రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) తన నివేదికను బుధవారం పార్లమెంట్ ముందుకు తెచ్చింది. ఏడాదిన్నరకు పైగా కాలంపాటు కాగ్ రఫేల్ ఒప్పందాన్ని పరిశీలించి నివేదికను సిద్ధం చేశారు. విమానాల ధర, విక్రేతల ప్రతిపాదనల పరిశీలనతోపాటు ప్రపంచ వ్యాప్తంగా జెట్ యుద్ధ విమానాల ధరలను కూడా కాగ్ పరిశీలించారు. రక్షణ శాఖ ఐదేళ్లుగా జరిపిన లావాదేవీలపై కాగ్ నివేదిక వచ్చింది. ముసాయిదా నివేదిక ఇప్పటికే ప్రభుత్వానికి చేరింది. అయితే, ఎన్నికలకు ముందు ఈ నివేదిక ఖరారు కాకపోవచ్చు. రఫేల్ ఒప్పందంలోని ధర, సరఫరా, పూచీకత్తు తదితర పలు అంశాలను కాగ్ నివేదిక చర్చించింది. అందులోని ముఖ్యాంశాలు:
ధర: రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందంలో పేర్కొన్న ధర అంతకు ముందు ఒప్పందంలోని సమీకృత ధర(మొత్తం ధర) కంటే 2.86 శాతం తక్కువ. 2007లో (యూపీఏ హయాం) కుదుర్చుకున్న ఒప్పందంలోని 36 విమానాల కొనుగోలు ధర కంటే 2016 నాటి ఎన్‌డీఏ ఒప్పందంలోని ధర 9 శాతం తక్కువంటూ రక్షణ శాఖ చేసిన వాదనను కాగ్ తోసిపుచ్చింది. ఒప్పందంలో మొత్తం 14 ఐటెమ్‌లతో కూడిన ఆరు వేర్వేరు ప్యాకేజీలు ఉన్నాయి. వీటిలో ఏడు ఐటెమ్‌ల ధర సమీకృత ధర కంటే చాలా ఎక్కువగా ఉంది. బేసిక్ విమానం సహా మూడు ఐటెమ్‌లను సమీకృత ధరకే కొన్నారు. 4 ఐటెమ్‌లను సమీకృత ధరకంటే తక్కువకు కొన్నారు.
సరఫరా: పాత ఒప్పందంతో పోలిస్తే కొత్త ఒప్పందంలో పేర్కొన్న గడువు ప్రకారం యుద్ద విమానం ఒక నెల ముందే సరఫరా అవుతుంది. 2007 ఒప్పందం ప్రకారం నిర్దేశిత ప్రమాణాల మేరకు యుద్ధ విమానాలను ఒప్పందం నాటి నుంచి 72 నెలల్లోపు సరఫరా చేయాల్సి ఉండగా. 2016 ఒప్పందంలో ఈ గడువు 71 నెలలుగా పేర్కొన్నారు. 2007 ఒప్పందం ప్రకారం ఒప్పందపు నెల నుంచి 50 నెలల్లోగా 18 విమానాలను సరఫరా చేయాల్సి ఉంటుంది. మిగతా 18 విమానాలను హెచ్‌ఏఎల్‌లో తయారు చేయాలి. వీటిని 49–72 నెలల్లోపు అందజేయాల్సి ఉంటుంది. 2016 ఒప్పందం ప్రకారం మొదటి విడత విమానాలను(18) ఒప్పందపు నెల నుంచి 36–53 నెలల మధ్య సరఫరా చేయాలి. మిగతా వాటిని 67 నెలల్లో అందజేయాల్సి ఉంటుంది.
గ్యారెంటీ: న్యాయ మంత్రిత్వ శాఖ సలహా మేరకు ఈ ఒప్పందానికి సంబంధించి సార్వభౌమత్వ హామీ(ప్రభుత్వమే హామీ ఉండటం) ఇవ్వాల్సిందిగా రక్షణ మంత్రిత్వశాఖ ఫ్రాన్స్ ప్రభుత్వాన్ని కోరింది. అయితే, ఆ ప్రభుత్వం కేవలం లెటర్ ఆఫ్ కంఫర్ట్ ను మాత్రమే ఇచ్చింది. ముందు జాగ్రత్త చర్యగా ఈ ఒప్పందానికి సంబంధించిన చెల్లింపుల కోసం ఎస్క్రో ఖాతా తెరవాలని రక్షణ మంత్రిత్వ శాఖ చేసిన విజ్ఞప్తికి ఫ్రాన్స్ ప్రభుత్వం అంగీకరించలేదు. 2007నాటి ఒప్పందంలో విమానాల తయారీ సంస్థ డసో ఏవియేషన్ ‘పనితీరు, ఆర్థిక హామీ(పెర్ఫార్మెన్స్ అండ్ ఫైనాన్షియల్) ఇచ్చింది. మొత్తం కాంట్రాక్టు విలువలో 25 శాతం మేరకు ఈ హామీ ఇచ్చింది. 2007నాటి ఒప్పందంలో అమ్మకందారు(డసో)ఈ హామీ విలువను బిడ్‌లో చేర్చారు. అయితే, 2016 ఒప్పందంలో ఇలాంటి హామీలు ఏమీ లేవు. దీనివల్ల డసో సంస్థకు బోలెడు ఆదా అయింది.
ఇదీ రఫేల్‌పై కాగ్ నివేదిక
Published Thu, Feb 14 2019 3:22 AM | Last Updated on Thu, Feb 14 2019 9:55 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment