
సాక్షి, హైదరాబాద్: ఇప్పటికే రూ.700 కోట్ల మేర రుణ బకాయిల ఎగవేత ఆరోపణలతో సీబీఐ కేసు ఎదుర్కొంటున్న విద్యుత్ ఉపకరణాల తయారీ కంపెనీ సర్వోమ్యాక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్‌ఐపీఎల్) మరో వివాదంలో చిక్కుకుంది. సర్వోమ్యాక్స్‌పై దివాలా ప్రక్రియ ప్రారంభించాలంటూ మురళీకృష్ణ పవర్ కంట్రోల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పిటిషన్ దాఖలు చేసి ఆ మేర ఉత్తర్వులు పొందిన విషయం తెలిసిందే. అయితే ఈ పిటిషన్‌ను సర్వో మ్యాక్స్‌కు లబ్ధి చేకూర్చేందుకే మురళీకృష్ణ కంపెనీ దాఖలు చేసిందన్న ప్రాథమిక నిర్ణయానికి వచ్చిన దివాలా పరిష్కార నిపుణులు (ఆర్‌పీ) దీన్ని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) హైదరాబాద్ బెంచ్ దృష్టికి తీసుకొచ్చారు. 2 కంపెనీల ఖాతా పుస్తకాల్లోని లావాదేవీలు అనుమానాస్పదంగా ఉండటంతో సర్వోమ్యాక్స్ డైరెక్టర్లతో మురళీకృష్ణ కంపెనీ కుమ్మక్కై దివాలా పిటిషన్ దాఖలు చేసిందా? అన్న అంశంపై విచారణ జరిపించాలని కోరుతూ ఎన్‌సీఎల్‌టీలో పిటిషన్ దాఖలుచేశారు.
మురళీకృష్ణ కంపెనీ దాఖలు చేసిన దివాలా పిటిషన్ వెనుక దురుద్దేశాలు ఉన్నట్లు తేలితే, ఇందులో ప్రమేయమున్న వ్యక్తులకు రూ.లక్ష నుంచి రూ.కోటి వరకు జరిమా నా విధించాలని ట్రిబ్యునల్‌ను కోరారు. పిటిషన్‌పై స్పందించిన ఎన్‌సీఎల్‌టీ సర్వోమ్యాక్స్, మురళీకృష్ణ పవర్ కంట్రోల్స్‌కు నోటీసులు జారీ చేసింది. మొత్తం వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలు తమ ముం దుంచాలని ఆదేశించింది. తదుపరి విచారణ ను ఈ నెల 27కి వాయి దా వేసింది. ఇన్సాల్వెన్సీ, బ్యాంక్‌రప్టసీ కోడ్ (ఐబీసీ) అమల్లోకి వచ్చాక ఇటువంటి పిటిషన్ దాఖలు కావడం ఎన్‌సీఎల్‌టీ చరిత్రలో ఇదే మొదటిసారి. సర్వోమ్యాక్స్ ఇండియా పలు బ్యాంకులు, కంపెనీల నుంచి రూ.700 కోట్ల మేర రుణాలు తీసుకుంది. ఈ రుణాలు చెల్లించకపోవడంతో సర్వోమ్యాక్స్‌పై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీబీఐకి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన సీబీఐ సర్వోమ్యాక్స్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. మురళీకృష్ణ పవర్ కంట్రోల్స్‌ను సర్వోమ్యాక్స్ ఉద్యోగులు, మాజీ వాటాదారులు, డైరెక్టర్లు కలసి ఏర్పాటు చేసినట్లు సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది.
అప్పు ఇచ్చిన కంపెనీయే బకాయిదారు...
మురళీకృష్ణ కంపెనీకి మొదట సర్వోమ్యాక్స్ కొంత అప్పు ఇచ్చింది. ఆ తర్వాత అనూహ్యంగా మురళీకృష్ణ కంపెనీ ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించింది. సర్వోమ్యాక్స్ తమకు రూ.8.77 కోట్ల మేర బకాయిలు చెల్లించడంలేదని, అందువల్ల ఆ కంపెనీ దివాలా ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. ఇందుకు ఎన్‌సీఎల్‌టీ సానుకూలంగా స్పందించింది. దివాలా పరిష్కార నిపుణులు (ఆర్‌పీ)గా తొలుత కొండపల్లి వెంకట శ్రీనివాస్ నియమితులయ్యారు. ఆయన నియామకంపై రుణదాతల కమిటీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో జి.మధుసూధన్‌రావును ఆర్‌పీగా నియమిస్తూ ఎన్‌సీఎల్‌టీ ఉత్తర్వులిచ్చింది. రంగంలోకి దిగిన మధుసూధన్‌రావు సర్వోమ్యాక్స్ కంపెనీ ఖాతాలను పరిశీలించారు. ఈ సమయంలో ఆడిట్ అభ్యంతరాలు ఆయన దృష్టికి వచ్చాయి. మురళీకృష్ణ కంపెనీ నుంచి సర్వోమ్యాక్స్‌కు రూ.9.94 కోట్లు రావాల్సి ఉండగా, ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి ఖాతా పుస్తకాల్లో పద్దులు మార్చి, సర్వోమ్యాక్సే మురళీకృష్ణ కంపెనీకి రూ.8.77 కోట్లు అప్పు ఉన్నట్లు పేర్కొని ఉండటాన్ని ఆడిటర్ గమనించారు. దీంతో ఆడిటర్, ఆర్‌పీ ఇద్దరూ ఆ రెండు కంపెనీల వివరణ కోరారు. సర్వోమ్యాక్స్ చెల్లించాల్సిన అప్పు తాలూకు ఆధారాలను సమర్పించాలని మురళీకృష్ణ కంపెనీలను మెయిల్స్ ద్వారా కోరారు.
స్పందించని ఇరు కంపెనీలు..
అయితే దీనిపై ఇరు కంపెనీల నుంచి సమాధానాలు రాలేదు. దీంతో మురళీకృష్ణ తనకు సర్వోమ్యాక్స్ నుంచి రావాలని చెబుతున్న రుణం రూ.8.77 కోట్లను తిరస్కరిస్తున్నట్లు మధుసూధన్‌రావు ఆ కంపెనీకి సమాచారమిచ్చారు. ఆ తర్వాత రుణదాతల సమావేశంలో ఈ రెండు కంపెనీల తీరుపై చర్చ జరిగింది. బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.700 కోట్ల రుణ బకాయి ఎగవేత విషయంలో సర్వోమ్యాక్స్‌కు లబ్ధి చేకూర్చేందుకే మురళీకృష్ణ కంపెనీ ఎన్‌సీఎల్‌టీ ముందు పిటిషన్ దాఖలు చేసిందా? అన్న అనుమానం వచ్చింది. దీంతో ఈ కంపెనీల వ్యవహారాన్ని పిటిషన్ ద్వారా ఎన్‌సీఎల్‌టీకి తెలియజేయాలని సమావేశంలో తీర్మానించారు. దీంతో ఇరు కంపెనీలు వ్యవహరించిన తీరును ఆర్‌పీ మధుసూధన్‌రావు లిఖితపూర్వంగా ఎన్‌సీఎల్‌టీకి నివేదించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ఎన్‌సీఎల్‌టీ సభ్యులు.. రాటకొండ మురళీ, సర్వోమ్యాక్స్ మాజీ డైరెక్టర్లు అవసరాల వెంకటేశ్వరరావు, దొప్పలపూడి హరీశ్‌కుమార్, వెంకట చంద్ర రావులపాటి శేఖర్, మురళీకృష్ణ పవర్ కంట్రోల్స్ లిమిటెడ్‌లతో పాటు ఆడిటింగ్ కంపెనీకి కూడా నోటీసులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment