పదవీకాలం పూర్తికావస్తున్న లోక్‌సభ ఆఖరి సమావేశాల్లో ప్రవేశపెట్టిన కాగ్ నివేదిక ప్రభుత్వ వైఖ రికి అనుకూలంగా ఒక వ్యాఖ్య చేయడమైనా... కనీసం అలా చేసిందని ప్రభుత్వం ప్రకటించుకునేందుకు వీలు కల్పించినా అది నెత్తిన పాలుబోయడమే. త్వరలో సార్వత్రిక ఎన్నికల సందడి మొదలు కానున్న తరుణంలో ఆ అదృష్టం ఎన్‌డీఏ ప్రభుత్వానికి దక్కింది. 2007లో యూపీఏ ప్రభుత్వం రఫేల్ యుద్ధ విమానాల కోసం ఖరారు చేసుకున్న ధరతో పోలిస్తే రెండేళ్లక్రితం ఎన్‌డీఏ సర్కారు కుదుర్చుకున్న ఒప్పందంలోని ధర 2.86 శాతం తక్కువని కాగ్ నివేదిక నిర్ధారించింది. నిజానికిది తుది నివేదిక కాదు. కాగ్ పరిశీలించాల్సిన అంశాలు మరికొన్ని ఉన్నాయి. అందులో ఆఫ్‌సెట్ భాగ స్వామి ఎంపిక ఒకటి. ఇలాంటి మరో పది అంశాలకు సంబంధించిన ఆడిటింగ్ జరగాల్సి ఉన్నదని కాగ్ నివేదిక వివరించింది. ఒప్పందంలో వచ్చి చేరిన ఆఫ్‌సెట్ భాగస్వామికి సంబంధించిన అంశమే ప్రస్తుతం రాజకీయంగా పెనుదుమారం లేపుతోంది.
అనిల్ అంబానీకి లబ్ధి చేకూర్చేందుకే ఎలాంటి అనుభవమూ లేని ఆయన సంస్థను ఆఫ్‌సెట్ భాగస్వామిగా చేర్చారని విపక్షాలు ఆరోపి స్తున్నాయి. అయితే అది రఫేల్ ఉత్పత్తిదారు డసో స్వీయ నిర్ణయమని ప్రభుత్వం బదులిస్తోంది. అంతటి కీలకమైన అంశంపై కాగ్ తన మనోగతాన్ని వెల్లడించి ఉంటే భిన్నంగా ఉండేది. అలా లేక పోబట్టే తాజా నివేదికపై కాంగ్రెస్ నిప్పులు కక్కితే, బీజేపీ పండగ చేసుకుంటోంది. 2014లో కాంగ్రెస్ స్థితి దీనికి విరుద్ధం. కామన్వెల్త్ క్రీడలతో మొదలెట్టి అన్నిటా ఆ పార్టీ నేతృత్వంలోని యూపీఏ సర్కారుకు ప్రతికూలతలే ఎదురయ్యాయి. 2జీ స్కాం, బొగ్గు కుంభకోణం వగైరాలు దేనికవి యూపీఏ సర్కారును ఉతికారేశాయి. ముఖ్యంగా 2జీ స్కాంలో కాగ్ లెక్కలు ఊహాజనిత మైనవని, అందులో కాస్తయినా వాస్తవం లేదని కాంగ్రెస్ నేతలు ఆక్రోశించినా ఫలితం లేకపో యింది. ఆ నివేదికలే ఆనాటి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ప్రధాన ప్రచారాస్త్రాలు అయ్యాయి.
వేల కోట్ల రూపాయల వ్యయమయ్యే ఏ భారీ కాంట్రాక్టుపైన అయినా ఆరోపణలు రావడం సహజమే. వాటిల్లో అనేకం కాగ్ నివేదికల్లో నిర్ధారణవుతుంటాయి కూడా. అయితే ఆరోపణలు చేసే వారిలో సత్తా లేకపోతే, దాన్ని బలంగా జనం ముందుకు తీసుకెళ్లలేకపోతే కాగ్ నిర్ధారించినా ఫలితం ఉండదు. తాజా కాగ్ నివేదికను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఘాటుగా విమర్శిం చారు. ఆ నివేదికకు అది అచ్చయిన కాగితాలంత విలువ కూడా లేదన్నారు. నివేదికలో ప్రభుత్వా నికి అనుకూలమైన అభిప్రాయాలుండటం అందుకు కారణం కావొచ్చు. అలాగని కాగ్ గంపగుత్తగా కేంద్రానికి క్లీన్‌చిట్ ఇవ్వలేదు.
ముఖ్యంగా ఒప్పందంలో ఫ్రాన్స్ ప్రభుత్వం నుంచి సురక్షితమైన పూచీకత్తు తీసుకోకుండా, ఏమాత్రం చట్టబద్ధత లేని ‘లెటర్ ఆఫ్ కంఫర్ట్’తో ఎందుకు సరిపెట్టాల్సి వచ్చిందని నిలదీసింది. 2007 నాటి అవగాహనలో ముందస్తు చెల్లింపులకు 15 శాతం బ్యాంకు పూచీకత్తు ఉన్న సంగతిని ఎత్తిచూపింది. ఆ తరహా పూచీకత్తు ఉంటే డసో ముందూ మునుపూ ఒప్పందాన్ని ఉల్లంఘించినప్పుడు ఆ డబ్బును ఫ్రాన్స్ సర్కారునుంచి వెంటనే రాబట్టుకునే అవకాశ ముంటుందని వివరించింది. తాజా ఒప్పందం ప్రకారం ఇతరత్రా ప్రయత్నాలు విఫలమయ్యాకే ఆ పని చేయగలుగుతామని చెప్పింది. అలాగే అప్పటి పూచీకత్తులో ప్రదర్శన, వారంటీలకు సైతం 5 శాతం చొప్పున పూచీ ఉన్న అంశాన్ని ప్రస్తావించింది. ధరవరల్లో మార్పులు గురించి కూడా నివేదిక వివరాలిచ్చింది.
మొత్తం 11 అంశాలకు సంబంధించి ఈ వివరాలున్నాయి. యూపీఏ ప్రభుత్వం కుదుర్చుకున్న అవగాహనతో పోలిస్తే తాజా ఒప్పందం వల్ల విమానాల సేవలు, నిర్వహణ అంశంలో 4.77 శాతం మేర, మన వైమానిక దళ అవసరాలకు అనుగుణంగా చేసే మార్పులకు అయ్యే ఖర్చు 17.08 శాతం మేర, ఆయుధ ప్యాకేజీలో 1.05 శాతం తక్కువని కాగ్ చెప్పిన అంశం వాస్తవమే అయినా...నాలుగు అంశాల్లో–పైలెట్, సాంకేతిక నిపుణుల శిక్షణకు 2.68 శాతం, ఇంజ నీరింగ్ పరమైన సాయానికి 6.54శాతం, లాజిస్టిక్స్‌లో 6.54శాతం మేర ధరలు పెరిగాయని తెలి పింది. అలాగే ఆడిట్ నివేదిక ప్రక్రియ ముగింపు దశలో ఉన్నదని, ఇతర అంశాలన్నీ అందులో పొందుపరుస్తామని వివరించింది. బహుశా నివేదికను క్షుణ్ణంగా చదివుంటే రాహుల్ వేరే విధంగా వ్యాఖ్యానించేవారేమో! లోక్‌సభ చివరి సమావేశాలనాటికైనా పూర్తి నివేదిక సమర్పించనందుకు కాగ్‌ను తప్పుబట్టి ఉంటే వేరుగా ఉండేది.
అటు ప్రభుత్వం సహజంగానే ఈ నివేదికను తమకొచ్చిన క్లీన్ చిట్‌గా చెబుతోంది. ముఖ్యంగా యూపీఏ హయాంనాటి ధరవరలతో పోల్చి తమ ఒప్పందం వల్ల విమానాల ఖర్చు 2.86 శాతం మేర తగ్గిందన్నది ప్రభుత్వ పెద్దలు ప్రముఖంగా చూపుతున్నారు. కానీ ఇతరత్రా అంశాల్లో వ్యయం పెరగడాన్ని కాగ్ ఎత్తిచూపింది. అలాగే 2007నాటి అవగాహనలో రఫేల్ యుద్ధ విమానాల్లో 18 విమానాలను వెంటనే అందిస్తామని, మిగిలినవన్నీ భారత్‌లో ఉత్పత్తి చేయడానికి సహకరిస్తామని హామీ ఇచ్చింది. కానీ 2016నాటి ఒప్పందంలో ఈ 36 యుద్ధ విమానాలనూ ఫ్రాన్స్‌లో తయారు చేసి పంపుతామని చెప్పింది.
అయితే ఒప్పంద వ్యయం రూ. 59,000 కోట్లలో కొంత శాతాన్ని భారత్‌లోనే ఖర్చు చేస్తామని హామీ ఇచ్చింది. అది ఎంత మొత్తమన్న అంశంలో భిన్నాభిప్రాయా లున్నా మిలిటరీ ఎయిరోనాటిక్స్ పరిశోధన, రఫేల్‌కు అవసరమైన విడిభాగాల ఉత్పత్తి ఆ ‘కొంత శాతం’లో ఉంటాయి. పబ్లిక్ రంగ సంస్థ హెచ్‌ఏఎల్‌ను కాదని అంబానీ సంస్థను ఎన్నుకున్నది వాటికోసమే. ఎయిరోస్పేస్, రక్షణ విడిభాగాల తయారీలో ఏమాత్రం అనుభవంలేని సంస్థకు తోడ్పాటునీయడం ఏమిటన్నది విపక్షాల ప్రశ్న. ఇది సబబేనా, ఇందులో ప్రభుత్వ ప్రమేయం ఉందా లేదా అన్న అంశాన్ని తుది నివేదికలో కాగ్ చెబుతుంది. అయితే దేశ రక్షణతో ముడిపడిన అంశాల్లో ఇలా తరచు వివాదాలు తలెత్తడం విచారకరం. పాలకులు పారదర్శకంగా వ్యవహరిస్తే, విపక్షాలు దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటే తప్ప ఈ ధోరణికి అడ్డుకట్ట పడదు.
Comments
Please login to add a commentAdd a comment