అఖిలపక్ష భేటీలో మోదీ, రాజ్‌నాథ్, ఖర్గే, గులాం నబీ ఆజాద్, ఇతర పార్టీల నేతలు
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ప్రజా ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అన్ని విషయాల్ని చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. ఈ పార్లమెంట్ సమావేశాల్ని ఆ దిశగా సద్వినియోగం చేసుకుందామని విపక్షాలకు పిలుపునిచ్చారు. కాగా, రఫేల్ ఒప్పందంపై సంయుక్త పార్లమెంట్ కమిటీ(జేపీసీ)తో విచారణ జరిపించాలని ఈ సమావేశాల్లో పట్టుపడుతామని కాంగ్రెస్ ప్రకటించింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి చట్టం తీసుకురావాలని ఎన్డీయే బాగస్వామి శివసేన డిమాండ్ చేసింది.
నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం సోమవారం అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటుచేసింది. లోక్‌సభ, రాజ్యసభల్లో వేర్వేరు పార్టీలకు చెందిన సభా నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రజా ప్రయోజనాల రీత్యా పార్లమెంట్ సజావుగా సాగేలా ప్రతిపక్షాలు సహకరించాలని ఈ సందర్భంగా మోదీ విజ్ఞప్తి చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు చివరి పూర్తిస్థాయి పార్లమెంట్ సమావేశాలు ఇవే కావడం గమనార్హం.
అయోధ్య..రఫేల్..సీబీఐ..
అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి బిల్లు తెచ్చే వరకూ పార్లమెంట్ కార్యకలాపాలను అడ్డుకుంటామని శివసేన సీనియర్ నాయకుడు చంద్రకాంత్ ఖైరే చెప్పారు. రఫేల్‌తో పాటు సీబీఐ, ఆర్‌బీఐ లాంటి సంస్థల దుర్వినియోగంపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత గులాం నబీ ఆజాద్ హెచ్చరించారు. ఆప్ నాయకుడు సంజయ్‌సింగ్‌తో కలసి ఆజాద్ ఈవీఎంల విశ్వసనీయతపై సందేహాలు వ్యక్తం చేశారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయొచ్చన్న సందేహాల నేపథ్యంలో ఎన్నికల పవిత్రత ప్రశ్నార్థకమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్ విధానాన్ని అమలుచేయాలని సంజయ్ సింగ్ డిమాండ్ చేశారు. పార్లమెంట్ పరిశీలించకుండా బిల్లుల్ని ఆమోదించొద్దని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతులు దోపిడీకి గురువుతున్నారని సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు రామ్ గోపాల్ యాదవ్ విమర్శించారు.
సమావేశాలకు సహకరిస్తాం: పార్లమెంట్ సమావేశాల్ని ఫలవంతంగా నిర్వహించేందుకు పూర్తిగా సహకరిస్తామని అధికార, విపక్ష పార్టీలు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడుకు హామీ ఇచ్చాయి. ముఖ్యమైన అంశాలు, బిల్లులపై చర్చ జరుగుతున్నప్పుడు ఇరు వర్గాలకు సమానంగా సమయం కేటాయించాలని కోరాయి. వేర్వేరు పార్టీల రాజ్యసభ నాయకులతో వెంకయ్య నాయుడు సోమవారం సమావేశం నిర్వహించారు. రాజ్యసభ కార్యకలాపా లు సజావుగా జరిగేలా తనకు అన్ని విధాలుగా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేయగా, సభ్యులు సాను కూలంగా స్పందించారు. కేంద్ర మంత్రులు సహా మొత్తం 31 మంది ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment