
సాక్షి,న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు వ్యవహారంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మరోసారి తీవ్ర విమర్శలకు దిగారు. మోదీ ప్రభుత్వం చేసుకున్న రాఫెల్ ఒప్పందంతో పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి భారీగా మేలు చేశారని ధ్వజమెత్తారు. రాఫెల్ డీల్‌లో అప్పుల ఊబిలో కూరుకు పోయిన అడాగ్ కంపెనీకి పెద్ద ఎత్తున లబ్ది చేకూరిందని రాహుల్ ఆరోపించారు. 2015 ఏప్రిల్‌లో ప్రధాని ఫ్రాన్స్ పర్యటన, ఒప‍్పందానికి కేవలం పదిరోజుల ముందే అనిల్ అంబానీ రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్ కంపెనీని స్థాపించారని విమర్శించారు. ఈ మేరకు ఆయన కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రికార్డులను ఉదహరించారు. రూ. 35వేలకోట్ల రుణాలున్న కంపెనీకి 45వేలకోట్ల రూపాయల రాఫెల్ విమానాల తయారీ డీల్‌ను కట్టబెట్టడంపై ఆయన విమర్శలు గుప్పించారు.
రాఫెల్ విమానాల కొనుగోలు ఒప్పందానికి సంబంధించి ప్రధాని మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు ఈ ఆరోపణలు చేశారు. ఆ డీల్‌లో భారీగా ముడుపులు చేతులు మారాయని, దీని వెనుక మోదీ హస్తం ఉందని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే 35వేల కోట్ల రూపాయల రుణ ఊబిలో చిక్కుకున్న సంస్థకు రూ. 45,000 కోట్ల డీల్ దక్కిందన్నారు. వేలకోట్ల విలువైన ఈ ఒప్పందాన్ని ప్రభుత్వరంగ సంస్థ హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఎఎల్) ను కాదని కార్పొరేట్ ఫ్రెండ్‌కు ఎందుకు కట్టబెట్టారని రాహుల్ ప్రశ్నించారు. ముఖ్యంగా 35వేలకోట్ల రుణ సంక్షోభంతో ఒక్క విమానాన్ని కూడా తయారు చేయలేని కంపెనీకి ఈ డీల్ ఎలా కట్టబెట్టారని రాహుల్ ప్రశ్నించారు. అలాగే రాఫెల్ విమానాల ధర భారీగా పెరగడంలో మోదీపాత్ర ఉందనీ, యూపీఏ ఆధ్వర్యంలోని ఒప్పందం ప్రకారం ఒక్కో యుద్ధవిమానం ఖర్చు సగటున రూ 526 కోట్లుగా ఉంటే.. అది ఇప్పుడు రూ 1670 కోట్లకు పెరిగిందనీ, మోదీ మ్యాజిక్ ఇదేనని రాహుల్ దుయ‍్యబట్టారు.
కాగా ఫ్రాన్స్ నుండి దేశ రక్షణ కోసం 36 రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయనున్నట్టు 2015 ఏప్రిల్ లో ప్రధాని ప్రకటించారు. ప్రాన్స్‌కు చెందిన డసాల్ట్ ఏవియేషన్ కంపెనీ, అనిల్ అంబానీకిచెందిన అడాగ్‌తో ఒక జాయింట్ వెంచ్‌ర్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. వెబ్‌పైట్ అందించిన వివరాల ప్రకారం 5లక్షల రూపాయలతో అనిల్ అంబానీ ఆవిష్కరించిన కంపెనీకి ఇంత భారీ డీల్ దక్కడంపై విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇది చాలా అసాధారణమైందనీ, నిబంధనల ఉల్లంఘనల అనుమానాలను పెంచుతోందని వ్యాఖ్యానించారు.
మరోవైపు రాఫెల్ కుంభకోణం పార్లమెంట్‌ను కుదిపేస్తోంది. రాఫెల్ డీల్‌పై వివరాలను బహిర్గతం చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుండగా, ఈ ఒప్పందంలోని దేశ భద్రతా విషయాలు బయటకు చెప్పకూడదని, అది అధికార రహస్యాల వెల్లడి నిషేధం కిందకు వస్తుందని వెల్లడించడం సెగను రగిలించింది. దేశం ఆస్తులకు తాను కాపలాదారుగా ఉంటానని చెప్పిన మోదీ దోపిడిదారుడిగా అవతరించారంటూ ఈ నెల 20న ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై పార్లమెంట్‌లో చర్చ సందర్భంగా రాహుల్ ఫైర్ అయిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment