
సాక్షి, బెంగళూరు: రాఫెల్ జెట్ విమానాల కొనుగోలు ఒప్పందంపై చర్చకు రావాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రధానికి సవాల్ విసిరారు. తన ప్రశ్నలతో ఆయన ఒక్క సెకను కూడా నిలువలేరని చెప్పారు. సోమవారం కర్ణాటకలోని బీదర్‌లో కాంగ్రెస్ నిర్వహించిన ‘జన ధ్వని’ సభలో రాహుల్ ప్రసంగించారు. రూ.58వేల కోట్ల ‘రాఫెల్’ కాంట్రాక్టును అస్సలు అనుభవం లేని తన మిత్రుడు అనిల్ అంబానీకి చెందిన 10 రోజుల కంపెనీకి కట్టబెట్టారన్నారు.
ఈ రంగంలో దిగ్గజమైన ప్రభుత్వరంగ హిందూస్థాన్ ఏరోనాటిక్స్‌ను పక్కనబెట్టడంతో వేలాదిమంది యువత ఉద్యోగావకాశాలు కోల్పోయారన్నారు. ‘ప్రధానికి దమ్ముంటే నా ముందుకు రమ్మనండి. నా కళ్లలోకి చూస్తూ ప్రశ్నలకు ఆయన ఎందుకు సమాధానం ఇవ్వరు?.. ఎందుకంటే ఆయన కాపలాదారు (చౌకీదార్) కాదు.. వాటాదారు(భాగీదార్)’ అని ఎద్దేవా చేశారు. నేషనల్ హెరాల్ట్ కేసులో ఐటీ దర్యాప్తును ఆదేశించినందుకే రాహుల్ ప్రధానిపై అసత్యారోపణలు చేస్తున్నారని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు.