CBI cases
-
రఘురామకృష్ణరాజుకు బిగ్ షాక్
న్యూఢిల్లీ, సాక్షి: ఉండి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు సుప్రీం కోర్టు చుక్కెదురైంది. సీబీఐ కేసుల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న రఘురామ విజ్ఞప్తిని సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. అలాగే కేసును బదిలీ చేయాల్సిన అవసరమూ కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఆయన వేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేస్తున్నట్లు ఆదేశాలిచ్చింది.జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీష్‌చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం రఘురామ పిటిషన్‌పై ఇవాళ(జనవరి 27, సోమవారం) విచారణ జరిపింది. అయితే జగన్ బెయిల్ రద్దుకు కారణాలేవీ లేవని, కాబట్టి రద్దు చేయాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు పేర్కొంది. అలాగే సీబీఐ కేసులను మరో రాష్ట్రానికి బదిలీ చేయలేమన్న ధర్మాసనం.. ‘‘కేసులను మమ్మల్ని పర్యవేక్షణ చేయమంటారా?’’ అంటూ పిటిషనర్‌పై అసహనం వ్యక్తం చేసింది. ఒకానొక తరుణంలో పిటిషన్‌ను డిస్మిస్ చేస్తామని పిటిషనర్‌ను కోర్టు హెచ్చరించింది.. దీంతో పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటామని రఘురామ తరఫు న్యాయవాది బాలాజీ సుబ్రహ్మణ్యం కోర్టుకు తెలిపారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం జగన్ బెయిల్ రద్దు, కేసుల ట్రయల్ విచారణ ధర్మాసనం మార్పు చేయాలని రఘురామకృష్ణరాజు సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ వేశారు. గతంలో ఈ పిటిషన్‌ను జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిత్తల్ ధర్మాసనం విచారించగా.. ఆ తర్వాత జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్రశర్మ ధర్మాసనం ముందుకు వెళ్లింది. వాదనలు ఇలా.. గత 12 ఏళ్లుగా ట్రయల్ ఒక్క అడుగు కూడా ముందుకు కదల్లేదని.. ఒక్క డిశ్ఛార్జ్ అప్లికేషన్ కూడా డిస్పోజ్ చేయలేదని రఘురామ తరఫు న్యాయవాది బాలాజీ సుబ్రహ్మణ్యం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. బదిలీ సాధ్యం కాదని సుప్రీంకోర్టు గత విచారణలోనే చెప్పిందని.. తాము ఇప్పుడు కేసు మానిటరింగ్ పూర్తి స్థాయిలో జరగాలని కోరుతున్నామని తెలిపారు. అయితే.. సీబీఐ కేసుల వివరాలు, ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ సీబీఐ అఫిడవిట్ దాఖలు చేసిందని దర్యాప్తు సంస్థ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. మరోవైపు.. ఈ కేసును హైకోర్టు మానిటర్ చేస్తోందని.. ఇంకా కేసు అక్కడ పెండింగ్‌లో ఉందని జగన్ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ తెలిపారు. అన్నివైపులా వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం.. చివరకు రఘురామ పిటిషన్‌ను డిస్మస్ చేస్తూ ద్విసభ్య ధర్మాసనం ఇవాళ తీర్పు ఇచ్చింది. -
Big Question: బాబు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. సీబీఐకు స్వాగతం..!
-
కేసుల పుట్ట రఘురామకృష్ణరాజు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఆస్తులు, కేసుల పుట్ట అని వెల్లడైంది. ఆయన, ఆయన భార్య కనుమూరి రమాదేవి పేరిట స్థిర, చరాస్తులు మొత్తం కలిపి రూ.215.57 కోట్ల ఆస్తులు ఉన్నట్టు తేలింది. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ, మహారాష్ట్రల్లో 19 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో సీబీఐ కేసులు కూడా ఆయనపై ఉన్నాయి. ఈ మేరకు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి టీడీపీ అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు తరఫున ఆయన భార్య రమాదేవి శుక్రవారం రెండు సెట్ల నామినేషన్‌ను సమర్పించారు. ఉండి అభ్యర్థిగా టీడీపీ ఇంకా ఆయన పేరును అధికారికంగా ప్రకటించకపోవడం గమనార్హం. ఎన్నికల అఫిడవిట్లో ఆస్తులు, కేసుల వివరాలను పేర్కొన్నారు. వీటి ప్రకారం.. బ్యాంకుల్లో అప్పులు రూ.12.60 కోట్లు ఉన్నట్టు తెలిపారు. ఆస్తులు, అప్పులు ఇవి.. రఘురామకృష్ణరాజు పేరుతో రూ.13.89 కోట్లు, ఆయన భార్య రమాదేవి పేరుతో రూ.17.79 కోట్ల చరాస్తులు ఉన్నట్టు అఫిడవిట్లో చూపించారు. తమిళనాడు, తెలంగాణ, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, వాణిజ్య భవనాలు అన్నీ కలిపి రూ.8.48 కోట్లు రఘురామకృష్ణరాజు పేరిట, ఆయన భార్య పేరుతో రూ.175.45 కోట్లు ఆస్తులు ఉన్నట్టు తెలిపారు. రఘురామకృష్ణరాజుకు రూ.8.15 కోట్లు, ఆయన భార్యకు రూ.4.45 కోట్లు బకాయిలు ఉన్నట్టు చూపించారు. రఘురామపై కేసుల వివరాలివీ.. ►సైబరాబాద్‌లో వ్యక్తిని కిడ్నాప్ చేసిన ఘటనలో, నేరపూరిత కుట్ర ఆరోపణలతో పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల పోలీస్‌స్టేషన్‌లో, పెనుమంట్ర పోలీస్‌స్టేషన్ పరిధిలో కేసులు నమోదయ్యాయి. ►ఇండ్ భారత్ పవర్ ఇన్ఫ్రా లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్‌గా ఉండి ఫోర్జరీ, నకిలీ పత్రాలు సృష్టించడం, రూ.25 కోట్ల చెల్లింపులు చేయకపోవడానికి సంబంధించి మహారాష్ట్రలోని థానేలో ఉన్న ఆర్థిక నేరాల విభాగం 2022 జనవరి 27న ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీనికి సంబంధించి హైదరాబాద్ కోర్టులో రెండు కేసులు, ముంబై కోర్టులో ఒక కేసు కొనసాగుతున్నాయి. ►మత విద్వేషాలు రగిల్చేలా మాట్లాడినందుకు చింతలపూడి, మంగళగిరి, భీమవరం, పోడూరు, ఆచంట, పెనుగొండ, పెనుమంట్ర, నర్సాపురం పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదు చేశారు. ►కుట్ర, మోసం, ఫోర్జరీ చేశారని ఎస్బీఐ ఇచ్చిన ఫిర్యాదుపై, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌ను మోసం చేయడంతో ఢిల్లీలో సీబీఐ కేసులు నమోదు చేసింది. ►ఫెమా చట్టం ఉల్లంఘన కింద రూ.40 కోట్లు జరిమానా విధించిన కేసు తెలంగాణ హైకోర్టులో కొనసాగుతోంది. -
ఆస్తుల జప్తుతో ప్రయోజనం లేదు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రజాప్రతినిధులపై నమోదు చేస్తున్న కేసుల్లో ఆస్తుల జప్తుతో ప్రయోజనం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. సీబీఐ, ఈడీ సంస్థల దర్యాప్తులు నత్తనడక సాగుతుండటంపై అసంతృప్తి వ్యక్తం చేసిన సర్వోన్నత న్యాయస్థానం దర్యాప్తు జాప్యానికి తగిన కారణాలు తెలపడం లేదని పేర్కొంది. ప్రజాప్రతినిధులపై దాఖలైన కేసులు త్వరితగతిన విచారించాలంటూ న్యాయవాది అశ్వినీకుమార్ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా ధర్మాసనం పలు వ్యాఖ్యలు చేసింది. పది పదిహేనేళ్లు గడిచినా ఛార్జిషీటు దాఖలు చేయనందుకు దర్యాప్తు సంస్థలు తగిన కారణాలు చెప్పడం లేదని పేర్కొంది. ‘‘మాజీలు సహా 51 మంది ఎంపీలు మనీల్యాండలింగ్ కేసులో నిందితులు. 28 కేసులు ఇంకా దర్యాప్తు కొనసాగుతున్నాయి. ఆయా కేసులు సుమారు ఎనిమిది పదేళ్ల నాటివి. 121 సీబీఐ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో 58 కేసులు ఉరి లేదా జీవితఖైదు శిక్ష విధించతగినవి. 2010 నుంచి కూడా కేసు పెండింగ్ ఉంది. 37 కేసుల్లో సీబీఐ ఇంకా దర్యాప్తు దశలోనే ఉంది. దర్యాప్తు సంస్థలను నిలదీయాలని మా ఉద్దేశం కాదు. దర్యాప్తు సంస్థల తీరుపై మేము ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేయడం లేదు. అలాచేస్తే వారి నైతికస్థైర్యం దెబ్బతింటుంది. వారిపైనా న్యాయమూర్తుల మాదిరి భారం ఉంది. ఎంత సంయమనం పాటించినా నివేదికలు నిలదీస్తున్నాయి’’ అని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఛార్జిషీట్లు దాఖలు చేయకుండా ఆస్తులు జప్తు చేసి ఏం ప్రయోజనం ఉంటుందని సీజేఐ ప్రశ్నించారు. చాలా ఈడీ కేసుల్లో విదేశాల నుంచి స్పందన అవసరమని, సమాచారం సమయానికి అందడం లేదని, తద్వారా దర్యాప్తు జాప్యం అవుతోందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. దర్యాప్తు... కేసుల విచారణ వేగవంతం చేయండని చెప్పడం చాలా సులభమని, కానీ తగినంతగా న్యాయమూర్తులు లేరని సీజేఐ పేర్కొన్నారు. న్యాయమూర్తుల మాదిరే దర్యాప్తు సంస్థలు కూడా మానవ వనరులు లేక ఇబ్బందులు పడుతున్నాయని, ప్రతి ఒక్కరూ సీబీఐ దర్యాప్తు కోరుతున్నారని సీజేఐ వ్యాఖ్యానించారు. దర్యాప్తులో జాప్యాన్ని తగ్గించడానికి ఓ పాలసీ రూపొందించాలని అభిప్రాయపడ్డారు. న్యాయమూర్తులు, మౌలిక సదుపాయాల ఏర్పాటు సమస్యగా ఉందన్న సీజేఐ దీని పరిష్కారం నిమిత్తం ప్రత్యేక కోర్టుల ఏర్పాటు దిశగా యోచిస్తామని పేర్కొన్నారు. దురుద్ధేశాలతో పెట్టిన కేసులను ఉపసంహరించే హక్కు రాష్ట్రాలకు ఉందని, అలాంటి కేసులను ఎత్తివేయవద్దని తాము చెప్పడం లేదని ధర్మాసనం పేర్కొంది. అయితే ప్రజాప్రతినిధులపై కేసుల ఉపసంహరణకు ప్రభుత్వాలు సంబంధిత హైకోర్టుకు తగిన కారణాలను వివరించాలంది. -
రాయపాటి మెడకు ఈడీ ఉచ్చు!
సాక్షి, అమరావతి, సాక్షి హైదరాబాద్: టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ప్రమోటర్, చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ట్రాన్స్ట్రాయ్ 18 బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.8,836.45 కోట్ల రుణంలో రూ.3,822 కోట్లను నిబంధనలకు విరుద్ధంగా మళ్లించడంపై ఈడీ శుక్రవారం కేసు నమోదు చేసింది. సంస్థ ఎండీ చెరుకూరి శ్రీధర్, డైరెక్టర్ సూర్యదేవర శ్రీనివాసబాబ్జీలపై కూడా కేసులు నమోదు చేసింది. ఫెమా (విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం)కు విరుద్ధంగా సింగపూర్, రష్యా, ఉక్రెయిన్, మలేíసియాలకు రాయపాటి అక్రమంగా భారీగా నిధులు మళ్లించడంపై ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ట్రాన్స్ట్రాయ్ తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో రుణం తీసుకుని ఎగ్గొట్టడంపై యూనియన్ బ్యాంకు ఫిర్యాదు మేరకు డిసెంబర్ 30న రాయపాటి తదితరులపై సీబీఐ కేసులు నమోదు చేయడం తెలిసిందే. దీనిపై సీబీఐ, ఈడీ సమాంతరంగా విచారణ చేపట్టాయి. రికార్డులు ఇవ్వకుండా ఎస్ఈపై ఒత్తిడి? పోలవరం హెడ్‌వర్క్స్ పనులను ట్రాన్స్ట్రాయ్ చేస్తున్న సమయంలో 2017 మార్చి 31 నుంచి డిసెంబర్ 31 మధ్య తాము ఆడిటింగ్ నిర్వహించగా ఎస్ఈ రికార్డులివ్వకుండా సహాయ నిరాకరణ చేశారంటూ యూనియన్ బ్యాంకు రీజనల్ హెడ్ ఎస్కే భార్గవ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా అప్పటి టీడీపీ ప్రభుత్వ పెద్దలకు, రాయపాటికి ఉన్న సంబంధాలపై దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయి. రికార్డులివ్వకుండా ఎస్ఈని నాటి ప్రభుత్వమే ప్రభావితం చేసిందని సీబీఐ నిర్ధారణకొచ్చినట్లు సమాచారం. మంత్రివర్గ నిర్ణయాన్ని తుంగలో తొక్కి ఎస్క్రో అకౌంట్ ద్వారా కాకుండా ట్రాన్స్‌ట్రాయ్‌కి నేరుగా రూ.2,267.22 కోట్ల బిల్లులు చెల్లించడం, సింహభాగాన్ని సింగపూర్, రష్యా, మలేíసియాకు మళ్లించడంలో లోగుట్టుపై పరిశోధిస్తున్నాయి. దొడ్డిదారిన బిల్లుల చెల్లింపు!: ట్రాన్స్ట్రాయ్ రుణాలను తిరిగి చెల్లించడం లేదని ఈ నేపథ్యంలో పోలవరం బిల్లులు చెల్లించే సమయంలో తమ బకాయిల వసూలుకు సహకరించాలంటూ 2015 జూలై 31న అప్పటి సీఎం చంద్రబాబును జాతీయ బ్యాంకుల కన్సార్షియం కోరింది. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాల్సిన చంద్రబాబు అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. అప్పులు ఇచ్చిన బ్యాంకుల కన్సార్షియం ద్వారా కాక గత సర్కారు ఇతర బ్యాంకుల ద్వారా ట్రాన్స్‌ట్రాయ్‌కి దొడ్డిదారిన బిల్లులివ్వడంపై సీబీఐ దృష్టి సారించింది. ‘ఎస్క్రో’ అకౌంట్ ద్వారా బిల్లులు చెల్లిస్తామని నాడు టీడీపీ సర్కార్ హామీ ఇస్తేనే రూ.300 కోట్ల రుణమిచ్చామని బ్యాంక్ ఆఫ్ బరోడా ఫిర్యాదులో పేర్కొనడం గమనార్హం. విభేదాలతో వెలుగులోకి?: కేసులో సీబీఐ దర్యాప్తు వేగంగా జరగడానికి, స్వల్పకాలంలో కీలక ఆధారాలు లభించడానికి రాయపాటి కుటుంబంతో చెరుకూరి శ్రీధర్‌కి తలెత్తిన విభేదాలే కారణమని తెలుస్తోంది. తన తండ్రికి తెలియకుండా శ్రీధర్ అక్రమాలకు పాల్పడినట్లు రాయపాటి రంగారావు ఇటీవల సీబీఐ, ఈడీ, ప్రధానికి కొన్ని ఆధారాలతో లేఖలు రాసినట్లు సమాచారం. సింగపూర్‌కు తరలిన నిధులు..? సింగపూర్‌లోని ట్రాన్స్ట్రాయ్ సింగపూర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు రూ.15.34 కోట్లను మళ్లించినట్లు వెలుగులోకి వస్తోంది. ఇందులో డైరెక్టర్లు ఎవరు? వారికి రాయపాటితో ఉన్న సంబంధాలు ఏమిటి? అనే అంశంపై సీబీఐ, ఈడీ వేర్వేరుగా విచారణ చేస్తున్నాయి. టీడీపీ ముఖ్యనేత సన్నిహితులు ఈ సంస్థల డైరెక్టర్లుగా ఉన్నట్లు ఈడీ గుర్తించింది. శ్రీజయలక్ష్మి పవర్ కార్పొరేషన్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థకు రూ.36.50 కోట్లను ట్రాన్స్ట్రాయ్ మళ్లించడంపైనా ఈడీ కూపీ లాగుతోంది. -
'సీబీఐ చెప్పిందే చివరి నిర్ణయం కాదు'
సాక్షి, కడప : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై తెలుగుదేశం నాయకులు చేస్తున్న ఆరోపణలు అవివేకమని వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి సి. రామచంద్రయ్య మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయి పలుమార్లు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోలేదా అంటూ గుర్తుచేశారు. జగన్ నేరస్తుడు కాదని, ఆయనపై కేవలం ఆరోపణలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత వైఎస్ జగన్‌కు ఉండడంతో కోర్టుకు వెళ్లి అప్పీల్ చేసుకున్నారు. సీబీఐ చెప్పిందే చివరి నిర్ణయం కాదని , పైకోర్టులు ఇచ్చే తీర్పే అసలు నిర్ణయం అని వెల్లడించారు. ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారన్న చింత లేకుండా టీడీపీ అధినేత చంద్రబాబు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో పెయిడ్ ఆర్టిస్ట్‌లను ఏర్పాటు చేసి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో చంద్రబాబు అనేకసార్లు మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని, ఆయనకు చిల్లర పార్టీల మద్దతు మాత్రమే ఉందని స్పష్టం చేశారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇసుక అక్రమంగా తవ్వించినందుకు రూ.100 కోట్ల ఫెనాల్టీ వేసిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రభుత్వం తప్పు చేస్తే అడిగే హక్కు ఎవరికైనా ఉందని, కానీ తప్పు చేయకుండానే తప్పుడు వార్తలు రాసే పత్రికలపై చర్యలు తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఉందని తెలిపారు. ఒక పార్టీ అధ్యక్షుడిగా రెండు చోట్ల పోటీ చేస్తే ఓడిపోయిన ఘనత దేశ చరిత్రలో పవన్‌కల్యాణ్‌కు మాత్రమే ఉందని పేర్కొన్నారు. చంద్రబాబు తలపెట్టే కార్యక్రమాలను భుజానికెత్తుకునే పవన్‌కు జగన్ నైతికత గురించి మాట్లాడే హక్కు లేదని మండిపడ్డారు. -
మోదీ చోర్!
సాక్షి ప్రతినిధి, ఏలూరు/మెట్రో/సాక్షి, అమరావతి : ప్రధాని నరేంద్ర మోదీని దేశం మొత్తం చోర్ (దొంగ) అని అంటోందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాఫెల్ కుంభకోణంలో రూ.43వేల కోట్లు కొల్లగొట్టి తన స్నేహితునికి మోదీ అప్పగించారని ఆరోపించారు. ఆయన పాలనలో ఆర్థిక వ్యవస్థ పతనమైందని, బ్యాంకులు లూటీ అయ్యాయనీ, వాటిని దోపిడీ చేసిన వారు విదేశాలకు పారిపోయారన్నారు. వీటన్నింటినీ ప్రశ్నించే వారిపై ఆయన అక్రమంగా కేసులు బనాయించేందుకు సీబీఐని ప్రయోగిస్తున్నారన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో నిర్వహించిన 6వ విడత జన్మభూమి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. యూపీలో అఖిలేష్ యాదవ్, మాయావతి పొత్తు పెట్టుకుంటే అఖిలేష్‌పై కేంద్రం సీబీఐ కేసులు పెట్టిందన్నారు. అనుకూలంగా ఉన్నందుకే కేసీఆర్‌పై కేసును తప్పించారని, అదే విధంగా రాష్ట్రంలో ప్రతిపక్ష నేతపైనా కేసులు తప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారన్నారు. భవిష్యత్‌లో నీతివంతమైన పాలన అందించేందుకు కాంగ్రెస్‌తో జతకట్టామని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రధానికి ఆ అర్హతలేదు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచానని మోదీ అంటున్నారనీ, ఆయన గురించి మాట్లాడే అర్హత ప్రధానికి లేదని చంద్రబాబు చెప్పారు. తాను ప్రధాని పదవి కోసం కలలు కంటున్నానని అనడంలో వాస్తవంలేదనీ, రెండుసార్లు ప్రధాని పదవి కోసం అవకాశం వచ్చినా వదులుకున్న ఘనత తనదన్నారు. తన కుమారుడు లోకేష్ అభివృద్ధి కోసం తాను పాటుపడుతున్నట్లు అంటున్నారనీ, కానీ.. తాత ఆశయాలు నెరవేర్చేందుకు రాజకీయాల్లోకి వస్తానని లోకేష్ చెప్పాడని చంద్రబాబు చెప్పారు. కేంద్ర ప్రభుత్వాన్ని మార్చేందుకే తాను ఢిల్లీకి వెళ్తున్నట్లు సీఎం చెప్పారు. కేంద్రం, వైఎస్సార్సీపీ కలిసి రాష్ట్ర హక్కులు కాలరాసే విధంగా ఎన్ఐఏను తీసుకొచ్చారన్నారు. ‘పోలవరం’లో గిన్నీస్ రికార్డు: పోలవరం ప్రాజెక్టు కాంక్రీట్ పనుల్లో నవయుగ సంస్థ గిన్నిస్ రికార్డును సాధించింది. 2019 జనవరి 6న చేపట్టిన కాంక్రీట్ పనులకు సంబంధించి 24 గంటల్లో 32,315.5 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసి ఇంజినీర్లు డబుల్ వరల్డ్ రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు గిన్నిస్ ప్రతినిధుల చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. 2019లో గ్రావిటీ ద్వారా నీరు అందించి తీరతామని చంద్రబాబు అన్నారు. ఈ సందర్భంగా రామయ్యపేటలో పైలాన్ ఆవిష్కరించారు. సీఎంతో టోనీ బ్లెయిర్ భేటీ ఇదిలా ఉంటే.. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ చంద్రబాబుతో సమావేశమయ్యారు. సచివాలయానికి సోమవారం రాత్రి వచ్చిన బ్లెయిర్ను సీఎం ఆర్టీజీ సెంటర్‌కు తీసుకెళ్లి దాని గురించి వివరించారు. టోనీకి తనకు మధ్య ఎప్పటి నుంచో సాన్నిహిత్యం ఉందని చంద్రబాబు చెప్పారు. అనంతరం బ్లెయిర్ను సన్మానించారు. ఆ తర్వాత సచివాలయంలోనే టోనీకి సీఎం ఆతిథ్యమిచ్చారు. -
బీజేపీపై ఉమ్మడి పోరాటం
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయేకు వ్యతిరేకంగా కూటమి కట్టాలని 21 విపక్ష పార్టీలు నిర్ణయించాయి. ఎన్డీఏయేతర పార్టీలకు చెందిన అగ్ర నాయకులు సోమవారం ఢిల్లీలోని పార్లమెంట్ అనుబంధ భవనంలో సమావేశమై ఉమ్మడి వ్యూహ రచనపై మంతనాలు జరిపారు. రఫేల్ విమానాల కొనుగోలు ఒప్పందంలో అవినీతి, సీబీఐ, న్యాయ వ్యవస్థలో వెలుగుచూసిన అసాధారణ పరిణామాలు, నోట్లరద్దు ప్రభావాలు ప్రముఖంగా చర్చకు వచ్చాయి. బీఎస్పీ, ఎస్పీ మినహా దాదాపు అన్ని ప్రధాన పార్టీలు ఈ సమావేశంలో పాల్గొన్నాయి. బీజేపీ హయాంలో ఆర్బీఐ, సీబీఐ లాంటి సంస్థలపై దాడి జరుగుతోందని ప్రతిపక్షాలు మూకుమ్మడిగా ఆరోపించాయి. రాష్ట్రాల వారీ పొత్తులే నయం.. బీజేపీ వ్యతిరేక ఓట్లను కూటగట్టడానికి రాష్ట్రాల వారీగా పొత్తులు పెట్టుకోవడం మేలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సూచించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ కూడా ఈ ఆలోచనకు మద్దతు పలికినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఏ క్షణమైనా తమ వైఖరిని మార్చుకునే బీఎస్పీ, ఎస్పీలు ఈ సమావేశానికి హాజరుకాకపోవడం పలు సందేహాలకు తావిస్తోంది. 80 సీట్లున్న యూపీకి చెందిన ఈ పార్టీలు లేకుండా ఎన్డీయేకు ధీటుగా కూటమి ఏర్పాటుచేయడం అసాధ్యం. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ప్రధాని దేవెగౌడ, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతా రాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, ఎన్సీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా, ఆర్జేడీ నుంచి తేజస్వి యాదవ్ పాల్గొన్నారు. వినాశన యత్నాల్ని అడ్డుకుంటాం ఆర్బీఐ లాంటి సంస్థలను నాశనం చేయడానికి జరుగుతున్న ప్రయత్నాల్ని నిలువరించా లని విపక్షాలన్నీ ఏకాభిప్రాయానికి వచ్చాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా చేయడంతో దేశంలో ఆర్థి క అత్యవసర పరిస్థితి ప్రారంభమైందని మమతా బెనర్జీ ఆరోపించారు. ఆర్బీఐ గవర్నర్ ఇలా ఉన్నపళంగా ఎప్పుడూ రాజీనామా చేయలేదని, తాజా పరిణామం తనను షాక్‌కు గురిచేసిందన్నారు. ప్రజాస్వామ్యాన్ని, వ్యవస్థల్ని పరిరక్షించడానికే విపక్షాలన్నీ చేతులు కలిపాయని, ఈ సమావేశం చారిత్రకమని చంద్రబాబు చెప్పారు. -
ప్రజా ప్రయోజనాలపై చర్చిద్దాం
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ప్రజా ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అన్ని విషయాల్ని చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. ఈ పార్లమెంట్ సమావేశాల్ని ఆ దిశగా సద్వినియోగం చేసుకుందామని విపక్షాలకు పిలుపునిచ్చారు. కాగా, రఫేల్ ఒప్పందంపై సంయుక్త పార్లమెంట్ కమిటీ(జేపీసీ)తో విచారణ జరిపించాలని ఈ సమావేశాల్లో పట్టుపడుతామని కాంగ్రెస్ ప్రకటించింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి చట్టం తీసుకురావాలని ఎన్డీయే బాగస్వామి శివసేన డిమాండ్ చేసింది. నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం సోమవారం అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటుచేసింది. లోక్‌సభ, రాజ్యసభల్లో వేర్వేరు పార్టీలకు చెందిన సభా నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రజా ప్రయోజనాల రీత్యా పార్లమెంట్ సజావుగా సాగేలా ప్రతిపక్షాలు సహకరించాలని ఈ సందర్భంగా మోదీ విజ్ఞప్తి చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు చివరి పూర్తిస్థాయి పార్లమెంట్ సమావేశాలు ఇవే కావడం గమనార్హం. అయోధ్య..రఫేల్..సీబీఐ.. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి బిల్లు తెచ్చే వరకూ పార్లమెంట్ కార్యకలాపాలను అడ్డుకుంటామని శివసేన సీనియర్ నాయకుడు చంద్రకాంత్ ఖైరే చెప్పారు. రఫేల్‌తో పాటు సీబీఐ, ఆర్బీఐ లాంటి సంస్థల దుర్వినియోగంపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత గులాం నబీ ఆజాద్ హెచ్చరించారు. ఆప్ నాయకుడు సంజయ్‌సింగ్‌తో కలసి ఆజాద్ ఈవీఎంల విశ్వసనీయతపై సందేహాలు వ్యక్తం చేశారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయొచ్చన్న సందేహాల నేపథ్యంలో ఎన్నికల పవిత్రత ప్రశ్నార్థకమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్ విధానాన్ని అమలుచేయాలని సంజయ్ సింగ్ డిమాండ్ చేశారు. పార్లమెంట్ పరిశీలించకుండా బిల్లుల్ని ఆమోదించొద్దని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతులు దోపిడీకి గురువుతున్నారని సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు రామ్ గోపాల్ యాదవ్ విమర్శించారు. సమావేశాలకు సహకరిస్తాం: పార్లమెంట్ సమావేశాల్ని ఫలవంతంగా నిర్వహించేందుకు పూర్తిగా సహకరిస్తామని అధికార, విపక్ష పార్టీలు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడుకు హామీ ఇచ్చాయి. ముఖ్యమైన అంశాలు, బిల్లులపై చర్చ జరుగుతున్నప్పుడు ఇరు వర్గాలకు సమానంగా సమయం కేటాయించాలని కోరాయి. వేర్వేరు పార్టీల రాజ్యసభ నాయకులతో వెంకయ్య నాయుడు సోమవారం సమావేశం నిర్వహించారు. రాజ్యసభ కార్యకలాపా లు సజావుగా జరిగేలా తనకు అన్ని విధాలుగా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేయగా, సభ్యులు సాను కూలంగా స్పందించారు. కేంద్ర మంత్రులు సహా మొత్తం 31 మంది ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలకు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి వచ్చే ఏడాది జనవరి 8 వరకూ ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా మంగళవారం వెలువడనున్న నేపథ్యంలో సమావేశాలు వాడీవేడిగా సాగనున్నాయి. ఈ సమావేశాల్లో ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా, సీబీఐలో అంతర్గత కుమ్ములాటలు, రఫేల్ ఒప్పందంపై కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. అయోధ్యలో రామాలయం నిర్మాణంపై మిత్రపక్షం శివసేన నుంచే బీజేపీకి ఇబ్బందులు ఎదురుకానున్నాయి. మరోవైపు అగస్టా కుంభకోణం కేసులో మధ్యవర్తి మిషెల్‌ను దుబాయ్ నుంచి భారత్‌కు తీసుకురావడం, విజయ్‌మాల్యా అప్పగింతపై బ్రిటన్ కోర్టు తీర్పును ఈ సమావేశాల్లో ఎన్డీయే ప్రధా న అస్త్రంగా వాడుకోనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రిపుల్ తలాక్, నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి తదితర 45 కీలక బిల్లులను ఈ సమావేశాల్లోనే ఆమోదింపజేసుకోవాలని కేంద్రం కృతనిశ్చయంతో ఉంది. -
సర్వోమ్యాక్స్ లబ్ధి కోసమే ఆ పిటిషన్ దాఖలైందా?
సాక్షి, హైదరాబాద్: ఇప్పటికే రూ.700 కోట్ల మేర రుణ బకాయిల ఎగవేత ఆరోపణలతో సీబీఐ కేసు ఎదుర్కొంటున్న విద్యుత్ ఉపకరణాల తయారీ కంపెనీ సర్వోమ్యాక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్‌ఐపీఎల్) మరో వివాదంలో చిక్కుకుంది. సర్వోమ్యాక్స్‌పై దివాలా ప్రక్రియ ప్రారంభించాలంటూ మురళీకృష్ణ పవర్ కంట్రోల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పిటిషన్ దాఖలు చేసి ఆ మేర ఉత్తర్వులు పొందిన విషయం తెలిసిందే. అయితే ఈ పిటిషన్‌ను సర్వో మ్యాక్స్‌కు లబ్ధి చేకూర్చేందుకే మురళీకృష్ణ కంపెనీ దాఖలు చేసిందన్న ప్రాథమిక నిర్ణయానికి వచ్చిన దివాలా పరిష్కార నిపుణులు (ఆర్పీ) దీన్ని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) హైదరాబాద్ బెంచ్ దృష్టికి తీసుకొచ్చారు. 2 కంపెనీల ఖాతా పుస్తకాల్లోని లావాదేవీలు అనుమానాస్పదంగా ఉండటంతో సర్వోమ్యాక్స్ డైరెక్టర్లతో మురళీకృష్ణ కంపెనీ కుమ్మక్కై దివాలా పిటిషన్ దాఖలు చేసిందా? అన్న అంశంపై విచారణ జరిపించాలని కోరుతూ ఎన్సీఎల్టీలో పిటిషన్ దాఖలుచేశారు. మురళీకృష్ణ కంపెనీ దాఖలు చేసిన దివాలా పిటిషన్ వెనుక దురుద్దేశాలు ఉన్నట్లు తేలితే, ఇందులో ప్రమేయమున్న వ్యక్తులకు రూ.లక్ష నుంచి రూ.కోటి వరకు జరిమా నా విధించాలని ట్రిబ్యునల్‌ను కోరారు. పిటిషన్‌పై స్పందించిన ఎన్సీఎల్టీ సర్వోమ్యాక్స్, మురళీకృష్ణ పవర్ కంట్రోల్స్‌కు నోటీసులు జారీ చేసింది. మొత్తం వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలు తమ ముం దుంచాలని ఆదేశించింది. తదుపరి విచారణ ను ఈ నెల 27కి వాయి దా వేసింది. ఇన్సాల్వెన్సీ, బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ) అమల్లోకి వచ్చాక ఇటువంటి పిటిషన్ దాఖలు కావడం ఎన్సీఎల్టీ చరిత్రలో ఇదే మొదటిసారి. సర్వోమ్యాక్స్ ఇండియా పలు బ్యాంకులు, కంపెనీల నుంచి రూ.700 కోట్ల మేర రుణాలు తీసుకుంది. ఈ రుణాలు చెల్లించకపోవడంతో సర్వోమ్యాక్స్‌పై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీబీఐకి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన సీబీఐ సర్వోమ్యాక్స్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. మురళీకృష్ణ పవర్ కంట్రోల్స్‌ను సర్వోమ్యాక్స్ ఉద్యోగులు, మాజీ వాటాదారులు, డైరెక్టర్లు కలసి ఏర్పాటు చేసినట్లు సీబీఐ ఎఫ్ఐఆర్లో పేర్కొంది. అప్పు ఇచ్చిన కంపెనీయే బకాయిదారు... మురళీకృష్ణ కంపెనీకి మొదట సర్వోమ్యాక్స్ కొంత అప్పు ఇచ్చింది. ఆ తర్వాత అనూహ్యంగా మురళీకృష్ణ కంపెనీ ఎన్సీఎల్టీని ఆశ్రయించింది. సర్వోమ్యాక్స్ తమకు రూ.8.77 కోట్ల మేర బకాయిలు చెల్లించడంలేదని, అందువల్ల ఆ కంపెనీ దివాలా ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. ఇందుకు ఎన్సీఎల్టీ సానుకూలంగా స్పందించింది. దివాలా పరిష్కార నిపుణులు (ఆర్పీ)గా తొలుత కొండపల్లి వెంకట శ్రీనివాస్ నియమితులయ్యారు. ఆయన నియామకంపై రుణదాతల కమిటీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో జి.మధుసూధన్‌రావును ఆర్పీగా నియమిస్తూ ఎన్సీఎల్టీ ఉత్తర్వులిచ్చింది. రంగంలోకి దిగిన మధుసూధన్‌రావు సర్వోమ్యాక్స్ కంపెనీ ఖాతాలను పరిశీలించారు. ఈ సమయంలో ఆడిట్ అభ్యంతరాలు ఆయన దృష్టికి వచ్చాయి. మురళీకృష్ణ కంపెనీ నుంచి సర్వోమ్యాక్స్‌కు రూ.9.94 కోట్లు రావాల్సి ఉండగా, ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి ఖాతా పుస్తకాల్లో పద్దులు మార్చి, సర్వోమ్యాక్సే మురళీకృష్ణ కంపెనీకి రూ.8.77 కోట్లు అప్పు ఉన్నట్లు పేర్కొని ఉండటాన్ని ఆడిటర్ గమనించారు. దీంతో ఆడిటర్, ఆర్పీ ఇద్దరూ ఆ రెండు కంపెనీల వివరణ కోరారు. సర్వోమ్యాక్స్ చెల్లించాల్సిన అప్పు తాలూకు ఆధారాలను సమర్పించాలని మురళీకృష్ణ కంపెనీలను మెయిల్స్ ద్వారా కోరారు. స్పందించని ఇరు కంపెనీలు.. అయితే దీనిపై ఇరు కంపెనీల నుంచి సమాధానాలు రాలేదు. దీంతో మురళీకృష్ణ తనకు సర్వోమ్యాక్స్ నుంచి రావాలని చెబుతున్న రుణం రూ.8.77 కోట్లను తిరస్కరిస్తున్నట్లు మధుసూధన్‌రావు ఆ కంపెనీకి సమాచారమిచ్చారు. ఆ తర్వాత రుణదాతల సమావేశంలో ఈ రెండు కంపెనీల తీరుపై చర్చ జరిగింది. బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.700 కోట్ల రుణ బకాయి ఎగవేత విషయంలో సర్వోమ్యాక్స్‌కు లబ్ధి చేకూర్చేందుకే మురళీకృష్ణ కంపెనీ ఎన్సీఎల్టీ ముందు పిటిషన్ దాఖలు చేసిందా? అన్న అనుమానం వచ్చింది. దీంతో ఈ కంపెనీల వ్యవహారాన్ని పిటిషన్ ద్వారా ఎన్సీఎల్టీకి తెలియజేయాలని సమావేశంలో తీర్మానించారు. దీంతో ఇరు కంపెనీలు వ్యవహరించిన తీరును ఆర్పీ మధుసూధన్‌రావు లిఖితపూర్వంగా ఎన్సీఎల్టీకి నివేదించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ఎన్సీఎల్టీ సభ్యులు.. రాటకొండ మురళీ, సర్వోమ్యాక్స్ మాజీ డైరెక్టర్లు అవసరాల వెంకటేశ్వరరావు, దొప్పలపూడి హరీశ్‌కుమార్, వెంకట చంద్ర రావులపాటి శేఖర్, మురళీకృష్ణ పవర్ కంట్రోల్స్ లిమిటెడ్‌లతో పాటు ఆడిటింగ్ కంపెనీకి కూడా నోటీసులు జారీ చేశారు. -
నీతిమంతమైన నాయకుల్లా ఉండాలి
న్యూఢిల్లీ: సీబీఐ, ఆర్బీఐ వివాదాలు ముదురుతున్న నేపథ్యంలో ఆయా సంస్థల్లో అత్యున్నత స్థానాల్లో ఉన్నవారు నీతిమంతమైన నాయకుల్లా ఉండాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హితవు పలికారు. విజిలెన్స్ వారోత్సవాల సందర్భంగా కేంద్ర నిఘా కమిషన్ (సీవీసీ) ఏర్పాటు చేసిన సమావేశంలో కోవింద్ బుధవారం మాట్లాడారు. ‘ఇక్కడ ఉన్న వాళ్లలో ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా సంస్థలు, ఇతర ఆర్థిక సంస్థలకు చెందిన అత్యున్నతాధికారులు, ప్రభుత్వాధికారులు కూడా ఉన్నారు. చిత్తశుద్ధి, పారదర్శకత, నిజాయితీ అనే పదాలకు లోతైన అర్థాలను మీరంతా అర్థం చేసుకోవడం ముఖ్యం. మీ ప్రవర్తన మీ సంస్థల్లోని వేలాది మంది ఉద్యోగులకు స్ఫూర్తినివ్వాలి. మీ పని, నైతిక విలువలు కోట్లాది మంది పౌరుల జీవితాలను ప్రభావితం చేస్తాయి. నిజానికి మీరంతా నీతిమంతమైన నాయకుల్లా ఉండాలి’ అని కోవింద్ కోరారు. అలోక్, అస్థానాలకు త్వరలో సమన్లు సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్థానాలకు త్వరలోనే సమన్లు జారీచేసే అవకాశముందని కేంద్ర విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరి బుధవారం తెలిపారు. మాంసం వ్యాపారి మొయిన్ ఖురేషీ కేసులో ముడిపుల స్వీకరణకు సంబంధించి వీరి వాంగ్మూలాలు నమోదుచేయొచ్చని వెల్లడించారు. -
కాంట్రాక్టర్ శేఖర్‌రెడ్డికి ఊరట
సాక్షి ప్రతినిధి, చెన్నై: చట్ట విరుద్ధంగా నగదు చెలామణీ నెపంతో సీబీఐ నమోదు చేసిన రెండు కేసుల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి మాజీ సభ్యుడు, ఇసుక కాంట్రాక్టర్ శేఖర్‌రెడ్డికి విముక్తి లభించింది. రెండు కేసులను మద్రాసు హైకోర్టు బుధవారం కొట్టివేసింది. ‘మొదటి ఎఫ్ఐఆర్లోని అంశాలు, అందులో చేసిన ఆరోపణలు, పెట్టిన సెక్షన్లనే ఆ తర్వాత నమోదు చేసిన రెండు ఎఫ్ఐఆర్లలో కూడా పేర్కొన్నారు కాబట్టి, ఎలాంటి కొత్త అంశాలు లేవు కాబట్టి ఆ రెండు ఎఫ్ఐఆర్లను కొట్టివేస్తున్నా’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఐటీ శాఖ ఇచ్చిన వివరాల ఆధారంగానే సీబీఐ కేసులు పెట్టింది తప్ప కొత్త ఆధారాలేవీ సేకరించలేదని వ్యాఖ్యానించారు. శేఖర్‌రెడ్డి తదితరులపై రూ.34 కోట్ల కేసు మాత్రమే విచారణలో ఉంది. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో 2016 నవంబర్‌లో ఐటీ అధికారులు శేఖర్‌రెడ్డి ఇళ్లు, కార్యాలయాలలోనూ, అప్పటి సీఎస్ రామమోహన్‌రావు ఇంట్లోనూ సోదాలు జరిపారు. శేఖర్‌రెడ్డి వ్యాపార భాగస్వాములైన శ్రీనివాసులు, ప్రేమ్‌కుమార్, దిండుగల్లు రత్నం, ముత్తుపేట్టై రామచంద్రన్‌లను అరెస్ట్ చేశారు. సీబీఐ, ఎన్ఫోర్సుమెంటు డైరెక్టరేట్ అధికారులు మూడు వేర్వేరు కేసులు పెట్టారు. ఒకే నేరంపై మూడు కేసులు పెట్టడాన్ని సవాలు చేస్తూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో 2 కేసులను కొట్టివేస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. -
14 ఏళ్లకే క్రిమినల్‌ను చేశారు: డిప్యూటీ సీఎం
న్యూఢిల్లీ: తనపై వస్తున్న అవినీతి ఆరోపణలు, నమోదైన సీబీఐ కేసులపై ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ తనయుడు, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ తొలిసారిగా స్పందించారు. 14 ఏళ్లకే తాను క్రిమినల్‌గా మారినట్లు బీజేపీ ఎలా భావించిందో తనకు అర్థం కావడం లేదన్నారు. మూతిపై మీసం కూడా రాని వయసులో క్రిమినల్‌గా మారినట్లు కేసుల ద్వారా తప్పుడు ప్రచారం జరగడంపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. తనపై నమోదైన సీబీఐ కేసు గురించి మాట్లాడుతూ.. 2004-2009 సమయంలో తండ్రి లాలు ప్రసాద్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు హోటల్ టెండర్లను దౌర్జన్యంగా సొంతం చేసుకున్నట్లు చిత్రీకరించారని మండిపడ్డారు. 2004లో సరిగ్గా 15 ఏళ్లు కూడా లేవని, 14 ఏళ్లకే టెండర్లు వేసి అవినీతికి పాల్పడటం సాధ్యమవుతుందా అని తేజస్వి ప్రశ్నించారు. బాలుడిగా ఉన్నప్పుడే లాలు తనయుడు అవినీతికి పాల్పడ్డాడని తనపై దుష్ప్రచారం జరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఎన్ని కేసులు నమోదవుతున్న తాను వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నితీశ్‌కుమార్ క్యాబినెట్ నుంచి డిప్యూటీ సీఎంగా ఉన్న తేజస్వి తప్పుకునే ప్రసక్తే లేదని లాలు తేల్చిచెప్పారు. తనను, తన పార్టీ ఆర్జేడీని ఫినిష్ చేసేందుకే బీజేపీ అధిష్టానం కుట్ర పన్నిందని.. అందులో భాగంగానే కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలు తమపై దాడులు చేస్తున్నాయని లాలూ ఆరోపించారు. మరోవైపు ఢిల్లీ, పాట్నాలో ఉన్న లాలూ ప్రసాద్ కుటుంబానికి చెందిన 9 కోట్లకు పైగా విలువైన భూములు, ప్లాట్లు, భవంతులను ఆస్తులను ఈ యాక్ట్ కింద అటాచ్ మెంట్ చేస్తున్నట్టు ఆదాయపు పన్ను శాఖ ఇటీవల నోటీసు జారీచేసింది. -
నోట్ల పక్కదారి: పోస్టల్ అధికారులపై సీబీఐ కేసు
-
నోట్ల పక్కదారి: పోస్టల్ అధికారులపై సీబీఐ కేసు
కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత.. నోట్ల మార్పిడి వ్యవహారం పలు మలుపులు తిరుగుతోంది. బ్యాంకులతో పాటు పోస్టాఫీసులలో కూడా నగదు మార్చుకోవచ్చని చెప్పి, అక్కడకు కూడా 2వేల నోట్లు పంపడంతో.. హైదరాబాద్‌లోని కొన్ని పోస్టాఫీసులలో అక్రమాలు చోటుచేసుకున్నట్లు సీబీఐ గుర్తించింది. ఇటీవల సోదాలు చేసిన తర్వాత.. హైదరాబాద్‌లోని సీనియర్ పోస్టల్ అధికారుల మీద కేసు నమోదు చేసింది. మొత్తం 40 లక్షల రూపాయల విలువ చేసే 2వేల రూపాయల నోట్లను పక్కదారి పట్టించినట్లు సీబీఐ ఆరోపిస్తోంది. ఈ మేరకు హిమాయత్‌నగర్ పోస్టాఫీసు నుంచి పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఒకవైపు జనం భారీ క్యూలలో నిల్చున్నా డబ్బులు రావడం లేదని గగ్గోలు పెడుతుంటే కొన్ని బ్యాంకులు, పోస్టాఫీసులలో మాత్రం ఇలా నోట్లు పక్కదారి పట్టడంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. నవంబర్ 24వ తేదీన వివిధ పోస్టాఫీసుల్లో సీబీఐ సోదాలు చేసి, ఒక బ్రాంచిలో పెద్దమొత్తంలో నగదు పట్టుకుంది. సిబ్బంది చేతివాటం కారణంగా పెద్దమొత్తంలో నగదును కమీషన్ పద్ధతి మీద బయటకు తరలించినట్లు గుర్తించింది. 11 బ్రాంచిలకు సీనియర్ సూపరింటెండెంట్‌గా ఉన్న అధికారి చేతుల మీదుగా కోటి రూపాయలకు పైగా నగదు అన్ని పోస్టాఫీసులకు వెళ్లింది. 36 లక్షల నగదును పోస్టల్ అధికారులు ప్రైవేట్ వ్యక్తులతో కలిసి మార్పిడి చేసినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంలో పోస్టల్ శాఖ డిప్యూటీ సూపరింటెండెంట్ సుధీర్‌బాబు, సబ్‌పోస్ట్ మాస్టర్ రేవతి, డిప్యూటీ పోస్ట్ మాస్టర్ రవితేజలపై కేసులు నమోదు చేసినట్లు ప్రకటించింది. వీరిపై సీబీఐ భారతీయ శిక్షా స్మృతి సెక్షన్ 120-బి రెడ్ విత్ 406, 409, 477-ఎ, అవినీతి నిరోధక చట్టం 13(2) రెడ్ విత్ 13(1) (డి) కింద కేసులు నమోదు చేశారు. -
డీఎంకేలో ప్రక్షాళన
లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓటమి డీఎంకే నేతల కంటిపై కునుకు లేకుండా చేసింది. ప్రత్యర్థి అన్నాడీఎంకే జయకేతనం వారిని మరింత కృంగదీసింది. పార్టీని ప్రక్షాళన చేయడం ద్వారా కోల్పోయిన జవసత్వాలను కూడగట్టుకునే పనిలో పడింది. ఓటమి భారంతో అస్తమించిన ‘సూర్యుడి’ని మళ్లీ ఉదయింపజేసేందుకు సన్నద్ధం అవుతోంది. - రాజీనామా లేదా తొలగింపు - కొత్తగా 10 జిల్లా కమిటీలు - జూన్ 2న ఉన్నతస్థాయి సమావేశం చెన్నై, సాక్షి ప్రతినిధి: అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని అంశాల్లో ఎదురుదెబ్బలు తింటున్న డీఎంకేకు లోక్‌సభ ఎన్నికలు మరో చేదు అనుభవాన్ని మిగి ల్చారుు. 37 స్థానాల్లో ఒంటి చేత్తో విజయం సాధిం చిన సీఎం జయలలిత దూకుడుకు కళ్లెం వేయలేని డీఎంకే డీలా పడింది. స్వయంగా పోటీ చేసిన 35, మిత్రపక్షాలకిచ్చిన ఐదు ఏ ఒక్కింటినీ డీఎంకే దక్కించుకోలేక పోయింది. పైగా అనేక చోట్ల డిపాజిట్టు కోల్పోయి అవమానాల పాలైంది. ఈలం తమిళుల సమస్య, అవినీతి, అక్రమాల ఆరోపణలపై సీబీఐ కేసులు ఎదుర్కొంటున్న మాజీ కేంద్ర మంత్రులు ఏ రాజా, దయానిధి మారన్‌లను పోటీకి దింపడం, కరుణ పెద్ద కుమారుడు అళగిరి బహిష్కరణతో పార్టీలో ఏర్పడిన అంతర్గత కలహాలు తమ కొంపముంచాయని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. పార్టీ ప్రతిష్ట అడుగంటిపోయిన స్థితిలో రానున్న అసెంబ్లీ ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలనే మీమాంసలో పడిపోయారు. ప్రక్షాళన, పదవులతో పూర్వ వైభవం పార్టీని సంస్థాగతంగా ప్రక్షాళన చేస్తూ సంస్కరించడం ద్వారా పూర్వవైభవం సాధించాలని డీఎంకే అగ్రనాయకత్వం ఆశిస్తోంది. ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ కోశాధికారి, కరుణ తనయుడు స్టాలిన్ రాజీనామా చేయడం, పార్టీ నిరాకరించడం, ఆయన ఉపసంహరిచడం వంటి హైడ్రామా సాగింది. ఇందుకు కొనసాగింపుగా జూన్ 2న పార్టీ ఉన్నతస్థాయి సమావేశానికి ఏర్పాట్లు చేస్తోంది. పార్టీ పరాజయంపై ఈ సమావేశంలో సుదీర్ఘ చర్చలు జరపనుంది. అధిక సంఖ్యలో అసెంబ్లీ నియోజకవర్గాలు కలిగిన 10 జిల్లాలను పార్టీపరంగా రెండుగా విభజించి రెండు కమిటీలను వేయాలని భావిస్తోంది. తద్వారా ఎక్కువమందికి పార్టీ పదవులను కట్టబెట్టితే వారు ఉత్తేజితులు కాగలరని అదిష్టానం ఆశపడుతోంది. పార్టీ అధ్యక్ష, కార్యదర్శ పదవుల్లో సుదీర్ఘకాలంగా ఉన్నవారిని తొలగించి కొత్తవారికి ఇవ్వాలని సంకల్పించింది. సుమారు 20 ఏళ్లుగా అధ్యక్ష, కార్యదర్శులున్నవారు 50 శాతం మంది ఉన్నారు. వీరందరికీ పదవీ వియోగం తప్పేట్లు లేదు. జిల్లా స్థాయిలో మార్పులు, కూర్పులు చేసేందుకు వీలుగా నేతల నుంచి స్వచ్ఛందంగా రాజీనామాలు కోరాలని, కాదన్నవారిని బలవంతంగా తప్పించాలని భావిస్తోంది. -
'సిబిఐ కేసులకు భయపడిన చంద్రబాబు'
అనంతపురం: సీబీఐ కేసులకు బయపడే టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ డైరెక్షన్లో పని చేస్తున్నారని కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు సమైక్య ముసుకులో విభజనకు సహకరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే సత్తా ఒక్క వైఎస్ జగన్‌కే ఉందని ఆయన అన్నారు. -
సిబిఐ కేసులన్నీ ప్రశ్నార్ధకం: విద్యాసాగర్ రావు
నిజామాబాద్: సీబీఐ నిర్మాణమే చెల్లుబాటుకాదని గౌహతి హైకోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో ఆ కేసులన్నీ ప్రశ్నార్థకం అవుతాయని బిజేపి నేత విద్యాసాగర్ రావు అన్నారు. ఇంత పెద్ద ప్రజాస్వామ్యదేశంలో అలాంటి చారిత్రక పొరబాట్లు లేకుండా చూడాలన్నారు. ప్రత్యేక తెలంగాణను టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయముడు సమన్యాయం పేరుతో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్షనేతగా చంద్రబాబు అన్ని విషయాల్లో విఫలమయ్యారన్నారు. కేంద్రం అన్ని పార్టీలను ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు.