
సాక్షి, న్యూఢిల్లీ : రాఫెల్ యుద్ధ విమానాలపై రాజకీయ రాద్ధాంతం జరుగుతున్న క్రమంలో ఈ ఒప్పందం ఎలా చేసుకున్నారనే వివరాలను అందించాలని సర్వోన్నత న్యాయస్ధానం బుధవారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈనెల 29లోగా ఒప్పంద వివరాలను సీల్డ్ కవర్‌లో సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది. యుద్ధవిమానాల ధర, వాటి ప్రమాణాల వివరాల్లోకి తాను వెళ్లబోనని సుప్రీం కోర్టు వివరణ ఇచ్చింది.
రాఫెల్ డీల్‌పై తాము కేంద్రానికి ఎలాంటి నోటీసులు జారీ చేయడం లేదని, పిటిషనర్ చేసిన ఆరోపణలు సరైనవికానందున కోర్టు వాటిని పరిగణనలోకి తీసుకోబోదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యులతో కూడిన సుప్రీం బెంచ్ పేర్కొంది. ఈ ఒప్పందంపై పిటిషన్లు దాఖలు చేసిన ఇద్దరు న్యాయవాదులు రాఫెల్ డీల్‌పై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని కోరారు.
ఈ ఒప్పందంలోని వివరాలను కేంద్రం వెల్లడించాలని లేదా ఒప్పందాన్ని రద్దు చేయాలని పిటిషనర్లు తమ పిటిషన్‌లో కోరారు. కాగా పిటిషనర్లు రాజకీయ ప్రయోజనాలను ఆశించి కేసు వేశారని కేంద్రం తరపు న్యాయవాది అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కోర్టుకు నివేదించారు. రాఫెల్ యుద్ధవిమానాలు జాతీయ భద్రతకు సంబంధించిన అంశమని అన్నారు. రూ 59,000 కోట్ల రాఫెల్ ఒప్పందంలో భారీగా అవినీతి చోటుచేసుకుందని పిటిషనర్ ఎంఎల్ శర్మ ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ 2015లో అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్‌తో పారిస్‌లో చర్చలు జరిపిన అనంతరం ఈ ఒప్పందాన్ని ప్రకటించారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment