానంగా రాజకీయంగా ఎంత దెబ్బతిన్నారో అందరికీ తెలుసు. దానికి విరుగుడుగా నిజాయితీపరులని పేరున్న నేతలను ఎంచు కుని వారికి రక్షణ శాఖ కట్టబెట్టడం ఆనవాయితీగా మారింది. వాజపేయి హయాంలో జార్జి ఫెర్నాండెజ్, యూపీఏ ఏలుబడిలో ఏకే ఆంటోనీ, మోదీ ప్రభుత్వం మనోహర్‌ పారికర్‌కు రక్షణ శాఖ అందుకే అప్పగించారు. కానీ వీరు కూడా ఆరోపణల భారాన్ని మోయక తప్పలేదు. కొనుగోళ్లకు సంబంధించి, వాటి పారదర్శకతకు సంబంధించి కొత్త నిబంధనలు రూపొందు తున్నాయి. దళా రుల ప్రమేయం లేకుండా చేయడానికి అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెబు తున్నారు. కానీ చివరాఖరికి ఆరోపణలు మాత్రం తప్పడం లేదు. వీటి తక్షణ ఫలితమేమంటే... మన రక్షణ దళాలకు అవసరమైన యుద్ధ విమానాలు, శతఘ్నులు, ఇతర పరికరాలు సకాలంలో సమకూరడం లేదు.

రఫేల్‌ ఒప్పందంలో లొసుగులున్నాయంటున్న విపక్షాలు దాన్ని బలంగా ప్రజల ముందుకు తీసుకెళ్లడంలో విఫలమయ్యాయి. విపక్షాల్లో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మినహా మరెవరూ ఈ విషయాన్ని పెద్దగా మాట్లాడటం లేదు. ఆయన శక్తి అంత సరిపోతున్నట్టు లేదు. ఇతర నేతలకు రఫేల్‌ వ్యవహారంపై ఆసక్తి లేదో... వారికి అసలు అవగాహనే కొరవడిందో చెప్పలేం. ఈమధ్యే కోల్‌కతాలో జరిగిన విపక్ష ర్యాలీలో ఈ స్కాంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడిన తీరు విపక్షాల బలహీనతను పట్టిచూపుతుంది. బాబు గారికి రఫేల్‌ ఫైటర్‌ జెట్‌ విమానాలకూ, జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానాలకూ తేడా తెలియదు. విపక్షాలు ఇలాంటి దైన్యస్థితిలో ఉండటం ప్రభుత్వానికి వరమే కావచ్చుగానీ... దాపరికం అంతిమంగా తమకే చేటు తెస్తుందని అది గుర్తించడం అవసరం. రక్షణ శాఖ బృందం చర్చిస్తుండగా ఈ ఒప్పందంలో పీఎంఓ ఎందుకు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందో, రక్షణ శాఖ కార్యదర్శి అభిప్రాయాన్ని ఎందుకు బేఖాతరు చేశారో వివరించడం దాని బాధ్యత. మీడియాలో వచ్చినప్పుడల్లా సంజాయిషీ ఇస్తూ, ఎదురుదాడులు చేస్తూ పోయే వ్యూహాన్ని విడిచి అన్నిటినీ పారదర్శకంగా ప్రజల ముందుంచాలి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement