సాక్షి, అమరావతి: చేసింది ఘోరమైన తప్పిదం. కులాల మధ్య చిచ్చు పెట్టేలా... మతాల మధ్య ఘర్షణలు రేకెత్తించేలా పనిగట్టుకుని మరీ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంపై విషం చిమ్మి.. అస్థిరత పెంచేందుకు కుట్ర చేశారు. ఎల్లో మీడియా అండతో... చంద్రబాబు నాయుడు వంటి నేతల మద్దతు చూసుకుని రెచ్చిపోయారు. చివరికి వీటిపై సీఐడీ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి అరెస్టు చేసేసరికి... అసలు విషయాన్ని పక్క దోవ పట్టించడానికి, కుట్రదారులు తెరపైకి రాకుండా చూడటానికి కొత్త కథను అల్లటం మొదలెట్టారు. తనను కస్టడీలో పోలీసులు ముసుగు వేసుకుని వచ్చి మరీ కొట్టారంటూ నమ్మలేని వాదన మొదలుపెట్టారు. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు ఆడుతున్న ఈ డ్రామాపై ఆయన నియోజకవర్గ ప్రజలు, గతంలో ఆయనకు మద్దతిచ్చిన స్థానిక నాయకులు సైతం విస్తుపోతున్నారు.
బెయిలు పిటిషన్ తిరస్కరించటంతో...!
నిజానికి రాజకీయ ప్రత్యర్థులైనా సరే... కస్టడీలో ఉన్న నాయకులను పోలీసులు కొట్టడమనేది సాధారణంగా జరగదు. పోలీసులు అరెస్టు చేసి ప్రశ్నించటం... తరవాత కోర్టులో హాజరు పరచటం... అనంతరం కోర్టు ఆదేశాల మేరకు వ్యవహరించటమనేది చట్టప్రకారం జరిగే ప్రక్రియ. ఇటీవల ఈఎస్‌ఐ కుంభకోణంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్టయ్యారు. సంగం డెయిరీకి సంబంధించి ఫోర్జరీ సంతకాలతో భూములు కొట్టేసిన వ్యవహారంలో అరెస్టయిన టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు. అయితే వీళ్లెవరూ తమను పోలీసులు కస్టడీలో కొట్టారంటూ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. రఘురామకృష్ణంరాజు కూడా శనివారం మధ్యాహ్నం హైకోర్టు తన బెయిలు పిటిషన్‌ను తిరస్కరించేదాకా తనను కొట్టారనే ఆరోపణ చేయనేలేదు.
తన బెయిలు పిటిషన్లో కూడా దీన్ని ప్రస్తావించలేదు. ఒకవేళ కొట్టి ఉంటే బెయిలు పిటిషన్లో దాన్నే ప్రధానంగా ప్రస్తావించి ఉండేవారనేది న్యాయ నిపుణుల మాట. అంతేకాదు!! అక్కడికి వచ్చిన తన కుటుంబ సభ్యులతోనూ ఆయన మాట్లాడారు. తదనంతరం మీడియాతో మాట్లాడిన రఘురామరాజు కుమారుడు భరత్ కూడా తన తండ్రిని కొట్టారని ఎక్కడా చెప్పలేదు. అయితే హైకోర్టు బెయిలును తిరస్కరించి... దిగువ కోర్టుకు వెళ్లమనేసరికి టీడీపీ పెద్దలు, ఎల్లో మీడియా సూత్రధారుల సూచన మేరకు ఈ కొట్టడం అనే కథ అల్లారని, దిగువ కోర్టులో వేసిన పిటిషన్లో దాన్నే ప్రధానంగా ప్రస్తావించటంతో పాటు... అప్పటికప్పుడు హడావుడిగా హైకోర్టుకు మళ్లీ లేఖ రాశారని విశ్వసనీయ సమాచారం. ఇదంతా టీడీపీ ముఖ్య నేత సూచన మేరకే జరిగిందని, రఘురామరాజు కస్టడీలో ఉంటే కుట్రదారులందరి పేర్లూ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది కనక తానూ బయటపడతాననే భయంతోనే ఆ ముఖ్యనేత ఈ డ్రామా నడిపించినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇలా చేస్తే అసలు విషయాన్ని పక్కదోవ పట్టించి జనంలో సానుభూతి పొందవచ్చన్నది వారి ఉద్దేశమని, దానికి తగ్గట్టే రఘురామరాజు జీవించేశారని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
కాళ్లు ఎందుకు రంగు మారాయంటే...
తనను అరికాళ్లపై కర్రతో, రబ్బరు తాడుతో కొట్టారని రఘురామరాజు దిగువ కోర్టులో వేసిన పిటిషన్లో పేర్కొన్నారు. ఎల్లో మీడియా దాన్ని చిలవలు పలవలు చేసి... ఆ అరికాళ్ల ఫోటోలను పతాక శీర్షికల్లో ప్రచురించింది. అవే ఫోటోలను తెలుగుదేశం పార్టీ ఆదివారం వైరల్ చేసింది కూడా. అయితే ఇదంతా కట్టు కథేనని, ఆయనకు ఎలాంటి గాయాలూ లేవని హైకోర్టు నియమించిన వైద్యుల కమిటీ ఆదివారం తేల్చటంతో ఎల్లో మీడియాకిపుడు ఎటూ పాలుపోవటం లేదు. ఎడెమా (వాపు) వల్ల ఆయన కాళ్లు అలా అయ్యాయని వైద్య నిపుణుల నివేదికలో పేర్కొన్నట్లు న్యాయమూర్తులు చదివి వినిపించారు కూడా. సూక్ష్మనాళాలు గనక దెబ్బతిని నీరు కాళ్లలోకి చేరితే సహజంగా ఈ ఎడెమా వస్తుంటుంది. కాళ్లు స్వల్పంగా వాచి నీరు చేరి ఉబ్బినట్లు కనిపిస్తాయి. ఎక్కువసేపు నిల్చున్నా... అదేపనిగా కూర్చున్నా ఇలా జరగటం సహజమని కూడా నివేదికలో వైద్యులు పేర్కొన్నారు. రఘురామరాజు షుగర్ వ్యాధిగ్రస్తుడు కనక ఇది సహజమేనన్నది వైద్యుల మాట. ఈ వాస్తవాలను పక్కనబెట్టి అప్పటికప్పుడు అల్లిన కథను మరింతగా ప్రచారం చేయటానికి ఎల్లో మీడియా నానాపాట్లూ పడుతుండటం తెలిసిందే. చంద్రబాబు సైతం గవర్నర్‌కు, రాష్ట్రపతికి లేఖల పేరిట హడావిడి మొదలెట్టారు. ఇదంతా తమ పాత్రలు బయటకు వస్తాయనే భయంతోనే వారు చేస్తున్నారని, రఘురామరాజు కస్టడీ కొనసాగితే విచారణలో తప్పకుండా సూత్రధారులంతా బయటపడతారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment