14 ఏళ్లకే క్రిమినల్‌ను చేశారు: డిప్యూటీ సీఎం
న్యూఢిల్లీ: తనపై వస్తున్న అవినీతి ఆరోపణలు, నమోదైన సీబీఐ కేసులపై ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ తనయుడు, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ తొలిసారిగా స్పందించారు. 14 ఏళ్లకే తాను క్రిమినల్‌గా మారినట్లు బీజేపీ ఎలా భావించిందో తనకు అర్థం కావడం లేదన్నారు. మూతిపై మీసం కూడా రాని వయసులో క్రిమినల్‌గా మారినట్లు కేసుల ద్వారా తప్పుడు ప్రచారం జరగడంపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.
తనపై నమోదైన సీబీఐ కేసు గురించి మాట్లాడుతూ.. 2004-2009 సమయంలో తండ్రి లాలు ప్రసాద్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు హోటల్ టెండర్లను దౌర్జన్యంగా సొంతం చేసుకున్నట్లు చిత్రీకరించారని మండిపడ్డారు. 2004లో సరిగ్గా 15 ఏళ్లు కూడా లేవని, 14 ఏళ్లకే టెండర్లు వేసి అవినీతికి పాల్పడటం సాధ్యమవుతుందా అని తేజస్వి ప్రశ్నించారు. బాలుడిగా ఉన్నప్పుడే లాలు తనయుడు అవినీతికి పాల్పడ్డాడని తనపై దుష్ప్రచారం జరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఎన్ని కేసులు నమోదవుతున్న తాను వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
నితీశ్‌కుమార్ క్యాబినెట్ నుంచి డిప్యూటీ సీఎంగా ఉన్న తేజస్వి తప్పుకునే ప్రసక్తే లేదని లాలు తేల్చిచెప్పారు. తనను, తన పార్టీ ఆర్జేడీని ఫినిష్ చేసేందుకే బీజేపీ అధిష్టానం కుట్ర పన్నిందని.. అందులో భాగంగానే కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలు తమపై దాడులు చేస్తున్నాయని లాలూ ఆరోపించారు. మరోవైపు ఢిల్లీ, పాట్నాలో ఉన్న లాలూ ప్రసాద్ కుటుంబానికి చెందిన 9 కోట్లకు పైగా విలువైన భూములు, ప్లాట్లు, భవంతులను ఆస్తులను ఈ యాక్ట్ కింద అటాచ్ మెంట్ చేస్తున్నట్టు ఆదాయపు పన్ను శాఖ ఇటీవల నోటీసు జారీచేసింది.