
సాక్షి, హైదరాబాద్: రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు విషయంలో కాంగ్రెస్ పార్టీతోపాటు విపక్షాలు చేస్తున్న ఆరోపణలు అర్థరహితమని కాగ్ నివేదిక తేలిపోయిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. రాజకీయ అవసరాల కోసమే రఫేల్ వ్యవహారంపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేసినట్టు కాగ్ నివేదికతో ప్రజలకు అర్థమైందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పు సరైనదేనని కాగ్ నివేదికతో మరోసారి రుజువైందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన దళారి వ్యవస్థను అంతం చేసి మోదీ సర్కారు సరికొత్త నిర్ణయాలు తీసుకుంటుందన్నారు.
ఇది రెండు ప్రభుత్వాల (భారత్-ఫ్రాన్స్) మధ్య జరిగిన ఒప్పందం ఇదని చెప్పారు. రఫేల్ వ్యవహారంపై విపక్షాల దుష్ప్రచారాన్ని, కాంగ్రెస్ పార్టీ దివాలాకోరుతనాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు. ఎన్నికల నోటిఫికేషన్ రాగానే.. అభ్యర్థుల ఎంపికతోపాటు పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తామన్నారు.