
రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ (ఫైల్ ఫోటో)
రాఫెల్ డీల్ నుంచి జైట్లీ, పారికర్ తప్పించుకున్నారన్న కాంగ్రెస్..
జైపూర్ : రాఫెల్ డీల్ అవినీతికి జేజమ్మ వంటిదని కాంగ్రెస్ అభివర్ణించింది. నరేంద్ర మోదీ డీఎన్‌ఏలో క్రోనీ క్యాపిటలిజం ముఖ్యమైన భాగంగా మారందని ఆ పార్టీ ప్రతినిధి శక్తి సింగ్ గోహిల్ పేర్కొన్నారు. మోదీ హయాంలో రాఫెల్ విమానం ధర రూ 526 కోట్ల నుంచి రూ 1670 కోట్లకు మూడు రెట్లు ఎలా పెరిగిందని ప్రశ్నించారు. మోదీ కోట్లలోనే ముడుపులు స్వీకరిస్తారన్నారు.
బీజేపీ ప్రభుత్వ నాలుగేళ్ల హయాంలో తొలిసారిగా ముగ్గురు రక్షణ మంత్రులు మారారన్నారు. అరుణ్ జైట్లీ, మనోహర్ పారికర్ రాఫెల్ డీల్‌లో అవినీతి మరకలను తప్పించుకుని నిర్మలా సీతారామన్‌ను బలిపశువును చేశారని ఆరోపించారు. బోఫోర్స్ ఒప్పందంలో అవినీతిపై రాజీవ్ గాంధీకి వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేకున్నా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీజేపీ బురుదచల్లుతోందని ఆరోపించారు.
రక్షణ ఒప్పందాల్లో అవినీతి ఆరోపణలకు చోటులేకుండా వీటిపై చర్చించేందుకు, బేరసారాలకు కమిటీలను నియమించాలని ఆయన కోరారు. రాఫెల్ ఒప్పందంలో అక్రమాలు చోటుచేసుకోలేదని మోదీ సర్కార్ భావిస్తే దీనిపై సంయుక్త పార్లమెంటరీ కమిటీని నియమించేందుకు ఎందుకు వెనుకాడుతోందని కాంగ్రెస్ నేత ప్రశ్నించారు.