ఏఐసీసీలో మీడియాతో మాట్లాడుతున్న రాహుల్
న్యూఢిల్లీ: రఫేల్ ఒప్పందం సహా ఏ వ్యూహాత్మక అంశంపై అయినా దమ్ముంటే తనతో 20 నిమిషాలు ముఖాముఖి చర్చకు రావాలని ప్రధాని మోదీకి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సవాలు విసిరారు. రాహుల్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ..‘ప్రధాని మోదీతో ముఖాముఖి చర్చ కోసం నాకు కేవలం 20 నిమిషాలు ఇవ్వండి. ఆ తర్వాత వాస్తవమేంటో మీరే నిర్ణయించుకోండి. కానీ ప్రధాని మోదీకి మీ(మీడియా) ముందు కూర్చుని మాట్లాడే దమ్ము లేదు. మీరంతా మంగళవారం ప్రధాని ఇంటర్వ్యూ చూశారా? ఆయనేమో అక్కడ నవ్వుతున్నారు.
ఎదురుగా ఉన్న జర్నలిస్ట్ మాత్రం ప్రశ్నలతో పాటు ప్రధాని ఇవ్వాల్సిన జవాబులను చెప్పేస్తున్నారు’ అని విమర్శించారు. రఫేల్ ఆడియో టేపు విషయమై మాట్లాడుతూ..‘రఫేల్‌కు సంబంధించిన ఫైలు మొత్తం తన దగ్గర ఉందని గోవా సీఎం పరీకర్ చెప్పినట్లు ఆయన కేబినెట్ సభ్యుడు రాణే బయటపెట్టారు. తనను ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి తప్పించకుండా ఉండేందుకు పరీకర్ దీన్ని వాడుకుంటున్నారు. ఇలాంటి ఆడియో టేపులు ఇంకా చాలా ఉండొచ్చు. పరీకర్ ప్రధానిని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు’ అని రాహుల్ వ్యాఖ్యానించారు.
అధికారంలోకి రాగానే విచారణ జరిపిస్తాం..
రఫేల్ ఒప్పందంపై తనకు ఎలాంటి ప్రశ్నలు ఎదురుకాలేదని మోదీ చెప్పడంపై స్పందిస్తూ..‘ఆయన ఏ లోకంలో జీవిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. మోదీజీ.. మీకు వ్యతిరేకంగా ప్రశ్నలు వస్తున్నాయి. మీరు అనిల్ అంబానీ(ఏఏ)కు రూ.30,000 కోట్లు ఎందుకు ఇచ్చారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు’ అని వెల్లడించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రఫేల్ ఒప్పందంపై విచారణకు ఆదేశిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment