
న్యూఢిల్లీ: వివాదాస్పద రఫేల్ జెట్ విమానాల కొనుగోలు ఒప్పందం వివరాలను కేంద్రం సుప్రీంకోర్టుకు సమర్పించింది. 36 రఫేల్ విమానాల ధరల వివరాలను కూడా సీల్డ్ కవర్‌లో కోర్టుకు అందజేసింది. ఒప్పందం వివరాలను బహిర్గతం చేయాలంటూ బీజేపీ మాజీ నేతలు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ వివరాలను సోమవారం సమర్పించింది. ‘తక్కువ ధర, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పొందేందుకు ఫ్రెంచి సంస్థతో ఏడాది కాలంలో 74 సార్లు సమావేశమయ్యాం. 2013 డిఫెన్స్ ప్రొక్యూర్‌మెంట్ నిబంధనల మేరకే విమానాలను కొనుగోలు చేశాం. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్‌ఆమోదాన్నీ పొందాం. దేశానికి చెందిన ఏ సంస్థ పేరునూ ఒప్పందంలో భాగస్వామిగా సిఫారసు చేయలేదు’ అని కేంద్రం తెలిపింది.
హెచ్‌ఏఎల్‌తో ఒప్పందం కుదరనిదెందుకు?
రఫేల్ ఒప్పందంపై ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్‌ఏఎల్), ఫ్రెంచి సంస్థ డసో ఏవియేషన్ మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని కేంద్రం పేర్కొంది. ‘ముఖ్యంగా 108 రఫేల్ విమానాలను దేశీయంగా తయారు చేసే విషయంలో డసో సూచించిన దాని కంటే హెచ్‌ఏఎల్ కోరిన సమయం 2.5 రెట్లు ఎక్కువగా ఉంది. అందుకే డసో మరో సంస్థను ఎంపిక చేసుకుంది. విమానాలను దేశీయంగా తయారుచేసి అందజేసేందుకు భారత భాగస్వామిని ఎంపిక చేసుకునే వెసులుబాటు డీపీపీ ప్రకారం డసోకు ఉంది. విదేశీ సంస్థలకు చెల్లించే ప్రతి డాలరులో కనీసం 30 శాతం తిరిగి పెట్టుబడి, సేకరణ రూపంలో తిరిగి దేశానికి చేరుతుంది’ అని తెలిపింది. అనంతరం ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణను ఈ నెల 14వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.