రాఫెల్‌పై రచ్చ రచ్చ..!  | War between UPA And NDA Regarding Rafele Jet Deal | Sakshi
Sakshi News home page

రాఫెల్‌పై రచ్చ రచ్చ..! 

Published Wed, Sep 26 2018 2:09 AM | Last Updated on Wed, Sep 26 2018 11:05 AM

War between UPA And NDA Regarding Rafele Jet Deal - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

ఆరోపణలు, ప్రత్యారోపణలు.. విమర్శలు, ప్రతివిమర్శలతో రాఫెల్‌ రాజుకుంటోంది. భారత ప్రభుత్వం సూచనమేరకే రిలయన్స్‌ డిఫెన్స్‌ని ఒప్పందంలో భాగస్వామిగా చేసుకున్నట్టు ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్‌ హోలండ్‌ తాజాగా పేల్చిన బాంబుతో రాజకీయ రచ్చ తారాస్థాయికి చేరుకుంది. మరోవైపు ఫ్రాన్స్‌ ప్రభుత్వం ఇలాంటి ఒప్పందాల్లో విమానాలు తయారు చేసే కంపెనీలకే పూర్తి స్వేచ్ఛ ఉంటుందని, డసో ఏవియేషన్‌ కంపెనీ ఇష్టం ప్రకారమే భాగస్వామి ఎంపిక ఉంటుందని అంటోంది. అసలు ఏమిటీ ఒప్పందం ? కాంగ్రెస్‌ చేస్తున్న ప్రధాన ఆరోపణలు, లేవనెత్తుతున్న ప్రధాన ప్రశ్నలేంటి ? కేంద్రం చెబుతున్నదేంటి ? ఇరు పార్టీల మధ్య రాఫెల్‌ పరిణామాలు ఎందుకు  వివాదాన్ని లేవనెత్తాయి ?

యూపీఏ హయాంలో ఏం జరిగింది ?  

126 మధ్య తరహా రాఫెల్‌ యుద్ధ విమానాలు కొనుగోలు చేయాలని 2007లో యూపీఏ ప్రభుత్వం భావించింది. కొన్నేళ్ల పాటు ఇరుపక్షాల మధ్య చర్చలు సాగాయి. చివరికి 18 విమానాలు ఫ్రాన్స్‌లో తయారు చేయాలని, మిగిలిన 108 విమానాలను కేంద్ర ప్రభుత్వానికి చెందిన హిందూస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) భాగస్వామ్యంతో భారత్‌లో తయారు చేయాలని 2012లో కేంద్రప్రభుత్వం, విమానాల తయారీ సంస్థ డసో  ఏవియేషన్‌ ఒక అంగీకారానికి వచ్చాయి. ధర విషయంలో చర్చలు ఒక కొలిక్కి రాకుండానే ఇరు దేశాల్లో ఎన్నికలు జరిగి ప్రభుత్వాలు మారాయి. దీంతో ఒప్పందం ముందుకు సాగలేదు. అయితే ఒక్కో యుద్ధవిమానానికి రూ. 526 కోట్లు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నామని కాంగ్రెస్‌ చెబుతోంది.  

ఎన్డీయే హయాంలో ఏం జరిగింది ?  

ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్రాన్స్‌ పర్యటనకు వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అప్పటి ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్‌ హోలండ్‌తో చర్చలు జరిపారు.126కి బదులుగా 36 రాఫెల్‌ యుద్ధవిమానాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నామని 2015లో ప్రభుత్వం ప్రకటించింది. కానీ ధర విషయంలో మాత్రం గోప్యత పాటించింది. ఎన్ని కోట్లకు ఒప్పందం కుదుర్చుకుందో, ఒక్కో విమానాన్ని ఎన్ని కోట్లు పెట్టి కొనుగోలు చేస్తోందో అధికారికంగా వెల్లడించలేదు. అయితే 59 వేల కోట్లకు రాఫెల్‌ ఒప్పందం కుదిరిందని,  2019 సెప్టెంబర్‌ నుంచి 2022 ఏప్రిల్‌ మధ్య 36 యుద్ధ విమానాలను భారత్‌కు 
సరఫరా చేయడానికి ఫ్రాన్స్‌ అంగీకరించిందని వార్తలు వచ్చాయి. ఈ లెక్కన చూస్తే ఒక్కో విమానం కొనుగోలుకయ్యే ఖర్చు 1670 కోట్లు.  ఇక యుద్ధ విమానాల తయారీకి భారత్‌ భాగస్వామిగా హెచ్‌ఏఎల్‌కు బదులుగా అనిల్‌ అంబానీకి చెందిన రిలయెన్స్‌ డిఫెన్స్‌ను సర్వీస్‌ ప్రొవైడర్లుగా చేర్చింది.  

హాల్‌ను తప్పించడం 
యూపీఏ హయాంలో ప్రభుత్వ రంగ సంస్థ హెచ్‌ఏఎల్‌ను రాఫెల్‌ యుద్ధ విమానాల తయారీ భాగస్వామిగా నియమిస్తే, దానిని తప్పించాల్సిన అవసరం ఏమొచ్చిందన్నది కాంగ్రెస్‌ ప్రధానంగా లేవనెత్తిన అంశం. అనిల్‌ అంబానీకి లబ్ధి చేకూర్చడం కోసమే హెచ్‌ఏఎల్‌ను తప్పించారంటూ దాడికి దిగుతూ వచ్చింది.  హాల్‌కి రాఫెల్‌ యుద్ధ విమానాలు తయారు చేసే సామర్థ్యం లేనే లేదని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఎదురు దాడి చేశారు. అయితే హెచ్‌ఏఎల్‌ మాజీ చైర్‌ పర్సన్‌ టి. సువర్ణరాజు యుద్ధ విమానాలు చేసే సామర్థ్యం తమకు ఉందని స్పష్టం చేయడంతో ఎన్డీయే ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిపోయింది. సుఖోయ్‌–30 విమానాలను తాము తయారు చేశామని, డసో ఏవియేషన్‌ తయారు చేసిన మిగ్‌–2000  విమానాల నిర్వహణ కూడా తామే చేస్తున్నామంటూ టి.ఎస్‌ రాజు  మీడియా ఇంటర్వూ్యల్లో పేర్కొన్నారు. అయిదేళ్లుగా సాంకేతిక బృందానికి తాను నాయకత్వం వహించానని, రాఫెల్‌ విమానాలను కూడా తాము తయారు చేయగలిగి ఉండేవాళ్లమని రాజు వెల్లడించారు. ఆయన వ్యాఖ్యలతో నిర్మలా సీతారామన్‌ చెప్పినవన్నీ అబద్ధాలేనని రుజువైందంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విమర్శలకు దిగడంతో రాజకీయ వేడి పెరిగింది.  

వివాదం ఎలా ముదిరింది?  

రాఫెల్‌ ఒప్పందంలో భారీగా అవకతవకలు జరిగాయని, దేశ ప్రయోజనాలు కాలరాస్తూ  అనిల్‌ అంబానీకి లబ్ధి చేకూరేలా మోదీ ప్రభుత్వం ఒప్పందాన్ని కుదుర్చుకుందని కాం గ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మొదట్నుంచీ ఆరో పణలు చేస్తున్నారు. రాఫెల్‌ ఒప్పందంలో అంశాలను రహస్యంగా ఎందుకు ఉంచాల్సి వచ్చింది ? విమానాల తయారీ భాగస్వామిగా హిందూస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హాల్‌)ను ఎందుకు తప్పించారు ? విమానాల తయారీ రంగంలో ఏ మాత్రం అనుభవం లేని అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ డిఫెన్స్‌ను భాగస్వామిగా చేయాల్సిన అవసరమేంటి ? ఈ మూడు అంశాల చుట్టూ వివాదం తిరుగుతూ వస్తోంది. కాంగ్రెస్‌ లేవనెత్తుతున్న ప్రశ్నలకు బీజేపీ సూటిగా సమాధానాలు చెప్పకపోవడం, కొత్త కొత్త విషయాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తూ ఉండటంతో రాజకీయం రంగులు మారుతోంది.  

రాఫెల్‌ అంటే.. 
రెండు ఇంజిన్లు కలిగిన బహుముఖ యుద్ధవిమానాలను ఫ్రాన్స్‌కు చెందిన డసో ఏవియేషన్‌ సంస్థ తయారు  చేస్తుంది. రాఫెల్‌ పేరుతో తయారు చేసే ఈ యుద్ధవిమానాలు అత్యంత సమర్థంగా పనిచేస్తాయని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది.  

కాంగ్రెస్, కేంద్రం వాదప్రతివాదాలు జరిగిందిలా..  

రాఫెల్‌ ఒప్పందంపై మొదట్నుంచి ఎన్డీయే ప్రభుత్వం గోప్యత పాటిస్తూ వస్తోంది. యూపీఏ చర్చించిన దాని కంటే తమ ఒప్పందమే ఉత్తమమైనదని యూపీఏతో పోల్చి చూస్తే తాము ఖజానాకు 12,600 కోట్లు ఆదా చేశామని మోదీ సర్కార్‌ చెబుతోంది. ఫ్రాన్స్, భారత్‌ మధ్య 2008లో కుదిరిన అవగాహన మేరకు ఈ ఒప్పందంలో అంశాలు బయటకు వెల్లడించలేమని అంటోంది. అయితే ఆ ఒప్పందం కుదిరిన సమయంలో రక్షణ మంత్రిగా ఉన్న కాంగ్రెస్‌కు చెందిన ఏకే ఆంటోని బీజేపీ చెబుతున్నవన్నీ అబద్ధాలేనని, ఆ ఒప్పందం ప్రకారం సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన అంశాలు వెల్లడి చేయకూడదనే ఉంది తప్ప, ధర కాదని అంటున్నారు. అలాంటప్పుడు  రాఫెల్‌ యుద్ధ విమానం ధరలపై గోప్యత పాటించాల్సిన అవసరమేముందన్నది ఆయన వాదన. యూపీఏ ప్రభుత్వం ఒక్కో యుద్ధ విమానాన్ని రూ.526 కోట్లకు కొనుగోలు చేయడానికి సిద్ధమైతే ఎన్డీయే ప్రభుత్వం ఒక్కో యుద్ధ విమానానికి రూ.1670 కోట్లు వెచ్చిస్తోందని, అందుకే బీజేపీ నోరు మెదపడం లేదన్నది కాంగ్రెస్‌ వాదన.

రిలయన్స్‌ డిఫెన్స్‌ చేరడం 

ఒక వ్యాపారవేత్తకు లబ్ధి చేకూర్చడానికే మోదీ ప్రభుత్వం దేశ భద్రతనే పణంగా పెట్టిందని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది.  2015, ఏప్రిల్‌ 10న రాఫెల్‌ ఒప్పందం కుదిరిందని మోదీ ప్రభుత్వం ప్రకటిస్తే, దానికి సరిగ్గా 12 రోజులు ముందే రిలయన్స్‌ డిఫెన్స్‌ కంపెనీ ఏర్పాటైందన్నది కాంగ్రెస్‌ ఆరోపణ. రాఫెల్‌ ఒప్పందం కుదుర్చుకోవడానికి అప్పటి ఫ్రాన్స్‌ అధ్యక్షుడు హోలండ్‌ భారత్‌కు వచ్చిన సమయంలోనే అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ హోలన్‌ సహచరి, నటి జూలీ గయె ప్రధాన పాత్రలో రెండు సినిమాలు నిర్మించడానికి అంగీకరించింది. జూలీ గయె ప్రొడక్షన్‌ హౌస్‌తో కలిసి తాము ఫ్రెంచ్‌ సినిమాలు తీస్తామంటూ అనిల్‌ అంబానీ అప్పట్లో ఒక ప్రకటన విడుదల చేశారు కూడా. క్విడ్‌ ప్రో కో ఒప్పందంలో భాగంగా రాఫెల్‌ కాంట్రాక్ట్‌ తమకి దక్కడం కోసమే రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సినీ రంగంలో పెట్టుబడులు పెట్టిందని కూడా  కాంగ్రెస్‌ ఆరోపించింది.

విమానాల తయారీ రంగంలో 70 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ హాల్‌ను కాదని విమాన తయారీ రంగంలో ఏ మాత్రం అనుభవం లేని ఒక ప్రైవేటు కంపెనీకి అప్పగించడం వల్ల దేశ భద్రతే ముప్పులో పడిందని కాంగ్రెస్‌ ఆందోళన వ్యక్తం చేస్తోంది.  ఈ ఆరోపణల్నింటినీ తిప్పికొట్టిన కేంద్రం రిలయన్స్‌ డిఫెన్స్‌ను సర్వీసు ప్రొవైడర్లుగా తాము ఎంపిక చేయలేదని,  డసో ఏవియేషన్‌ కంపెనీయే ఎంపిక చేసుకుందని ఇన్నాళ్లూ  వాదిస్తూ వచ్చింది. ఇప్పుడు ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్‌ హోలండ్‌ రిలయన్స్‌ను ఎంపిక చేసుకోవాలని మోదీ ప్రభుత్వం తమకు సూచించిందని వెల్లడించడంతో కాంగ్రెస్‌ చేతికి ఒక పెద్ద ఆయుధం దొరికినట్టయింది. కాంగ్రెస్‌ లేవనెత్తిన సందేహాలకు ఎన్డీయే ప్రభుత్వం సూటిగా సమాధానాలు చెప్పకపోవడం, ఎన్టీయే మంత్రులు చెబుతున్నదానికి విరుద్ధమైన ప్రకటనలు అవతల పక్షం నుంచి వస్తూ ఉండడంతో రాఫెల్‌ వివాదం రోజుకో మలుపు తిరుగుతూ వస్తోంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement