అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి వైదొలగడం, ఇరాన్ అణు ఒప్పందాన్ని రద్దు చేయడం వంటి నిర్ణయాలతో ఇప్పటికే విమర్శలను ఎదుర్కొటున్న ట్రంప్.. తాజాగా మూడు దశాబ్దాల నాటి ఇంటర్మీడియట్–రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ (ఐఎన్‌ఎఫ్) నుంచి అమెరికాను ఉప సంహరించనున్నట్లు చెప్పారు. 1987లో అమెరికా, యూఎస్‌ఎస్‌ఆర్ అధ్యక్షులు వరుసగా రొనాల్డ్ రీగన్, గోర్బచేవ్‌ల మధ్య ఐఎన్‌ఎఫ్ ఒప్పందం కుదిరింది. 300 నుంచి 3,400 మైళ్ల శ్రేణి కలిగిన క్రూయిజ్ క్షిపణులను అమెరికా, రష్యాలు ఉత్పత్తి చేయకుండా, తమ దగ్గర ఉంచుకోకుండా, పరీక్షించకుండా ఈ ఒప్పందం నిరోధిస్తోంది. 2021లో ఈ ఒప్పందం గడువు ముగియనుంది.
అయితే రష్యా ఈ ఒప్పందాన్ని ఏళ్లుగా ఉల్లంఘిస్తోందని ట్రంప్ తాజాగా ఆరోపిస్తున్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ ‘ఒప్పందాన్ని మేం రద్దు చేసుకోబోతున్నాం. వైదొలుగుతాం. రష్యా, చైనాలు కొత్త ఒప్పందానికి ఒప్పుకోకపోతే ఐఎన్‌ఎఫ్‌ను రద్దు చేసి ఆయుధాలను అభివృద్ధి చేసుకుంటాం’ అని చెప్పారు. ‘వారు (రష్యా, చైనాలు) మా దగ్గరకు వచ్చి మన మంతా బాగుండాలనీ, ఎవ్వ రూ ఆయుధాలు ఉత్పత్తి చేయకూడదని చెబుతారు. కానీ వారు ఆయుధాలు తయారు చేస్తుంటే మేం మాత్రం ఒప్పందానికి కట్టుబడి చేతులు ముడుచుకుని కూర్చోవాలా? ఇది ఆమోదయోగ్యం కాదు’ అని ట్రంప్ అన్నారు. కాగా, ట్రంప్ నిర్ణయం ప్రమాదకరమైనదని రష్యా పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment