cruise missile
-
ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడి
కీవ్: ఉక్రెయిన్ సైనిక మౌలిక వసతులను ధ్వంసం చేయడమే లక్ష్యంగా రష్యా శుక్రవారం 93 క్రూయిజ్, బాలిస్టిక్ క్షిపణులతో దాడికి తెగబడింది. ఏకంగా 200 డ్రోన్లతో దాడి చేసింది. గత మూడేళ్లలో రష్యా ఒకే రోజులో చేసిన అతిపెద్ద దాడుల్లో ఇది కూడా ఒకటని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. రష్యా నుంచి దూసుకొచ్చిన వాటిల్లో 11క్రూయిజ్ క్షిపణులుసహా 81 మిస్సైళ్లను పశి్చమదేశాలు అందించిన ఎఫ్–16 యద్ధవిమానాల సాయంతో నేలమట్టంచేశామని ఆయన చెప్పారు. ‘‘ పెనుదాడులతో ఉక్రేనియన్లను భయపెడుతున్న రష్యాకు, పుతిన్‌కు వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం ఐక్యంగా నిలబడాల్సిన తరుణమిది. పెద్ద ప్రతిఘటన, భారీ ఎదురుదాడితో రష్యా ఉగ్రచర్యలను అడ్డుకుందాం’’ అని జెలెన్స్కీ తన టెలిగ్రామ్ ఛానెల్ ద్వారా చెప్పారు. ఉక్రెయిన్ రక్షణ పారిశ్రామికవాడల్లో ఇంధన, శక్తి వనరులు, మౌలిక వసతులను ధ్వంసంచేయడమే లక్ష్యంగా తమ సైన్యం దాడులు చేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. తమ బొగ్గు విద్యుత్ ఉత్పత్తికేంద్రాలకు భారీ నష్టం వాటిల్లిందని ఉక్రెయిన్‌లోని అతిపెద్ద ప్రైవేట్ విద్యుత్ సంస్థ డీటెక్ తెలిపింది. ఉక్రెయిన్‌లో ఆయుధాలు, మందుగుండు సామగ్రి తయారీని నిలువరించడమే లక్ష్యంగా ఇంధన వ్యవస్థలపైనే రష్యా తరచూ దాడులుచేస్తుండటం తెల్సిందే. నవంబర్ 28న చేసిన ఇలాంటి దాడిలో 200 మిస్సైళ్లు, డ్రోన్లను ప్రయోగించింది. నాటి నష్టం కారణంగా 10 లక్షల కుటుంబాలు అంధకారంలో ఉండిపోయాయి. -
DRDO: స్వదేశీ క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
భువనేశ్వర్(ఒడిశా): దేశీయంగా అభివృద్ధి చేసిన ఇండిజినస్ టెక్నాలజీ క్రూయిజ్ మిస్సైల్(ఐటీసీఎం)ను గురువారం ఒడిశా తీరంలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి విజయవంతంగా పరీక్షించారు. ఇందులో ఉపవ్యవస్థలను అంచనాల మేరకు పనిచేశాయని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) తెలిపింది. క్షిపణి ప్రయాణ మార్గంలో ఏర్పాటు చేసిన రాడార్, ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టమ్, టెలిమెట్రీ వంటి సెన్సార్ల ద్వారా పనితీరును అంచనా వేసినట్లు పేర్కొంది. దీంతోపాటు, వాయుసేనకు చెందిన ఎస్‌యూ–30 ఎంకే–ఐ విమానం ద్వారా కూడా క్షిపణి ప్రయాణం తీరును అంచనా వేసినట్లు డీఆర్డీవో వివరించింది. -
ఒడెసా పోర్టుపై రష్యా భీకర దాడులు
కీవ్: ఉక్రెయిన్‌లోని ఒడెసా పోర్టుపై డ్రోన్లు, క్షిపణులతో సోమవారం రష్యా భారీ దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో పోర్టు మౌలిక వసతులు ధ్వంసమయ్యాయి. రష్యా ప్రయోగించిన 12 కాలిబర్ మిస్సైళ్లలో పదకొండింటిని, రెండు పీ–800 ఓనిక్స్ క్రూయిజ్ మిస్సైళ్లను కూల్చేసినట్లు ఉక్రెయిన్ రక్షణ శాఖ తెలిపింది. ఉక్రెయిన్ ధాన్యాన్ని నల్ల సముద్రం మీదుగా ఓడల ద్వారా తరలించే ఒప్పందం నుంచి రష్యా వైదొలిగింది. అప్పటి నుంచి ఒడెసా ఓడరేవు లక్ష్యంగా పదేపదే దాడులకు దిగుతోంది. ఫలితంగా ధాన్యం గోదాములు, ఆయిల్ డిపోలు, షిప్పింగ్, నిల్వ సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. -
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు.. 8 మంది మృతి
కీవ్: ఉక్రెయిన్ వ్యాప్తంగా రష్యా సాగించిన దాడుల్లో 8 మంది పౌరులు మృతి చెందగా పలువురు గాయాలపాలయ్యారు. డొనెట్స్క్లోని నియు–యోర్క్‌పై రష్యా సైన్యం జరిపిన కాల్పుల్లో నలుగురు చనిపోగా మరో ముగ్గురు గాయపడ్డారని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. కొస్టియాంటీనివ్కాపై జరిగిన రాకెట్ల దాడిలో 20 వరకు ఇళ్లు, కార్లు, గ్యాస్ పైప్‌లైన్ ధ్వంసం కాగా ఇద్దరు మృతి చెందారు. ఒకరు గాయపడ్డారు. చెరి్నహివ్పై రష్యా క్రూయిజ్ మిస్సైళ్లు పడటంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. జపొరిఝియా అణు ప్లాంట్ పొరుగునే ఉన్న పట్టణంపై రష్యా దాడిలో ముగ్గురు పౌరులు గాయపడ్డారు. ఇలా ఉండగా, నల్ల సముద్రం ధాన్యం రవాణా ఒప్పందాన్ని రద్దు చేసిన రష్యా ఉక్రెయిన్ నౌకా తీర ప్రాంతం ఒడెసాను లక్ష్యంగా చేసుకుంది. రష్యా మిలటరీ ప్రయోగించిన రెండు క్రూయిజ్ మిస్సైళ్లు గిడ్డంగులపై పడటంతో మంటలు చెలరేగి పరికరాలు ధ్వంసమయ్యాయని, 120 మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు బూడిదయ్యాయని ఉక్రెయిన్ తెలిపింది. క్రిమియాపై దాడులకు ప్రతీకారంగానే ఈ దాడులకు పాల్పడినట్లు రష్యా తెలిపింది. ఈ పరిణామంపై తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగన్ స్పందించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ డిమాండ్లను పశ్చిమదేశాలు నెరవేర్చి, ధాన్యం రవాణా కారిడార్ ఒప్పందాన్ని పునరుద్ధరించుకోవాలని సూచించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్ చేసి మాట్లాడతానని, వచ్చే నెలలో తుర్కియేలో ఆయనతో భేటీ ఉంటుందని ఆశిస్తున్నానన్నారు. కాగా, రష్యా ఆక్రమిత క్రిమియాలో వారం వ్యవధిలో రెండోసారి డ్రోన్ పేలింది. క్రాస్నోవార్డిస్క్‌లోని ఆయిల్ డిపో, ఆయుధ గిడ్డంగిలను డ్రోన్ బాంబులతో పేల్చేసినట్లు ఉక్రెయిన్ తెలిపింది. సోమవారం ఉక్రెయిన్ జరిపిన దాడిలో రష్యాను కలిపే కీలకమైన క్రిమియా వంతెన కొంతభాగం దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఇలా ఉండగా, జపొరిఝియా ప్రాంతంలో ఉక్రెయిన్ శతఘ్ని కాల్పుల్లో రియా వార్తా సంస్థకు చెందిన రష్యా జర్నలిస్టు ఒకరు మృతి చెందారు. -
కీవ్‌పై రష్యా క్షిపణుల వర్షం
కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా సైన్యం మరోసారి విరుచుకుపడింది. సోమవారం ఉదయం 11.30 గంటల సమయంలో బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. రష్యా సైన్యం ప్రయోగించిన 11 బాలిస్టక్, క్రూయిజ్ క్షిపణులను తాము కూల్చివేశామని ఉక్రెయిన్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ప్రకటించారు. వాటి శకలాలు నగరంలో అక్కడక్కడా చెల్లాచెదురుగా పడిపోయాయని, దట్టమైన పొగ కమ్ముకుందని చెప్పారు. రష్యా దాడుల్లో కీవ్‌లో ఒకరు గాయపడినట్లు సమాచారం. రష్యా సేనలు తొలుత ఆదివారం రాత్రి దాడులు ప్రారంభించాయి. జనం బిక్కుబిక్కుమంటూ గడిపారు. కొందరు అండర్‌గ్రౌండ్ రైల్వే స్టేషన్లలో తలదాచుకున్నారు. కొంత విరామం తర్వాత సోమవారం ఉదయం మళ్లీ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో పలు భవనాలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. రష్యా క్షిపణి దాడుల నేపథ్యంలో చిన్నారులు భయాందోళనలతో బాంబు షెల్టర్ వైపు పరుగులు తీస్తున్న వీడియోను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఉక్రెయిన్ వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని లాంగ్–రేంజ్ మిస్సైళ్లు ప్రయోగించినట్లు రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. ఈ దాడుల్లో ఉక్రెయిన్‌కు చెందిన కమాండ్ పోస్టులు, రాడార్లు, ఆయుధాలు ధ్వంసమయ్యాయని పేర్కొంది. కీవ్‌లో క్షిపణుల దాడి భయంతో మెట్రో స్టేషన్లో దాక్కున్న స్థానికులు -
ఉక్రెయిన్ చేతికి ‘పేట్రియాట్’
కీవ్: అమెరికా అత్యాధునిక పేట్రియాట్ గైడెడ్ క్షిపణి వ్యవస్థ ఉక్రెయిన్ చేతికొచ్చింది. దీంతో రష్యా యుద్ధమూకలను మరింత దీటుగా ఎదుర్కొంటామని ఉక్రెయిన్ రక్షణ మంత్రి ఒలెక్సీ రెజ్నికోవ్ బుధవారం ట్వీట్‌చేశారు. ‘ భూతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే పేట్రియాట్ క్షిపణి వ్యవస్థ రాకతో మా గగనతలానికి మరింత రక్షణ చేకూరింది’ అని ఆయన అన్నారు. శత్రు సేనల నుంచి దూసుకొచ్చే క్షిపణులు, స్వల్ప శ్రేణి బాలిస్టిక్ మిస్సైళ్లను ఈ వ్యవస్థతో కూల్చేయొచ్చు. క్రూయిజ్ క్షిపణులు, స్వల్ప శ్రేణి మిస్సైళ్లతోనే ఉక్రెయిన్ పౌర మౌలిక వసతులు ముఖ్యంగా విద్యుత్ సరఫరా వ్యవస్థలను రష్యా ధ్వంసం చేస్తున్న విషయం విదితమే. అందుకే జనావాసాలు, మౌలిక వసతుల రక్షణ కోసం కొంతకాలంగా పేట్రియాట్ సిస్టమ్స్ సరఫరా చేయాలని అమెరికాను ఉక్రెయిన్ కోరుతోంది. ఇన్నాళ్లకు అవి ఉక్రెయిన్ చేతికొచ్చాయి. -
Russia Ukraine war: కీవ్‌లో క్షిపణుల మోత
కీవ్: ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాలు రాకెట్ లాంచర్లు, అత్యాధునిక ఆయుధాలు సరఫరా చేస్తుండడం పట్ల రష్యా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతీకార చర్యలు ప్రారంభించింది. పశ్చిమ దేశాలకు గట్టి హెచ్చరికలు జారీ చేయడమే లక్ష్యంగా రష్యా సైన్యం ఆదివారం తెల్లవారుజామునే ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై క్షిపణుల వర్షం కురిపించింది. గత ఐదు వారాలుగా ప్రశాంతంగా ఉన్న కీవ్ మిస్సైళ్ల మోతతో దద్దరిల్లిపోయింది. ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాలు అందజేసిన యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేశామని రష్యా ప్రకటించింది. తమ సైన్యం అత్యంత కచ్చితత్వం కలిగిన లాంగ్ రేంజ్ మిస్సైళ్లు ప్రయోగించిందని రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. యూరప్ దేశాలు ఇచ్చిన టీ–72 యుద్ధ ట్యాంకులు, ఇతర సైనిక వాహనాలు నామరూపాల్లేకుండా పోయాయని పేర్కొంది. అయితే, ఈ విషయాన్ని ఉక్రెయిన్ ఖండించింది. కీవ్‌లో రైల్వే స్టేషన్లు, ఇతర మౌలిక సదుపాయాలపైనా రష్యా సైన్యం దాడులకు పాల్పడింది. రష్యా క్షిపణులు కీవ్ సమీపంలోని డార్నిట్స్కీ, డినిప్రోవ్స్కీ జిల్లాలను వణికించాయి. కీవ్‌కు 350 కిలోమీటర్ల దూరంలోని అణు విద్యుత్ కేంద్రంపై క్రూయిజ్ మిస్సైల్‌ను ప్రయోగించింది. తూర్పు ఉక్రెయిన్‌లోని లుహాన్స్క్లో పలు నగరాలు, గ్రామాలపై రష్యా సైన్యం మిస్సైళ్లు ప్రయోగించింది. గిర్స్కీలో 13, లీసిచాన్‌స్క్‌లో 5 ఇళ్లు దెబ్బతిన్నాయి. క్రామటోర్‌స్క్‌లోనూ వైమానిక దాడులు కొనసాగాయి. ఖర్కీవ్‌లోని చెర్కాస్కీ తీస్కీ గ్రామంలో రష్యా దళాలు ఫాస్ఫరస్ ఆయుధాలు ప్రయోగించాయని ఉక్రెయిన్ ఆరోపించింది. డోన్బాస్లో కీలకమైన సీవిరోడోంటెస్క్ సిటీలో 80శాతం మేర రష్యా సేనలు ఆక్రమించుకున్నాయి. ఉక్రెయిన్–రష్యా యుద్ధంలో మృతిచెందిన ఇరు పక్షాల సైనికుల మృతదేహాలను పరస్పరం మార్చుకొనే ప్రక్రియ అధికారికంగా ప్రారంభమయ్యింది. దక్షిణ జపొరిఝాజియాలో 160 మృతదేహాలను మార్చుకున్నట్లు ఉక్రెయిన్ యంత్రాంగం ప్రకటించింది. దయచేసి యుద్ధం ఆపండి: పోప్ ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఇకనైనా ఆపాలని పోప్ ఫ్రాన్సిస్ రష్యాకు మళ్లీ విజ్ఞప్తి చేశారు. ‘దయచేసి ప్రపంచాన్ని నాశనం చేయకండి’ అని ఆదివారం ఆయన విన్నవించారు. యుద్ధం కారణంగా బాధితులుగా మారుతున్న ప్రజల రోదనలు వినాలని ఉక్రెయిన్, రష్యా అధినేతలను పోప్ కోరారు. -
‘బ్రహ్మోస్’ పరీక్ష విజయవంతం
న్యూఢిల్లీ: సూపర్సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ బ్రహ్మోస్‌ను ఆదివారం భారత వైమానిక దళం(ఐఏఎఫ్) విజయవంతంగా పరీక్షించింది. స్టెల్త్ డెస్ట్రాయర్ ‘ఐఎన్ఎస్ చెన్నై’నుంచి ప్రయోగించిన ఈ క్షిపణి అరేబియా సముద్రంలోని లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదించిందని అధికారులు తెలిపారు. ‘సముద్ర జలాలపై లక్ష్యాలను ఛేదించగలిగే సత్తా ఉన్న బ్రహ్మోస్ యుద్ధ నౌక అజేయశక్తిని మరింత ఇనుమడింపజేసిందని, భారత నేవీ వద్ద ఉన్న మరో ప్రమాదకర అస్త్రాల్లో ఒకటిగా మారిందని రక్షణ శాఖ తెలిపింది. భారత్–రష్యా ఉమ్మడి భాగస్వామ్యంలో రూపొందిన బ్రహ్మోస్ క్షిపణులను జలాంతర్గాములు, యుద్ధనౌకలు, విమానాలతో పాటు నేలపై నుంచి కూడా ప్రయోగించే వీలుంది. ఈ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసిన రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో), బ్రహ్మోస్ ఏరోస్పేస్, భారత నేవీని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు. క్షిపణి ప్రయోగంలో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలు, సిబ్బందిని డీఆర్డీవో చైర్మన్ జి.సతీశ్ రెడ్డి కూడా అభినందించారు. మన సైనిక పాటవం బ్రహ్మోస్ క్షిపణితో మరింత పెరుగుతుం దన్నారు. సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో.. భారత్.. నేలపై నుంచి నేలపైకి బ్రహ్మోస్‌ను, యాంటీ రేడియేషన్ క్షిపణి రుద్రం–1ను, లేజర్ గైడెడ్ యాంటీ ట్యాంక్ మిస్సైల్‌ను, అణు సామర్థ్యం ఉన్న శౌర్య క్షిపణులను విజయవంతంగా పరీక్షించింది. -
పాక్ క్రూయిజ్ క్షిపణి ప్రయోగం సక్సెస్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ వైమానిక పరీక్షను మంగళవారం విజయవంతంగా నిర్వహించింది. అణుసామర్థ్యం గల క్రూయిజ్ క్షిపణి రాద్–2ను 600 కిలోమీటర్ల పరిధిలో ప్రయోగించింది. ఇది భూమిపై, సముద్రంలో సైనిక ‘నియంత్రణ సామర్థ్యం’ను పెంచింది. లక్ష్యాలను కచ్చితత్వంతో ఛేదించేందుకు రాద్–2 ఆయుధ వ్యవస్థకు అత్యాధునిక నావిగేషన్ వ్యవస్థను అనుసంధానించారని మిలటరీ అధికార ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో పాకిస్తాన్ శక్తి, సామర్థ్యాలకనుగుణంగా మరో కీలక అడుగు ముందుకు పడిందని లెఫ్టినెంట్ జనరల్ నదీమ్ జకీ మంజ్ హర్షం వ్యక్తంచేశారు. పాకిస్తాన్ అధ్యక్షుడు అరీఫ్ అల్వి, ప్రధాని ఇమ్రాన్ ఖాన్, సీనియర్ మిలిటరీ అధికారులు ఈ క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించిన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు అభినందనలు తెలిపారు. కాగా, పాక్ అభివృద్ధి చేసిన ఈ రాద్ క్షిపణిని.. భారత్ బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణికి దీటుగా రూపొందించేందుకు ప్రయత్నించిందని అమెరికాకు చెందిన ఓ సంస్థ పేర్కొంది. -
ఐఎన్ఎఫ్ నుంచీ నిష్క్రమిస్తాం: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి వైదొలగడం, ఇరాన్ అణు ఒప్పందాన్ని రద్దు చేయడం వంటి నిర్ణయాలతో ఇప్పటికే విమర్శలను ఎదుర్కొటున్న ట్రంప్.. తాజాగా మూడు దశాబ్దాల నాటి ఇంటర్మీడియట్–రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ (ఐఎన్ఎఫ్) నుంచి అమెరికాను ఉప సంహరించనున్నట్లు చెప్పారు. 1987లో అమెరికా, యూఎస్ఎస్ఆర్ అధ్యక్షులు వరుసగా రొనాల్డ్ రీగన్, గోర్బచేవ్‌ల మధ్య ఐఎన్ఎఫ్ ఒప్పందం కుదిరింది. 300 నుంచి 3,400 మైళ్ల శ్రేణి కలిగిన క్రూయిజ్ క్షిపణులను అమెరికా, రష్యాలు ఉత్పత్తి చేయకుండా, తమ దగ్గర ఉంచుకోకుండా, పరీక్షించకుండా ఈ ఒప్పందం నిరోధిస్తోంది. 2021లో ఈ ఒప్పందం గడువు ముగియనుంది. అయితే రష్యా ఈ ఒప్పందాన్ని ఏళ్లుగా ఉల్లంఘిస్తోందని ట్రంప్ తాజాగా ఆరోపిస్తున్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ ‘ఒప్పందాన్ని మేం రద్దు చేసుకోబోతున్నాం. వైదొలుగుతాం. రష్యా, చైనాలు కొత్త ఒప్పందానికి ఒప్పుకోకపోతే ఐఎన్‌ఎఫ్‌ను రద్దు చేసి ఆయుధాలను అభివృద్ధి చేసుకుంటాం’ అని చెప్పారు. ‘వారు (రష్యా, చైనాలు) మా దగ్గరకు వచ్చి మన మంతా బాగుండాలనీ, ఎవ్వ రూ ఆయుధాలు ఉత్పత్తి చేయకూడదని చెబుతారు. కానీ వారు ఆయుధాలు తయారు చేస్తుంటే మేం మాత్రం ఒప్పందానికి కట్టుబడి చేతులు ముడుచుకుని కూర్చోవాలా? ఇది ఆమోదయోగ్యం కాదు’ అని ట్రంప్ అన్నారు. కాగా, ట్రంప్ నిర్ణయం ప్రమాదకరమైనదని రష్యా పేర్కొంది. -
తిరుగులేని బ్రహ్మోస్
బాలాసోర్/న్యూఢిల్లీ: సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్‌ను భారత్ మరోసారి విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని బాలాసోర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి సోమవారం క్షిపణిని ప్రయోగించినట్లు రక్షణ శాఖ వెల్లడించింది. ప్రయోగ సమయంలో సముద్రంలో అలలు తొమ్మిది మీటర్ల ఎత్తుకు ఎగిసిపడుతున్నాయని, ప్రతికూల వాతావ రణంలోనూ నిర్దేశించిన మార్గంలో బ్రహ్మోస్ ప్రయాణించిందని, క్షిపణిలోని ముఖ్య భాగాలన్నీ కచ్చితత్వంతో పని చేశాయంది. దీన్నిబట్టి అత్యంత తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లోనూ లక్ష్యాలను బ్రహ్మోస్ ఛేదించ గలదని మరోమారు రుజువైందని పేర్కొంది. క్షిపణి జీవిత కాలాన్ని పెంచే కార్యక్రమంలో భాగంగా ప్రయోగం నిర్వహించామని, త్వరలోనే దీన్ని ఆర్మీకి అప్పగించనున్నామని వెల్లడించింది. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిగా పేరొందిన బ్రహ్మోస్.. 290 కి.మీ. పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు. -
బ్రహ్మోస్ పరీక్ష విజయవంతం
-
ఏకంగా ప్రపంచాన్ని మోసం చేసిన పాక్!
-
ఏకంగా ప్రపంచాన్ని మోసం చేసిన పాక్!
న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఒక్క భారత్‌నే కాదు మొత్తం ప్రపంచాన్నే మోసం చేసిందా? అసలు ఎలాంటి పరీక్ష నిర్వహించకుండానే అది చేసినట్లు అందులో విజయం సాధించినట్లు డంబాలు పలికి అందర్నీ బోల్తా కొట్టించిందా? అంటే అవుననే భారత్‌కు చెందిన నిపుణులు అంటున్నారు. అవును.. పాకిస్థాన్ అసలు ఏ క్షిపణిని ఈ రెండు రోజుల్లో ప్రయోగించలేదంట. చదవండి..(యుద్ధ క్షిపణిని పరీక్షించిన పాక్) అది బాబర్ 3 అనే క్షిపణిని తొలిసారి జలాంతర్గామి నుంచి ప్రయోగించినట్లు అది విజయం సాధించినట్లు పాక్ మీడియా చెప్పిన విషయం తెలిసిందే. అయితే, భారత్‌కు చెందిన రక్షణశాఖ, ఉపగ్రహ పరీశీలన విశ్లేషకులు మాత్రం పాక్ చెప్పేదంత బూటకం అని కొట్టి పారేస్తున్నారు. దీనికి సంబంధించి రాజ్ అనే ప్రముఖ విశ్లేషకులు పాక్ ప్రపంచాన్ని ఎలా మోసం చేసింది ఉదాహరణతో వివరించారు. కంప్యూటర్ గ్రాఫిక్స్ ద్వారా బాబర్ 3ని ప్రయోగించినట్లు వీడియో రూపొందించి అందరినీ బోల్తా కొట్టించిందని చెప్పారు. -
నిర్భయ్.. నాలుగోసారీ విఫలం
స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధిచేసిన నిర్భయ్ క్షిపణి ప్రయోగం నాలుగోసారి కూడా విఫలమైంది. అయితే ఈ విషయమై డీఆర్డీఓ మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం, బుధవారం ఒడిశాలోని చాందీపూర్‌లో ఏర్పాటుచేసిన ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ప్రయోగకేంద్రం నుంచి దీన్ని ప్రయోగించారు. కానీ సాంకేతిక లోపాల కారణంగా ఇది విఫలమైందని సమాచారం. టేకాఫ్ వరకు బాగానే ఉన్నా.. అది వెళ్లాల్సిన మార్గం నుంచి అది పక్కకు పోయిందని అంటున్నారు. అది ఎక్కడైనా భూమ్మీద పడే ప్రమాదం ఉండటంతో.. దాన్ని మధ్యలోనే, ప్రయోగించిన కొద్ది నిమిషాలకే పేల్చేశారు. ఆరు మీటర్ల పొడవైన నిర్భయ్ క్షిపణి.. 1500 కిలోల బరువు ఉంటుంది. ఇది వెయ్యి కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా ఛేదించేలా దీన్ని తయారుచేశారు. ఇది సంప్రదాయ, అణు వార్ హెడ్లను కూడా మోసుకెళ్లగలదు. తొలిసారి దీన్ని 2013 మార్చి 12న ప్రయోగించగా, 20 నిమిషాల తర్వాత విఫలమైంది. 2014 అక్టోబర్ 17న చేసిన రెండో ప్రయోగం కూడా అది తగినంత ఎత్తు వెళ్లలేక విఫలమైంది. ఆ తర్వాత 2015 అక్టోబర్ 16న మూడోసారి చేసిన ప్రయోగంలో అది 128 కిలోమీటర్లు వెళ్లిన తర్వాత.. బంగాళాఖాతంలోకి పడిపోయింది. ప్రస్తుతం భారత అమ్ములపొదిలో ఉన్న బ్రహ్మోస్ కూడా అణు వార్హెడ్లను తీసుకెళ్లగలదు. కానీ అది 290 కిలోమీటర్లు మాత్రమే వెళ్తుంది. దాంతో దీర్ఘశ్రేణి క్షిపణి అవసరం అవుతుందని దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. -
శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ అభినందనలు
న్యూఢిల్లీ: 'నిర్భయ్' క్షిపణి విజయవంతం కావడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. దేశ రక్షణ విభాగాన్ని మరింత పటిష్ట పరచడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా నిర్భయ్ క్షిపణి సక్సెస్ కావడానికి కృషి చేసిన శాస్త్రవేత్తలకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ' ఇది దేశ రక్షణ విభాగం మరింత బలోపేతం కావడానికి మనం సాధించిన గొప్ప ఘన విజయం' అని ఓ సందేశాన్ని విడుదల చేశారు. భూ ఉపరితలంపై నుంచే కాకుండా నీళ్ల పై నుంచి వాయు మార్గాల్లో దాడి చేయగల సత్తా ఉన్న నిర్భయ్ క్షిపణి ప్రయోగం విజయవంతం అయ్యింది. ఈ క్షిపణి 700 కిలోమీటర్ల కు పైగా దూరంలోని లక్ష్యాన్ని కూడా ఇది సునాయాసంగా ఛేదించగలదు. ఈ క్షిపణి ప్రయోగం విజయవంతం కావడంతో క్రూయిజ్ మిసైళ్ల సామర్థ్యం గల దేశాల సరసన భారత్ కూడా చేరింది. -
అమెరికా క్షిపణులకంటే 'నిర్భయ్' మేలైంది
హైదరాబాద్ : భారత్ అమ్ముల పొదిలో నిర్భయ్ క్షిపణి తిరుగులేని అస్త్రమని సైంటిస్ట్ సతీష్ రెడ్డి అన్నారు. క్షిపణి తయారీలో పాలుపంచుకున్న ఆయన చాందీపూర్ నుంచి ప్రయోగం వివరాలను శుక్రవారం 'సాక్షి'కి అందించారు. అతి తక్కువ ఎత్తులో నిర్భయ్ ప్రయాణించగలదని సతీష్ రెడ్డి వెల్లడించారు. క్షిపణి తయారీలో హైదరాబాద్‌కు చెందిన రక్షణ ప్రయోగశాల కీలక పాత్ర వహించిందన్నారు. అమెరికా దగ్గరున్న క్షిపణులకంటే నిర్భయ్ చాలా మేలైనదన్నారు. సముద్రం అలలపై నుంచి 5 మీటర్ల ఎత్తులో కూడా ప్రయాణించగలన్నారు. వెయ్యి కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్నీ చేధించగలదని, 16 పాయింట్లను టచ్ చేసుకుంటూ క్షిపణి తన గమ్యస్థానాన్ని చేరుకుంటుందన్నారు. కాగా చాందీపూర్ నుంచి ప్రయోగించిన నిర్భయ్ క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. -
నిర్భయ్ క్షిపణి ప్రయోగం విజయవంతం
భూమి మీద నుంచి, నీళ్ల మీద నుంచి, వాయు మార్గం నుంచి ఎలాగైనా చేయగల నిర్భయ్ క్షిపణి ప్రయోగం విజయవంతం అయ్యింది. 850 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని కూడా ఇది సునాయాసంగా ఛేదించగలదు. ఈ క్షిపణి ప్రయోగం విజయవంతం కావడంతో క్రూయిజ్ మిసైళ్ల సామర్థ్యం గల దేశాల సరసన భారత్ కూడా చేరింది. మొబైల్ లాంచర్ ద్వారా ఎక్కడినుంచైనా ప్రయోగించగల నిర్భయ్.. సగం మిసైల్ గాను, సగం విమానరూపంలోను ప్రయాణం చేస్తుంది. భూమిక అతి తక్కువ ఎత్తులో ఇది ప్రయాణిస్తుంది కాబట్టి.. రాడార్ నిఘా నుంచి కూడా ఇది తప్పించుకోగలదు. అందువల్ల శత్రువుల కంటబడకుండా వెళ్లే సామర్థ్యం దీనికి ఉంటుంది.