న్యూఢిల్లీ: రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం అంశంలో కేంద్ర ప్రభుత్వం తన అబద్ధాలతో సుప్రీంకోర్టునే తప్పుదారి పట్టించిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. రఫేల్ ఒప్పందంపై కాగ్ నివేదికను ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ)కి కూడా చూపించకపోయినా పీఏసీ కాగ్ నివేదికను పరిశీలించిందని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపిందని బీజేపీపై కాంగ్రెస్ విరుచుకుపడింది. కోర్టుకు తప్పుడు సమాచారం ఇవ్వడం ద్వారా బీజేపీ ప్రభుత్వం కోర్టు ధిక్కారానికి పాల్పడిందనీ, అసత్యాలను చెప్పిందని దుయ్యబట్టింది.
రఫేల్ ఒప్పందాన్ని సవాల్ చేస్తూ వచ్చిన వివిధ పిటిషన్లను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేస్తూ, ఈ ఒప్పందంలో అవకతవకలేమీ లేవంటూ ప్రభుత్వానికి క్లీన్‌చిట్ ఇవ్వడం తెలిసిందే. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులోని 21వ పేజీ, 25వ పేరాలో ‘రఫేల్ ఒప్పందాన్ని కాగ్ పరిశీలించింది. కాగ్ నివేదికను పీఏసీ కూడా తనిఖీ చేసింది’ అని ఉంది. అయితే వాస్తవానికి రఫేల్‌పై కాగ్ నివేదిక ఇంకా కనీసం సిద్ధం కాలేదు. కాబట్టి పీఏసీ ముందుకు ఆ నివేదిక వచ్చే ప్రసక్తే లేదు.
కానీ సుప్రీంకోర్టు మాత్రం కాగ్ నివేదికను పీఏసీ పరిశీలించిందని తన తీర్పులో పేర్కొంది. కోర్టుకు ప్రభుత్వం ఇచ్చిన తప్పుడు సమాచారం వల్లనే ఇలా జరిగిందనీ, కేంద్రం సుప్రీంకోర్టును కూడా తప్పుదారి పట్టించిందని కాంగ్రెస్‌తోపాటు ఇతర పిటిషనర్లు తాజాగా ఆరోపిస్తున్నారు. కోర్టు తీర్పు దోషాలతో కూడుకున్నదని వారంటున్నారు. కేంద్రం తప్పు కారణంగా తీర్పు ప్రభావితమైందనీ, కాబట్టి రఫేల్ కేసును సుప్రీంకోర్టు పునర్విచారించాలని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కోరింది. టైపింగ్‌లో పొరపాటు కారణంగానే ఈ అనర్థం జరిగి సుప్రీంకోర్టుకు సమాచారం తప్పు గా వెళ్లిందని కేంద్రం శనివారం స్పష్టతనిచ్చింది.
మాకు వచ్చిన వివరాల్లో అది లేదు..
పిటిషనర్లలో ఒకరైన ప్రముఖ సామాజిక కార్యకర్త ప్రశాంత్ భూషణ్ మాట్లాడుతూ ‘సుప్రీంకోర్టు తీర్పులోని 21వ పేజీలోని 25వ పేరా వాస్తవ దూరంగా, అబద్ధాలతో ఉంది. అంతేగాక మాకు అందించిన కేంద్రం స్పందనల్లో ఇది లేదు’ అని అన్నారు. మరో కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ మాట్లాడుతూ ‘దీనికి ఎవరు బాధ్యులు? ప్రభుత్వమే కదా. ఆ అఫిడవిట్‌ను అటార్నీ జనరల్ ఎలా ఆమోదించారు?’ అని ప్రశ్నించారు. రఫేల్ యుద్ధ విమానాల ధరలు, ఇతరత్రా సాంకేతికాంశాలపై సుప్రీంకోర్టు లోతుగా విచారణ జరపలేదనీ, ఒప్పందంలో అవకతవకలు తేలాలంటే సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని ఏర్పాటుచేయాల్సిందేనని కాంగ్రెస్ పేర్కొంది.
అది టైపింగ్‌లో తప్పు.. సరిచేయండి: కేంద్రం
టైపింగ్‌లో పొరపాటు కారణంగానే ఈ అనర్థం జరిగి సుప్రీంకోర్టుకు సమాచారం తప్పుగా వెళ్లిందని కేంద్రం శనివారం స్పష్టతనిచ్చింది. దీనిని సరిచేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. టైపింగ్‌లో పొరపాటు కారణంగా ఈ అంశం వివాదమవుతోందని కేంద్రం కోర్టుకు విన్నవించింది. కాగ్ నివేదికను పీఏసీ పరిశీలించిందని గానీ, కాగ్ నివేదికలో కొంత భాగాన్ని మాత్రమే పార్లమెంటుకు సమర్పించామని గానీ తాము సుప్రీంకోర్టుకు చెప్పలేదని కేంద్రం స్పష్టం చేసింది. తమ స్పందనలో ‘ఈజ్’ అనే పదానికి బదులుగా ఓ చోట ‘హ్యాజ్ బీన్’ అని, మరోచోట ‘వాజ్’ అని తప్పుగా టైప్ చేయడం కారణంగానే ఇలా జరిగిందని కేంద్రం వివరించింది. అంతేతప్ప సుప్రీంకోర్టును తప్పుదారి పట్టించే లేదా అబద్ధాలు చెప్పే ఉద్దేశం తమకు లేదంది.
Comments
Please login to add a commentAdd a comment