న్యూఢిల్లీ: ఈ నెల 19వ తేదీన నిర్వహించబోయే అఖిలపక్ష భేటీ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన నిగూఢ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపాయి. ‘ఒక దేశం.. ఒకసారి ఎన్నికలు’ (వన్ నేషన్.. వన్ ఎలక్షన్)తో పలు కీలక అంశాలను చర్చించేందుకు బుధవారం (19న) అఖిలపక్ష భేటీని నిర్వహించాలని నరేంద్రమోదీ సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే.
రెండోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆదివారం నిర్వహించిన అఖిలపక్ష భేటీలో ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షత వహించారు. ఈ భేటీలో ప్రసంగించిన మోదీ.. జూన్ 19నాటి అఖిలపక్ష భేటీకి అన్ని పార్టీల అధ్యక్షులు తప్పకుండా రావాలని కోరారు. అంతేకాకుండా.. అధ్యక్షులు లేని పార్టీలు కూడా ఈ భేటీకి రావాలని ఆయన వ్యాఖ్యానించారు. విపక్ష నేత రాహుల్ గాంధీని ఉద్దేశించి ప్రధాని మోదీ పరోక్షంగా ఈ వ్యంగ్యాస్త్రాన్ని సంధించారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసినట్టు కథనాలు వచ్చాయి. ప్రస్తుతం ఏఐసీసీ తదుపరి అధ్యక్షుడు ఎవరన్నది తర్జనభర్జన జరుగుతోంది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు లేని కాంగ్రెస్ పార్టీ సైతం అఖిలపక్ష భేటీకి రావొచ్చంటూ మోదీ ఛలోక్తి విసిరారని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే, మోదీ వ్యాఖ్యలు పెద్దగా వ్యంగ్యమేమీ లేదని, అధ్యక్షులు లేని సీపీఐ, సీపీఎం పార్టీలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని మరికొంత మంది అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment