పలు రాష్ట్రాల్లో 19 కేసులు నమోదు
ఢిల్లీలో సీబీఐ కేసులు
ఆయన, భార్య పేరిట రూ.215.57 కోట్ల ఆస్తులు
ఎన్నికల అఫిడవిట్‌లో వివరాలు
ఉండి టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన రఘురామ భార్య
పార్టీ అధికారికంగా ప్రకటించకుండానే నామినేషన్
సాక్షి ప్రతినిధి, ఏలూరు: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఆస్తులు, కేసుల పుట్ట అని వెల్లడైంది. ఆయన, ఆయన భార్య కనుమూరి రమాదేవి పేరిట స్థిర, చరాస్తులు మొత్తం కలిపి రూ.215.57 కోట్ల ఆస్తులు ఉన్నట్టు తేలింది. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ, మహారాష్ట్రల్లో 19 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో సీబీఐ కేసులు కూడా ఆయనపై ఉన్నాయి. ఈ మేరకు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి టీడీపీ అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు తరఫున ఆయన భార్య రమాదేవి శుక్రవారం రెండు సెట్ల నామినేషన్‌ను సమర్పించారు. ఉండి అభ్యర్థిగా టీడీపీ ఇంకా ఆయన పేరును అధికారికంగా ప్రకటించకపోవడం గమనార్హం. ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తులు, కేసుల వివరాలను పేర్కొన్నారు. వీటి ప్రకారం.. బ్యాంకుల్లో అప్పులు రూ.12.60 కోట్లు ఉన్నట్టు తెలిపారు.
ఆస్తులు, అప్పులు ఇవి..
రఘురామకృష్ణరాజు పేరుతో రూ.13.89 కోట్లు, ఆయన భార్య రమాదేవి పేరుతో రూ.17.79 కోట్ల చరాస్తులు ఉన్నట్టు అఫిడవిట్‌లో చూపించారు. తమిళనాడు, తెలంగాణ, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, వాణిజ్య భవనాలు అన్నీ కలిపి రూ.8.48 కోట్లు రఘురామకృష్ణరాజు పేరిట, ఆయన భార్య పేరుతో రూ.175.45 కోట్లు ఆస్తులు ఉన్నట్టు తెలిపారు. రఘురామకృష్ణరాజుకు రూ.8.15 కోట్లు, ఆయన భార్యకు రూ.4.45 కోట్లు బకాయిలు ఉన్నట్టు చూపించారు.
రఘురామపై కేసుల వివరాలివీ..
►సైబరాబాద్‌లో వ్యక్తిని కిడ్నాప్ చేసిన ఘటనలో, నేరపూరిత కుట్ర ఆరోపణలతో పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల పోలీస్‌స్టేషన్‌లో, పెనుమంట్ర పోలీస్‌స్టేషన్ పరిధిలో కేసులు నమోదయ్యాయి.
►ఇండ్ భారత్ పవర్ ఇన్‌ఫ్రా లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్‌గా ఉండి ఫోర్జరీ, నకిలీ పత్రాలు సృష్టించడం, రూ.25 కోట్ల చెల్లింపులు చేయకపోవడానికి సంబంధించి మహారాష్ట్రలోని థానేలో ఉన్న ఆర్థిక నేరాల విభాగం 2022 జనవరి 27న ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. దీనికి సంబంధించి హైదరాబాద్ కోర్టులో
రెండు కేసులు, ముంబై కోర్టులో ఒక కేసు కొనసాగుతున్నాయి.
►మత విద్వేషాలు రగిల్చేలా మాట్లాడినందుకు చింతలపూడి, మంగళగిరి, భీమవరం, పోడూరు, ఆచంట, పెనుగొండ, పెనుమంట్ర, నర్సాపురం పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదు చేశారు.
►కుట్ర, మోసం, ఫోర్జరీ చేశారని ఎస్‌బీఐ ఇచ్చిన ఫిర్యాదుపై, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌ను మోసం చేయడంతో ఢిల్లీలో సీబీఐ కేసులు నమోదు చేసింది.
►ఫెమా చట్టం ఉల్లంఘన కింద రూ.40 కోట్లు జరిమానా విధించిన కేసు తెలంగాణ హైకోర్టులో కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment