న్యూఢిల్లీ: సూపర్‌సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ బ్రహ్మోస్‌ను ఆదివారం భారత వైమానిక దళం(ఐఏఎఫ్) విజయవంతంగా పరీక్షించింది. స్టెల్త్ డెస్ట్రాయర్ ‘ఐఎన్‌ఎస్ చెన్నై’నుంచి ప్రయోగించిన ఈ క్షిపణి అరేబియా సముద్రంలోని లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదించిందని అధికారులు తెలిపారు. ‘సముద్ర జలాలపై లక్ష్యాలను ఛేదించగలిగే సత్తా ఉన్న బ్రహ్మోస్ యుద్ధ నౌక అజేయశక్తిని మరింత ఇనుమడింపజేసిందని, భారత నేవీ వద్ద ఉన్న మరో ప్రమాదకర అస్త్రాల్లో ఒకటిగా మారిందని రక్షణ శాఖ తెలిపింది.
భారత్–రష్యా ఉమ్మడి భాగస్వామ్యంలో రూపొందిన బ్రహ్మోస్ క్షిపణులను జలాంతర్గాములు, యుద్ధనౌకలు, విమానాలతో పాటు నేలపై నుంచి కూడా ప్రయోగించే వీలుంది. ఈ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసిన రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో), బ్రహ్మోస్ ఏరోస్పేస్, భారత నేవీని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు. క్షిపణి ప్రయోగంలో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలు, సిబ్బందిని డీఆర్‌డీవో చైర్మన్ జి.సతీశ్ రెడ్డి కూడా అభినందించారు. మన సైనిక పాటవం బ్రహ్మోస్ క్షిపణితో మరింత పెరుగుతుం దన్నారు. సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో.. భారత్.. నేలపై నుంచి నేలపైకి బ్రహ్మోస్‌ను, యాంటీ రేడియేషన్ క్షిపణి రుద్రం–1ను, లేజర్ గైడెడ్ యాంటీ ట్యాంక్ మిస్సైల్‌ను, అణు సామర్థ్యం ఉన్న శౌర్య క్షిపణులను విజయవంతంగా పరీక్షించింది.
Comments
Please login to add a commentAdd a comment