నోట్ల పక్కదారి: పోస్టల్ అధికారులపై సీబీఐ కేసు
కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత.. నోట్ల మార్పిడి వ్యవహారం పలు మలుపులు తిరుగుతోంది. బ్యాంకులతో పాటు పోస్టాఫీసులలో కూడా నగదు మార్చుకోవచ్చని చెప్పి, అక్కడకు కూడా 2వేల నోట్లు పంపడంతో.. హైదరాబాద్‌లోని కొన్ని పోస్టాఫీసులలో అక్రమాలు చోటుచేసుకున్నట్లు సీబీఐ గుర్తించింది. ఇటీవల సోదాలు చేసిన తర్వాత.. హైదరాబాద్‌లోని సీనియర్ పోస్టల్ అధికారుల మీద కేసు నమోదు చేసింది.
మొత్తం 40 లక్షల రూపాయల విలువ చేసే 2వేల రూపాయల నోట్లను పక్కదారి పట్టించినట్లు సీబీఐ ఆరోపిస్తోంది. ఈ మేరకు హిమాయత్‌నగర్ పోస్టాఫీసు నుంచి పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఒకవైపు జనం భారీ క్యూలలో నిల్చున్నా డబ్బులు రావడం లేదని గగ్గోలు పెడుతుంటే కొన్ని బ్యాంకులు, పోస్టాఫీసులలో మాత్రం ఇలా నోట్లు పక్కదారి పట్టడంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
నవంబర్ 24వ తేదీన వివిధ పోస్టాఫీసుల్లో సీబీఐ సోదాలు చేసి, ఒక బ్రాంచిలో పెద్దమొత్తంలో నగదు పట్టుకుంది. సిబ్బంది చేతివాటం కారణంగా పెద్దమొత్తంలో నగదును కమీషన్ పద్ధతి మీద బయటకు తరలించినట్లు గుర్తించింది. 11 బ్రాంచిలకు సీనియర్ సూపరింటెండెంట్‌గా ఉన్న అధికారి చేతుల మీదుగా కోటి రూపాయలకు పైగా నగదు అన్ని పోస్టాఫీసులకు వెళ్లింది. 36 లక్షల నగదును పోస్టల్ అధికారులు ప్రైవేట్ వ్యక్తులతో కలిసి మార్పిడి చేసినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంలో పోస్టల్ శాఖ డిప్యూటీ సూపరింటెండెంట్ సుధీర్‌బాబు, సబ్‌పోస్ట్ మాస్టర్ రేవతి, డిప్యూటీ పోస్ట్ మాస్టర్ రవితేజలపై కేసులు నమోదు చేసినట్లు ప్రకటించింది. వీరిపై సీబీఐ భారతీయ శిక్షా స్మృతి సెక్షన్ 120-బి రెడ్ విత్ 406, 409, 477-ఎ, అవినీతి నిరోధక చట్టం 13(2) రెడ్ విత్ 13(1) (డి) కింద కేసులు నమోదు చేశారు.