
ఇస్లామాబాద్: పాకిస్తాన్ వైమానిక పరీక్షను మంగళవారం విజయవంతంగా నిర్వహించింది. అణుసామర్థ్యం గల క్రూయిజ్ క్షిపణి రాద్–2ను 600 కిలోమీటర్ల పరిధిలో ప్రయోగించింది. ఇది భూమిపై, సముద్రంలో సైనిక ‘నియంత్రణ సామర్థ్యం’ను పెంచింది. లక్ష్యాలను కచ్చితత్వంతో ఛేదించేందుకు రాద్–2 ఆయుధ వ్యవస్థకు అత్యాధునిక నావిగేషన్ వ్యవస్థను అనుసంధానించారని మిలటరీ అధికార ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో పాకిస్తాన్ శక్తి, సామర్థ్యాలకనుగుణంగా మరో కీలక అడుగు ముందుకు పడిందని లెఫ్టినెంట్ జనరల్ నదీమ్ జకీ మంజ్ హర్షం వ్యక్తంచేశారు. పాకిస్తాన్ అధ్యక్షుడు అరీఫ్ అల్వి, ప్రధాని ఇమ్రాన్ ఖాన్, సీనియర్ మిలిటరీ అధికారులు ఈ క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించిన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు అభినందనలు తెలిపారు. కాగా, పాక్ అభివృద్ధి చేసిన ఈ రాద్ క్షిపణిని.. భారత్ బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణికి దీటుగా రూపొందించేందుకు ప్రయత్నించిందని అమెరికాకు చెందిన ఓ సంస్థ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment