raghu ramakrisnam raju
-
కేసుల పుట్ట రఘురామకృష్ణరాజు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఆస్తులు, కేసుల పుట్ట అని వెల్లడైంది. ఆయన, ఆయన భార్య కనుమూరి రమాదేవి పేరిట స్థిర, చరాస్తులు మొత్తం కలిపి రూ.215.57 కోట్ల ఆస్తులు ఉన్నట్టు తేలింది. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ, మహారాష్ట్రల్లో 19 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో సీబీఐ కేసులు కూడా ఆయనపై ఉన్నాయి. ఈ మేరకు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి టీడీపీ అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు తరఫున ఆయన భార్య రమాదేవి శుక్రవారం రెండు సెట్ల నామినేషన్‌ను సమర్పించారు. ఉండి అభ్యర్థిగా టీడీపీ ఇంకా ఆయన పేరును అధికారికంగా ప్రకటించకపోవడం గమనార్హం. ఎన్నికల అఫిడవిట్లో ఆస్తులు, కేసుల వివరాలను పేర్కొన్నారు. వీటి ప్రకారం.. బ్యాంకుల్లో అప్పులు రూ.12.60 కోట్లు ఉన్నట్టు తెలిపారు. ఆస్తులు, అప్పులు ఇవి.. రఘురామకృష్ణరాజు పేరుతో రూ.13.89 కోట్లు, ఆయన భార్య రమాదేవి పేరుతో రూ.17.79 కోట్ల చరాస్తులు ఉన్నట్టు అఫిడవిట్లో చూపించారు. తమిళనాడు, తెలంగాణ, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, వాణిజ్య భవనాలు అన్నీ కలిపి రూ.8.48 కోట్లు రఘురామకృష్ణరాజు పేరిట, ఆయన భార్య పేరుతో రూ.175.45 కోట్లు ఆస్తులు ఉన్నట్టు తెలిపారు. రఘురామకృష్ణరాజుకు రూ.8.15 కోట్లు, ఆయన భార్యకు రూ.4.45 కోట్లు బకాయిలు ఉన్నట్టు చూపించారు. రఘురామపై కేసుల వివరాలివీ.. ►సైబరాబాద్‌లో వ్యక్తిని కిడ్నాప్ చేసిన ఘటనలో, నేరపూరిత కుట్ర ఆరోపణలతో పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల పోలీస్‌స్టేషన్‌లో, పెనుమంట్ర పోలీస్‌స్టేషన్ పరిధిలో కేసులు నమోదయ్యాయి. ►ఇండ్ భారత్ పవర్ ఇన్ఫ్రా లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్‌గా ఉండి ఫోర్జరీ, నకిలీ పత్రాలు సృష్టించడం, రూ.25 కోట్ల చెల్లింపులు చేయకపోవడానికి సంబంధించి మహారాష్ట్రలోని థానేలో ఉన్న ఆర్థిక నేరాల విభాగం 2022 జనవరి 27న ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీనికి సంబంధించి హైదరాబాద్ కోర్టులో రెండు కేసులు, ముంబై కోర్టులో ఒక కేసు కొనసాగుతున్నాయి. ►మత విద్వేషాలు రగిల్చేలా మాట్లాడినందుకు చింతలపూడి, మంగళగిరి, భీమవరం, పోడూరు, ఆచంట, పెనుగొండ, పెనుమంట్ర, నర్సాపురం పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదు చేశారు. ►కుట్ర, మోసం, ఫోర్జరీ చేశారని ఎస్బీఐ ఇచ్చిన ఫిర్యాదుపై, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌ను మోసం చేయడంతో ఢిల్లీలో సీబీఐ కేసులు నమోదు చేసింది. ►ఫెమా చట్టం ఉల్లంఘన కింద రూ.40 కోట్లు జరిమానా విధించిన కేసు తెలంగాణ హైకోర్టులో కొనసాగుతోంది. -
రఘురామ వేసిన పిటిషన్లో ఎటువంటి విషయం లేదు: సజ్జల
-
సంక్షేమ పాలనను పక్కదోవ పట్టించేందుకే కేసులు: సజ్జల
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న సంక్షేమ పాలనను పక్కదోవ పట్టించేందుకే రఘురామకృష్ణంరాజు కేసులు వేశారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఇలాంటి దురుద్దేశపూరితమైన కేసులను కోర్టులు కూడా స్వీకరించకూడదని అన్నారు. సుప్రీంకోర్డు కూడా పిల్లు దుర్వినియోగం కాకుండా చూడాలని సూచించిందని గుర్తుచేశారు. చదవండి: మంత్రి కేటీఆర్ మత్తులో ఉండి ట్వీట్ చేశారా? : రేవంత్‌రెడ్డి ఈ కేసును అడ్డు పెట్టుకుని వాళ్లు చేసిన విషప్రచారం అంతాఇంతా కాదని పేర్కొన్నారు. ఎల్లో మీడియా అసంబద్ధమైన చర్చలు పెట్టిందని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వారి పైత్యం పతాక స్థాయికి చేరింది.. చివరకు న్యాయమే గెలిచింది’ అని ఆయన బుధవారం నాటి మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు. ఇలాంటి దుష్ప్రచారాలపై కోర్టులు కూడా దృష్టి సారించాలని సజ్జల విజ్ఞప్తి చేశారు. దురుద్దేశపూరితమైన ప్రచారాలను సూమోటోగా తీసుకోవాలని కోరారు. చదవండి: నాకు లవర్‌ను వెతికి పెట్టండి: ఎమ్మెల్యేకు యువకుడి లేఖ వైరల్ -
రఘురామకృష్ణరాజు వ్యాఖ్యల వెనుక కుట్ర కోణం: సజ్జల
సాక్షి, అమరావతి: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు రఘురామకృష్ణరాజు పాల్పడ్డారని ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పార్టీకి వ్యతిరేకంగా రఘురామకృష్ణరాజు విమర్శలు చేశారని మండిపడ్డారు. రఘురామకృష్ణరాజుపై ఇప్పటికే లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. రఘురామను అడ్డంపెట్టుకుని ప్రభుత్వంపై చంద్రబాబు కుట్ర చేయాలనుకున్నారని ధ్వజమెత్తారు. ‘రఘురామకృష్ణరాజుపై సీఐడీ సుమోటోగా కేసు నమోదు చేసింది. ఆయన అరెస్టుపై టీడీపీ అనవసర యాగీ చేస్తోంది. హైకోర్టు ఆదేశాల మేరకు మెడికల్ బోర్డును ఏర్పాటు చేశారు. మెడికల్ బోర్డు ఆధ్వర్యంలోనే రఘురామకు వైద్య పరీక్షలు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు టీడీపీ అడ్డదారులు తొక్కుతోందని’’ సజ్జల దుయ్యబట్టారు. పార్టీ నచ్చకపోతే రఘురామకృష్ణరాజు ఎందుకు రాజీనామా చేయలేదని సజ్జల ప్రశ్నించారు. ‘నాడు తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బాబు రాజద్రోహం కేసులు పెట్టారు. గుంటూరులో న్యాయవాదులపైనా రాజద్రోహం కేసులు పెట్టారు. ఇప్పుడేమో రాజద్రోహం కేసు ఉందా అని బాబు మాట్లాడుతున్నారని’’ సజ్జల దుయ్యబట్టారు. రఘురామకృష్ణరాజు వ్యాఖ్యల వెనుక కుట్ర కోణం ఉందని.. కుట్రలో భాగంగానే ఎల్లో మీడియాలో రఘురామకృష్ణరాజుకు ప్రచారం చేశారన్నారు. తమ బండారం ఎక్కడ బయటపడుతుందనేదే చంద్రబాబు భయమని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు సమావేశాలు నిర్వహించలేదా?. విచారణ జరుగుతుండగానే ఎల్లో మీడియా ఎందుకు భయపడుతోంది’’ అంటూ సజ్జల ప్రశ్నించారు. ప్రభుత్వం ఎక్కడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదన్నారు. చంద్రబాబు అధికారంలో ఉండగానే పౌర హక్కులకు భంగం కలిగిందన్నారు. ఎమ్మార్వో వనజాక్షిపై దాడి కేసును చంద్రబాబే పంచాయతీ చేశారని, రాజమండ్రి పుష్కరాల్లో 30 మంది చావుకు బాబు కారణమయ్యారన్నారు. అరాచక, ఆటవిక పాలన అంటే చంద్రబాబు హయాంలో జరిగిందేనని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చదవండి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు: మొహం చాటేసిన చంద్రబాబు మీ రాజకీయం మరణ శాసనం.. టీడీపీకి గుడ్‌బై -
అసలు కుట్ర బయటపడకుండా పక్కదోవ పట్టించేందుకే?!
సాక్షి, అమరావతి: చేసింది ఘోరమైన తప్పిదం. కులాల మధ్య చిచ్చు పెట్టేలా... మతాల మధ్య ఘర్షణలు రేకెత్తించేలా పనిగట్టుకుని మరీ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంపై విషం చిమ్మి.. అస్థిరత పెంచేందుకు కుట్ర చేశారు. ఎల్లో మీడియా అండతో... చంద్రబాబు నాయుడు వంటి నేతల మద్దతు చూసుకుని రెచ్చిపోయారు. చివరికి వీటిపై సీఐడీ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి అరెస్టు చేసేసరికి... అసలు విషయాన్ని పక్క దోవ పట్టించడానికి, కుట్రదారులు తెరపైకి రాకుండా చూడటానికి కొత్త కథను అల్లటం మొదలెట్టారు. తనను కస్టడీలో పోలీసులు ముసుగు వేసుకుని వచ్చి మరీ కొట్టారంటూ నమ్మలేని వాదన మొదలుపెట్టారు. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు ఆడుతున్న ఈ డ్రామాపై ఆయన నియోజకవర్గ ప్రజలు, గతంలో ఆయనకు మద్దతిచ్చిన స్థానిక నాయకులు సైతం విస్తుపోతున్నారు. బెయిలు పిటిషన్ తిరస్కరించటంతో...! నిజానికి రాజకీయ ప్రత్యర్థులైనా సరే... కస్టడీలో ఉన్న నాయకులను పోలీసులు కొట్టడమనేది సాధారణంగా జరగదు. పోలీసులు అరెస్టు చేసి ప్రశ్నించటం... తరవాత కోర్టులో హాజరు పరచటం... అనంతరం కోర్టు ఆదేశాల మేరకు వ్యవహరించటమనేది చట్టప్రకారం జరిగే ప్రక్రియ. ఇటీవల ఈఎస్ఐ కుంభకోణంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్టయ్యారు. సంగం డెయిరీకి సంబంధించి ఫోర్జరీ సంతకాలతో భూములు కొట్టేసిన వ్యవహారంలో అరెస్టయిన టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు. అయితే వీళ్లెవరూ తమను పోలీసులు కస్టడీలో కొట్టారంటూ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. రఘురామకృష్ణంరాజు కూడా శనివారం మధ్యాహ్నం హైకోర్టు తన బెయిలు పిటిషన్‌ను తిరస్కరించేదాకా తనను కొట్టారనే ఆరోపణ చేయనేలేదు. తన బెయిలు పిటిషన్లో కూడా దీన్ని ప్రస్తావించలేదు. ఒకవేళ కొట్టి ఉంటే బెయిలు పిటిషన్లో దాన్నే ప్రధానంగా ప్రస్తావించి ఉండేవారనేది న్యాయ నిపుణుల మాట. అంతేకాదు!! అక్కడికి వచ్చిన తన కుటుంబ సభ్యులతోనూ ఆయన మాట్లాడారు. తదనంతరం మీడియాతో మాట్లాడిన రఘురామరాజు కుమారుడు భరత్ కూడా తన తండ్రిని కొట్టారని ఎక్కడా చెప్పలేదు. అయితే హైకోర్టు బెయిలును తిరస్కరించి... దిగువ కోర్టుకు వెళ్లమనేసరికి టీడీపీ పెద్దలు, ఎల్లో మీడియా సూత్రధారుల సూచన మేరకు ఈ కొట్టడం అనే కథ అల్లారని, దిగువ కోర్టులో వేసిన పిటిషన్లో దాన్నే ప్రధానంగా ప్రస్తావించటంతో పాటు... అప్పటికప్పుడు హడావుడిగా హైకోర్టుకు మళ్లీ లేఖ రాశారని విశ్వసనీయ సమాచారం. ఇదంతా టీడీపీ ముఖ్య నేత సూచన మేరకే జరిగిందని, రఘురామరాజు కస్టడీలో ఉంటే కుట్రదారులందరి పేర్లూ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది కనక తానూ బయటపడతాననే భయంతోనే ఆ ముఖ్యనేత ఈ డ్రామా నడిపించినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇలా చేస్తే అసలు విషయాన్ని పక్కదోవ పట్టించి జనంలో సానుభూతి పొందవచ్చన్నది వారి ఉద్దేశమని, దానికి తగ్గట్టే రఘురామరాజు జీవించేశారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. కాళ్లు ఎందుకు రంగు మారాయంటే... తనను అరికాళ్లపై కర్రతో, రబ్బరు తాడుతో కొట్టారని రఘురామరాజు దిగువ కోర్టులో వేసిన పిటిషన్లో పేర్కొన్నారు. ఎల్లో మీడియా దాన్ని చిలవలు పలవలు చేసి... ఆ అరికాళ్ల ఫోటోలను పతాక శీర్షికల్లో ప్రచురించింది. అవే ఫోటోలను తెలుగుదేశం పార్టీ ఆదివారం వైరల్ చేసింది కూడా. అయితే ఇదంతా కట్టు కథేనని, ఆయనకు ఎలాంటి గాయాలూ లేవని హైకోర్టు నియమించిన వైద్యుల కమిటీ ఆదివారం తేల్చటంతో ఎల్లో మీడియాకిపుడు ఎటూ పాలుపోవటం లేదు. ఎడెమా (వాపు) వల్ల ఆయన కాళ్లు అలా అయ్యాయని వైద్య నిపుణుల నివేదికలో పేర్కొన్నట్లు న్యాయమూర్తులు చదివి వినిపించారు కూడా. సూక్ష్మనాళాలు గనక దెబ్బతిని నీరు కాళ్లలోకి చేరితే సహజంగా ఈ ఎడెమా వస్తుంటుంది. కాళ్లు స్వల్పంగా వాచి నీరు చేరి ఉబ్బినట్లు కనిపిస్తాయి. ఎక్కువసేపు నిల్చున్నా... అదేపనిగా కూర్చున్నా ఇలా జరగటం సహజమని కూడా నివేదికలో వైద్యులు పేర్కొన్నారు. రఘురామరాజు షుగర్ వ్యాధిగ్రస్తుడు కనక ఇది సహజమేనన్నది వైద్యుల మాట. ఈ వాస్తవాలను పక్కనబెట్టి అప్పటికప్పుడు అల్లిన కథను మరింతగా ప్రచారం చేయటానికి ఎల్లో మీడియా నానాపాట్లూ పడుతుండటం తెలిసిందే. చంద్రబాబు సైతం గవర్నర్‌కు, రాష్ట్రపతికి లేఖల పేరిట హడావిడి మొదలెట్టారు. ఇదంతా తమ పాత్రలు బయటకు వస్తాయనే భయంతోనే వారు చేస్తున్నారని, రఘురామరాజు కస్టడీ కొనసాగితే విచారణలో తప్పకుండా సూత్రధారులంతా బయటపడతారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. -
డబ్బుకు ‘దేశం’ దాసోహం
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ‘తెలుగుదేశం పార్టీలో డబ్బులున్న వారికే సీట్లు ఇస్తున్నారు. చంద్రబాబు పూర్తిగా ధనిక నేతలకు లొంగిపోయారు. పనిచేసే నాయకులు, కార్యకర్తలకు విలువ లేకుండాపోయింది’ ఈ మాటలు అంటున్నది టీడీపీ ప్రత్యర్థులు కాదు. ఆ పార్టీ నేతలే. నిన్నటివరకూ ఆచంట టీడీపీ ఇన్చార్జిగా వ్యవహరిం చిన గుబ్బల తమ్మయ్య ఈ విషయూన్ని కుండబద్దలుకొట్టి మరీ చెప్పారు. డబ్బులిస్తేనే చంద్రబాబు సీట్లు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకొల్లులో టీడీపీ సీనియర్ నేత డాక్టర్ బాబ్జి నేరుగా ఈ మాటలు అనకపోయినా ఆయన అనుయాయులంతా అదే చెబుతున్నారు. పారిశ్రామికవేత్త కనుమూరి రఘురామకృష్ణంరాజు టీడీపీ ధనరాజకీయాలకు ప్రత్యక్ష ఉదాహరణ. ఆయన డబ్బులు కుమ్మరించి టీడీపీని జేబు సంస్థగా మార్చుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. బీజేపీతో పొత్తు తెగిపోయేదాకా రావడానికి ఆయనే ప్రధాన కారణమని తెలుగుదేశం నేతలు ఘంటాపథంగా చెబుతున్నారు. రఘురామకృష్ణంరాజు చెప్పినట్టల్లా చంద్రబాబు తలాడించడానికి ఆయన భారీ మొత్తం లో సొమ్ము ఇవ్వటమే కారణమనే ప్రచా రం ఆ పార్టీలో జోరుగా సాగుతోంది. మొన్నటివరకూ బీజేపీ నేతగా చెలామ ణీ అయ్యి ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారో కూడా తెలియని రఘు కొద్దిరోజులుగా చంద్రబాబుతో అత్యంత సన్నిహితంగా మెలుగుతున్నారు. పొత్తులో భాగంగా నరసాపురం బీజేపీకి ఇస్తారని తెలిసి.. ఆ స్థానం నుంచి పోటీ చేయాలని భావించి ముందే ఆ పార్టీలో చేరిన ఆయన అందుకోసం బాబుతో ప్యాకేజీ మాట్లాడుకున్నట్లు సమాచారం. నరసాపురం పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థుల ఖర్చంతా తానే భరిస్తానని అవసరమైతే, జిల్లాలోని మిగిలిన స్థానాల ఖర్చు కూడా చూసుకుంటానని ఆయన ముందుకొచ్చినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. దీంతోపాటు పార్టీ ఫండ్ కూడా భారీగా ఇవ్వడానికి ఒప్పందం కుదిరినట్లు సమాచారం. ఈ కారణంగానే రఘురామకృష్ణంరాజుకు చంద్రబాబు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. జిల్లా పర్యటనలో భాగంగా గురువారం ఉదయం వరకూ ఏలూరులో బస చేసిన చంద్రబాబు 11 గంటల వరకూ బయటకు రాలేదు. ఈ సమయంలో ఉదయం నుంచి ఫోన్లు మాట్లాడిన ఆయన ఇక్కడినుంచి వెళ్లిపోయే ముందు రఘురామకృష్ణంరాజును మాత్రమే పిలిపించుకుని మాట్లాడారు. టీడీపీ నేతలెవరితోనూ మాట్లాడలేదు. దీనినిబట్టి బీజేపీలో ఉన్న రఘురామకృష్ణంరాజుకు చంద్రబాబు ఇస్తున్న ప్రాధాన్యత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా సరే.. ఆచంట సీటును మాజీ మంత్రి పితాని సత్యనారాయణకు ఇవ్వడం వెనుకా పార్టీ ఫండ్ లోగుట్టు ఉన్నట్లు తెలిసింది. ఈ సీటును రెండు నెలల క్రితమే తమ్మయ్యకు ఇస్తున్నట్లు ప్రకటించిన చంద్రబాబు చివరకు పితాని సత్యనారాయణకు కట్టబెట్టిన విషయం తెలిసిందే. పితాని ఆర్థికంగా బలవంతుడు కావడంతో తమ్మయ్యను పక్కనపెట్టేశారు. కనీసం ఆయనకు మాటమాత్రమైనా చెప్పకుండా పితానికి సీటిస్తున్నట్లు ప్రకటించారు. పాలకొల్లు అసెంబ్లీ సీటు సీనియర్ నాయకుడైన డాక్టర్ బాబ్జికి వస్తుందని అంతా భావించారు. అనూహ్యంగా నిమ్మల రామానాయుడికి కట్టబెట్టారు. ఉంగుటూరు సీటు ఇస్తానని పలువురిని పార్టీలో చేర్చుకున్నా.. చివరకు గన్ని వీరాంజనేయుల్ని అభ్యర్థిగా ప్రకటించారు. ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే శివరామరాజు కూడా చివరకు భారీగా పార్టీ ఫండ్ ముట్టజెప్పుకోవాల్సి వచ్చిందని టీడీపీ నేతలు చెబుతున్నారు. గురువారం రాత్రి ఆగమేఘాల మీద ఆయన డబ్బును సమకూర్చినట్లు తెలిసింది. తాడేపల్లిగూడెం సీటు ఆశిస్తున్న కొట్టు సత్యనారాయణ కూడా ప్యాకేజీ మాట్లాడుకున్నట్లు సమాచారం. తొలి విడతలో ప్రకటించిన ఏలూరు, దెందులూరు, నిడదవోలు, తణుకుతోపాటు మిగిలిన జనరల్ నియోజకవర్గాల అభ్యర్థుల నుంచి కూడా పార్టీ ఫండ్ సమీకరించినట్లు ప్రచారం జరుగుతోంది. అభ్యర్థి ఎవరైనా సరే పార్టీ ఫండ్ సమర్పించుకోవాల్సిందేనని టీడీపీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. టీడీపీ జిల్లా పరిశీలకునిగా ఉన్న గరికపాటి రామ్మోహనరావు ఈ వ్యవహారాలన్నింటినీ చక్కబెట్టడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. కొందరి విషయంలో మాత్రం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ జోక్యం చేసుకుని వ్యవహారాలను చక్కదిద్దుతున్నారు. వాస్తవ పరిస్థితులు తెలియడంతో తెలుగుదేశం పార్టీలో జరిగేదంతా ధన రాజకీయమేనని ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు వాపోతున్నారు.