BrahMos missile
-
ఫైటర్ జెట్ నుంచి దూసుకెళ్లిన ‘బ్రహ్మోస్’ మిసైల్
న్యూఢిల్లీ: సరిహద్దు వివాదాలు పెరుగుతున్న వేళ రక్షణ రంగ సామర్థ్యాన్ని మెరుగుపరిచే మరో కీలక ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది భారత్. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ ఎక్స్టెండెడ్ రేంజ్ వెర్షన్‌ను సుఖోయ్-30 యుద్ధ విమానం నుంచి పరీక్షించింది భారత వాయుసేన. గగనతలం నుంచి దూసుకెళ్లిన ఈ బ్రహ్మోస్ క్షిపణి 400 కిలోమీటర్ల దూరంలోని నిర్దేశిత లక్ష్యాన్ని ఛేదించింది. ‘సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ బంగాళకాతంలో నిర్దేశిత లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. ఈ విజయవంతమైన ప్రయోగంతో భూతల, సముద్రంలోని సుదూర లక్ష్యాలపై కచ్చితమైన దాడులు చేయగల సామర్ధ్యాన్ని వైమానిక దళం సాధించింది. సుఖోయ్-30ఎంకేఐతో ఎక్స్టెండెడ్ రేంజ్ వర్షన్ మిసైల్‌ను జత చేయడం ద్వారా భారత వైమానిక దళానికి వ్యూహాత్మక బలాన్ని చేకూర్చింది. భవిష్యత్తులో ఎదురయ్యే యుద్ధాల్లో పైచేయి సాధించే అవకాశాన్ని కల్పించింది.’ - భారత రక్షణ శాఖ బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగానికి సంబంధించిన వీడియోను భారత వాయుసేన ట్విట్టర్లో షేర్ చేసింది. ఎయిర్‌ఫోర్స్, నేవీ, డీఆర్డీఓ, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్, బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంయుక్త భాగస్వామ్యంతో ఈ ప్రయోగం విజయవంతమైనట్లు భారత వాయుసేన తెలిపింది. మరోవైపు.. యుద్ధ విమానం నుంచి క్షిపణులను పరీక్షించడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది మే నెలలోనూ ఇలాంటి పరీక్షలు నిర్వహించారు. 290 కిలోమీటర్ల రేంజ్ నుంచి 350 కిలోమీటర్లుకు పెంచిన మిసైల్‌ను సుఖోయ్ ఫైటర్ నుంచి ప్రయోగించి విజయం సాధించింది వాయుసేన. The IAF successfully fired the Extended Range Version of the Brahmos Air Launched missile. Carrying out a precision strike against a Ship target from a Su-30 MKI aircraft in the Bay of Bengal region, the missile achieved the desired mission objectives. pic.twitter.com/fiLX48ilhv — Indian Air Force (@IAF_MCC) December 29, 2022 ఇదీ చదవండి: కోవిడ్ కొత్త వేరియంట్ల పుట్టుకకు కేంద్రంగా చైనా.. నిపుణుల ఆందోళన -
పాకిస్తాన్లోకి భారత క్షిపణులు మిస్‌ఫైర్.. ముగ్గురు అధికారులపై వేటు
సాక్షి,న్యూఢిల్లీ: పాకిస్తాన్లోకి పొరపాటున బ్రాహ్మోస్ క్షిపణులను ప్రయోగించిన ముగ్గురు వాయుసేన అధికారులను విధుల నుంచి తొలగించింది కేంద్రం. ఈ ఏడాది మార్చిలో జరిగిన ఈ ఘటనపై న్యాయ విచారణ అనంతరం మంగళవారం అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం విధుల నుంచి తొలగించిన అధికారుల్లో ఓ గ్రూప్ కెప్టెన్, వింగ్ కమాండర్, స్క్వాడ్రన్ లీడర్ ఉన్నారు. భారత వాయుసేన తాజాగా చెప్పిన వివరాల ప్రకారం ఈ ముగ్గురు అధికారులు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్(SOP)లో చేసిన పొరపాటు వల్లే క్షిపణులు ప్రమాదవశాత్తు పాకిస్తాన్ భూభాగంలో పడ్డాయి. మార్చి 9న జరిగిన ఈ ఘటన అనంతరం బ్రాహ్మోస్ క్షిపుణులు తమ భూభాగంలో పడ్డాయని పాకిస్తాన్ భారత్‌కు సమన్లు పంపి నిరసన వ్యక్తం చేసింది. అయితే సాంకేతిక లోపం వల్లే క్షిపణులు పొరపాటున పాక్‌లో పడినట్లు భారత్ వివరణ ఇచ్చింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదనే విషయాన్ని ప్రస్తావించింది. చదవండి: ‘రాజీ’ ఎరుగని బీజేపీ ఎమ్మెల్యే.. ఏడికైతే ఆడికైతది.. తగ్గేదెలే! -
అణ్వస్త్ర సత్తా చాటేందుకే బ్రహ్మోస్ తయారీ
లక్నో: ప్రపంచంలోని ఏ దేశమూ భారత్‌పై దాడికి దిగే సాహసం చేయకూడదనే బ్రహ్మోస్ అణ్వస్త్ర క్షిపణులను తయారుచేస్తున్నామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ స్పష్టంచేశారు. లక్నోలో రక్షణ సాంకేతికత, ప్రయోగ కేంద్రం, నూతన బ్రహ్మోస్ ఆయుధ కర్మాగారాలకు రాజ్‌నాథ్ శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘భారత్ బ్రహ్మోస్ సహా ఇతర ఆయుధాలను తయారుచేస్తోందంటే అర్ధం.. ఇతర దేశాలపై దాడికి సిద్ధమైందని కాదు. కయ్యానికి కాలు దువ్వేందుకు ప్రయత్నించే దేశాలకు భారత తన అణ్వస్త్ర సామర్థ్యాన్ని చాటిచెప్పేందుకే ఇలా క్షిపణులను తయారుచేస్తోంది. భారత్‌కు చెడు చేయాలని పొరుగుదేశం(పాక్) ఎందుకు అనుక్షణం పరితపిస్తోందో నాకైతే అర్ధంకాలేదు’ అని రాజ్‌నాథ్ అన్నారు. బ్రహ్మోస్ యూనిట్ కోసం అడిగిన వెంటనే 200 ఎకరాల స్థలం కేటాయించారని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను రాజ్‌నాథ్ అభినందించారు. ఈ రెండు యూనిట్లను డీఆర్డీవో నెలకొల్పుతోంది. యూనిట్లో బ్రహ్మోస్ కొత్త తరం వేరియంట్ క్షిపణులను రూపొందిస్తారు. ఏడాదికి దాదాపు వంద క్షిపణులను తయారుచేస్తారు. -
‘బ్రహ్మోస్’ పరీక్ష విజయవంతం
న్యూఢిల్లీ: సూపర్సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ బ్రహ్మోస్‌ను ఆదివారం భారత వైమానిక దళం(ఐఏఎఫ్) విజయవంతంగా పరీక్షించింది. స్టెల్త్ డెస్ట్రాయర్ ‘ఐఎన్ఎస్ చెన్నై’నుంచి ప్రయోగించిన ఈ క్షిపణి అరేబియా సముద్రంలోని లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదించిందని అధికారులు తెలిపారు. ‘సముద్ర జలాలపై లక్ష్యాలను ఛేదించగలిగే సత్తా ఉన్న బ్రహ్మోస్ యుద్ధ నౌక అజేయశక్తిని మరింత ఇనుమడింపజేసిందని, భారత నేవీ వద్ద ఉన్న మరో ప్రమాదకర అస్త్రాల్లో ఒకటిగా మారిందని రక్షణ శాఖ తెలిపింది. భారత్–రష్యా ఉమ్మడి భాగస్వామ్యంలో రూపొందిన బ్రహ్మోస్ క్షిపణులను జలాంతర్గాములు, యుద్ధనౌకలు, విమానాలతో పాటు నేలపై నుంచి కూడా ప్రయోగించే వీలుంది. ఈ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసిన రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో), బ్రహ్మోస్ ఏరోస్పేస్, భారత నేవీని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు. క్షిపణి ప్రయోగంలో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలు, సిబ్బందిని డీఆర్డీవో చైర్మన్ జి.సతీశ్ రెడ్డి కూడా అభినందించారు. మన సైనిక పాటవం బ్రహ్మోస్ క్షిపణితో మరింత పెరుగుతుం దన్నారు. సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో.. భారత్.. నేలపై నుంచి నేలపైకి బ్రహ్మోస్‌ను, యాంటీ రేడియేషన్ క్షిపణి రుద్రం–1ను, లేజర్ గైడెడ్ యాంటీ ట్యాంక్ మిస్సైల్‌ను, అణు సామర్థ్యం ఉన్న శౌర్య క్షిపణులను విజయవంతంగా పరీక్షించింది. -
'శౌర్యం' చూపుతున్న భారత క్షిపణి
సాక్షి, బాలాసోర్: గత వారం రోజులుగా డీఆర్డీవో వరుస క్షిపణులను ప్రయోగిస్తోంది. అధునాతన వర్షన్‌తో శౌర్యా అణు సామర్థ్యం గల బాలిస్టిక్ క్షిపణిని డీఆర్డీఓ శనివారం విజయవంతంగా పరీక్షించింది. భారత్- చైనా ఎల్ఏసీ వద్ద ఉధృత పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో ఈ క్షపణిని పరీక్షించడం ప్రాధాన్యం సంతరించికుంది. ఈ క్షపణి దాదాపు 800 కిలోమీటర్ల మేర లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యం కలదు. ఈ క్షిపణి ఆపరేట్ చేసేందుకు సులువుగా, తేలిగ్గా ఉంటుందని.. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చివరి దశకు చేరుకునే సరికి హైపర్సోనిక్ వేగంతో దూసుకెళ్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి. వరుస పరీక్షలతో డీఆర్డీవో దూకుడు.. డీఆర్డీవో వరుస క్షిపణి పరీక్షలతో దూసుకెళ్తోంది. 'లేజర్ గైడెడ్ యాంటీ ట్యాంక్' క్షిపణిని మంగళవారం విజయవంతంగా పరీక్షించారు. గత పదిరోజుల వ్యవధిలో రెండో క్షిపణిని పరీక్షించిండం విశేషం. మహారాష్ర్టలోని అహ్మద్‌నగర్‌లో ఈ క్షిపణిని అభివృధి చేశారు. దీని రేంజ్ ఐదు కి.మి ఉంటుందని.. వివిధ లాంచ్‌ప్యాడ్స్ ద్వారా ప్రయోగించవచ్చని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. బ్రాహ్మోస్... డీఆర్డీవో విజయవంతంగా ప్రయోగించిన మరో ఆయుద్ధం.. 'బ్రాహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షపణి'. 400 కి.మి రేంజ్‌తో లక్ష్యాన్ని ఛేదించగల శక్తి బ్రాహ్మోస్ ప్రత్యేకం. డీఆర్డీవో పీజే-10 ప్రాజెక్ట్ ద్వారా ఈ పరీక్ష నిర్వహించారు. ఇటువంటి క్షపణిని పరీక్షించడం ఇది రెండోసారి. -
బ్రహ్మోస్ బూస్టర్ సక్సెస్
సాక్షి, హైదరాబాద్: బ్రహ్మోస్ క్షిపణిలో అమర్చే కీలకమైన స్వదేశీ తయారీ బూస్టర్ పరీక్ష విజయవంతమైంది. ఈ బూస్టర్తోపాటు ఎయిర్‌ఫ్రేమ్ సెక్షన్, మరికొన్ని ఇతర భాగాలనూ పూర్తిగా భారత్‌లోనే తయారుచేశారు. వీటిని అమర్చిన బ్రహ్మోస్ క్షిపణిని బుధవారం ఉదయం 10.30 గంటలకు ఒడిశాలోని బాలాసోర్ పరీక్ష కేంద్రం నుంచి ప్రయోగించారు. క్షిపణి లక్ష్యాన్ని చేరుకోవడంతోపాటు ధ్వని వేగం కంటే 2.8 రెట్ల ఎక్కువ వేగంతో ప్రయాణించినట్లు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) ఒక ప్రకటనలో తెలిపింది. ప్రయోగం విజయవంతం కావడంతో ఇకపై బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థకు కావాల్సిన బూస్టర్లు, ఇతర పరికరాలను దేశీయంగానే తయారుచేసుకొనే వీలు కలుగుతుందని డీఆర్డీవో చైర్మన్ జి.సతీశ్‌రెడ్డి తెలిపారు. డీఆర్డీవో, బ్రహ్మోస్ బృందాలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు. -
సుఖోయ్‌కి బ్రహ్మోస్ జత కలిస్తే..
తంజావూర్: హిందూ మహా సముద్ర జలాలపై పట్టు సాధించేందుకు తంజావూరు బేస్ స్టేషన్‌గా భారత వాయు సేన (ఐఏఎఫ్) బ్రహ్మోస్ క్షిపణులను అమర్చిన సుఖోయ్ యుద్ధవిమానాలను ప్రారంభించింది. టైగర్‌షార్క్ 222 స్క్వాడ్రన్‌కు చెందిన సుఖోయ్30 ఎంకేఐ యుద్ధ విమానాలు దక్షిణ భారత జలాలపై ఆధిపత్యం సాధిస్తాయని ఐఏఎఫ్ పేర్కొంది. ఇక దక్షిణ భారత్‌లో తంజావూర్ వ్యూహాత్మక స్థావరంగా మారనుందని పేర్కొంది. భారత్–రష్యాల సంయుక్త కృషితో తయారైన బ్రహ్మోస్ క్షిపణులకు సుఖోయ్‌లు తోడై అత్యంత శక్తిమంతంగా మారాయని ప్రారంభోత్సవం సందర్భంగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ చెప్పారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ 300 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఈ క్షిపణులు సులువుగా టార్గెట్ చేయగలవు. ఈ విమానాలు ఒక్కసారి ఇంధనం నింపుకుంటే 1500 కిలోమీటర్ల పరిధిలో నిరంతరాయంగా పనిచేసే సామర్థ్యం వీటి సొంతం. -
బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం
న్యూఢిల్లీ: సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ ఏరియల్ వెర్షన్‌ను విజయవంతంగా పరీక్షించినట్లు భారత వైమానిక దళం (ఐఏఎఫ్) బుధవారం వెల్లడించింది. సుఖోయ్ యుద్ధ విమానం ఎస్యు–30 ఎంకేఐ ద్వారా ఈ పరీక్ష నిర్వహించారు. 2.5 టన్నుల బరువుండి, ఆకాశం నుంచి భూ ఉపరితలంపైకి ప్రయోగించే ఈ క్షిపణి దాదాపు 300 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. తద్వారా ఐఏఎఫ్ యుద్ధ సామర్థ్యాలను కూడా ఇది పెంచుతుందని మిలిటరీ అధికారులు చెప్పారు. బ్రహ్మోస్ క్షిపణి 2.8 మ్యాక్ వేగంతో ప్రయాణిస్తుంది. ‘విమానం నుంచి ఈ క్షిపణిని ఏ సమస్యలూ లేకుండా ప్రయోగించగలిగాం. నిర్దేశించిన మార్గంలో అది ప్రయాణించి లక్ష్యాన్ని ఛేదించింది’ అని ఐఏఎఫ్ అధికార ప్రతినిధి గ్రూప్ కెప్టెన్ అనుపమ్ బెనర్జీ చెప్పారు. -
బ్రహ్మోస్‌కు పోటీగా చైనా కొత్త క్షిపణి
బీజింగ్: భారత్, రష్యాలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్షిపణికి పోటీగా చైనాలోని ఓ మైనింగ్ సంస్థ సూపర్సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు అక్కడి ప్రభుత్వ మీడియా పేర్కొంది. ఈ క్షిపణిని చైనా మిత్రదేశం పాకిస్తాన్ కొనుగోలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఉత్తర చైనాలోని ఓ రహస్య ప్రాంతంలో సోమవారం గువాంగ్డాంగ్ హోంగ్డా బ్లాస్టింగ్ కంపెనీ ఈ క్షిపణి పరీక్ష జరపగా, అన్ని వ్యవస్థలూ సక్రమంగా పనిచేస్తున్నట్లు తేలిందంటూ గ్లోబల్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. హెచ్డీ–1 అని పేరుపెట్టిన ఈ క్షిపణిని హోంగ్డా సంస్థ తన సొంత ఖర్చుతో అభివృద్ధి చేస్తోంది. ప్రభుత్వం ఆమోదించాక హోంగ్డా కంపెనీ ఈ క్షిపణిని ఇతర దేశాలకు అమ్మనుంది. -
‘బ్రహ్మోస్’లో శత్రు గూఢచారి!
నాగ్‌పూర్: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి ‘బ్రహ్మోస్’కు సంబంధించిన రహస్య సమాచారాన్ని పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐకి చేరవేస్తున్న గూఢచారిని అధికారులు సోమవారం అరెస్ట్ చేశారు. నాగ్‌పూర్‌లోని డీఆర్డీవోలో ఉన్న ‘బ్రహ్మోస్ క్షిపణి పరిశోధన కేంద్రం’లో నిశాంత్ అగ్రవాల్ గత నాలుగేళ్ల నుంచి ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో బ్రహ్మోస్ క్షిపణికి సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐతో పాటు మరికొన్ని దేశాలకు నిశాంత్ చేరవేసినట్లు భారత్ నిఘా వర్గాలు గుర్తించాయి. దీంతో సోమవారం ఉదయం 5.30 గంటలకు నిశాంత్ నివాసానికి చేరుకున్న మిలటరీ ఇంటెలిజెన్స్ అధికారులు, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ సంయుక్త బృందం అతడిని అరెస్ట్ చేసింది. అనంతరం సాయంత్రం వరకూ ఆ ఇంట్లో సోదాలు కొనసాగాయి. ఈ తనిఖీల్లో నిశాంత్ ల్యాప్‌టాప్‌లో బ్రహ్మోస్‌తో పాటు క్షిపణి వ్యవస్థలకు సంబంధించి కీలకమైన సమాచారం లభ్యమైందని ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఐజీ అసీమ్ అరుణ్ తెలిపారు. పక్కా సమాచారంతోనే నిశాంత్ ఇంటిపై దాడి చేసి అరెస్ట్ చేశామని వెల్లడించారు. పాకిస్తాన్‌కు చెందిన కొందరు వ్యక్తులతో నిశాంత్ ఫేస్బుక్ ద్వారా మాట్లాడుతున్నట్లు గుర్తించామన్నారు. నిందితుడిపై అధికారిక రహస్యాల చట్టం కింద కేసు నమోదుచేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కేసులో విచారణ కొనసాగుతోందని అసీమ్ అరుణ్ వెల్లడించారు. రెండు నెలల క్రితం వివాహం చేసుకున్న నిశాంత్.. ఇక్కడి వార్ధా రోడ్డులో అద్దె ఇంటిలో ఉంటున్నాడు. ఈ విషయమై ఇంటి యజమాని మనోహర్ కాలే మాట్లాడుతూ.. దాదాపు ఏడాదికాలంగా నిశాంత్ తమ ఇంటిలో అద్దెకు ఉంటున్నాడని తెలిపారు. అద్దెకు దిగేందుకు ఆధార్ కార్డు కాపీతో పాటు డీఆర్డీవో జారీచేసిన సర్టిఫికెట్‌ను సమర్పించాడన్నారు. ఆధార్ కార్డులోని వివరాల ప్రకారం ఉత్తరాఖండ్‌లోని రూర్కీ నిశాంత్ స్వస్థలమని వెల్లడించారు. భారత్‌కు చెందిన డీఆర్డీవో, రష్యాకు చెందిన మిలటరీ ఇండస్ట్రియల్ కన్సార్టియం(ఎన్పీవోఎం) సంయుక్తంగా ఏర్పాటుచేసిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ ‘బ్రహ్మోస్ క్షిపణి’ని తయారుచేసింది. బ్రహ్మోస్ విశేషాలు బ్రహ్మోస్ క్షిపణి తయారీ కోసం భారత్, రష్యా ప్రభుత్వాలు 1998, ఫిబ్రవరి 12న ఒప్పందం చేసుకున్నాయి. భారత్‌లోని బ్రహ్మపుత్ర, రష్యాలోని మోస్కోవా నదుల పేరు మీదుగా ఈ క్షిపణికి బ్రహ్మోస్ అని నామకరణం చేశారు. ఈ క్షిపణిని ట్రక్కులు, యుద్ధనౌకలు, జలాంతర్గాములు, విమానాల ద్వారా ప్రయోగించవచ్చు. గతేడాది నవంబర్‌లో సుఖోయ్–30 యుద్ధవిమానం నుంచి ఈ క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు. 8.4 మీటర్ల పొడవు, 3,000 కేజీల బరువున్న ఈ క్షిపణి 200 కిలోల అణ్వాయుధాలు లేదా సంప్రదాయ వార్‌హెడ్‌ను మోసుకుపోగలదు. మొబైల్ లాంఛర్లు, యుద్ధనౌకలు, సబ్మెరైన్ల ద్వారా ప్రయోగించే బ్రహ్మోస్ 450 కి.మీ, యుద్ధవిమానాల ద్వారా ప్రయోగించే బ్రహ్మోస్ 400 కి.మీ దూరంలోని లక్ష్యాలను తుత్తునియలు చేయగలదు. -
తిరుగులేని బ్రహ్మోస్
బాలాసోర్/న్యూఢిల్లీ: సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్‌ను భారత్ మరోసారి విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని బాలాసోర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి సోమవారం క్షిపణిని ప్రయోగించినట్లు రక్షణ శాఖ వెల్లడించింది. ప్రయోగ సమయంలో సముద్రంలో అలలు తొమ్మిది మీటర్ల ఎత్తుకు ఎగిసిపడుతున్నాయని, ప్రతికూల వాతావ రణంలోనూ నిర్దేశించిన మార్గంలో బ్రహ్మోస్ ప్రయాణించిందని, క్షిపణిలోని ముఖ్య భాగాలన్నీ కచ్చితత్వంతో పని చేశాయంది. దీన్నిబట్టి అత్యంత తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లోనూ లక్ష్యాలను బ్రహ్మోస్ ఛేదించ గలదని మరోమారు రుజువైందని పేర్కొంది. క్షిపణి జీవిత కాలాన్ని పెంచే కార్యక్రమంలో భాగంగా ప్రయోగం నిర్వహించామని, త్వరలోనే దీన్ని ఆర్మీకి అప్పగించనున్నామని వెల్లడించింది. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిగా పేరొందిన బ్రహ్మోస్.. 290 కి.మీ. పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు. -
సుఖోయ్ నుంచి బ్రహ్మోస్ ప్రయోగం సక్సెస్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచంలో అత్యంత వేగవంతమైన సూపర్‌సానిక్ క్షిపణి బ్రహ్మోస్‌ను బుధవారం భారత వాయుసేనకు చెందిన ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ సుఖోయ్-30ఎంకేఐ నుంచి విజయవంతంగా ప్రయోగించారు. తొలిసారిగా సుఖోయ్ నుంచి బ్రహ్మోస్ ప్రయోగం విజయవంతం కావడంతో వాయుసేన సైనిక పాటవం నూతన జవసత్వాలను నింపుకున్నట్లైందని అధికారులు తెలిపారు. ఉపరితలం, సముద్ర, గగనతలం నుంచి ప్రయోగించేందుకు వీలున్న ప్రపంచశ్రేణి బ్రహ్మోస్ 2.5 టన్నుల బరువుతో సుఖోయ్ నుంచి ప్రయోగానికి అనువుగా రూపొందింది. డీఆర్డీఓ, రష్యాకు చెందిన ఎన్పీఓఎమ్ జాయింట్ వెంచర్‌తో ఈ అత్యాధునిక ఆయుధం భారత్ అమ్ములపొదిలో చేరింది. కాగా, బ్రహ్మోస్ క్షిపణిని విజయవంతంగా సుఖోయ్ నుంచి ప్రయోగాత్మకంగా పరీక్షించడం ద్వారా భారత్ చరిత్ర సృష్టించిందని రక్షణ మంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. -
డెడ్లీ కాంబినేషన్: సుఖోయ్ నుంచి బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష
సాక్షి,న్యూఢిల్లీ: భారత్ అమ్ముల పొదిలో బ్రహ్మాస్ర్తమైన బ్రహ్మోస్ క్షిపణి అత్యాధునిక వెర్షన్‌ని తొలిసారిగా సుఖోయ్ యుద్ధ విమానం నుంచి ఈవారంలో ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే సర్జికల్ దాడుల్లో ఈ అత్యాధునిక క్షిపణి బ్రహ్మోస్ భారత్‌కు వెన్నుదన్నుగా నిలుస్తుంది.సుఖోయ్ ఫైటర్ జెట్ నుంచి బ్రహ్మోస్ ప్రయోగం డెడ్లీ కాంబినేషన్‌గా రక్షణ నిపుణులు అభివర్ణిస్తున్నారు. గగనతల ఉపరితల లక్ష్యాలను ఛేదించే బ్రహ్మోస్ క్షిపణులు ప్రత్యర్థి భూభాగంలోని ఉగ్ర శిబిరాలను గుర్తించి రెప్పపాటులో నాశనం చేయడంతో పాటు అణు బంకర్లు, కమాండ్ కంట్రోల్ సెంటర్లు, సముద్రంపై యుద్ధ విమానాల వంటి సైనిక లక్ష్యాలను అవలీలగా ధ్వంసం చేస్తాయని చెబుతున్నారు. గత పదేళ్లుగా 290 కిమీ దూరంలోని లక్ష్యాలను ఛేదించగల బ్రహ్మోస్ క్షిపణులను సాయుధ దళాలు సమీకరించాయి. మరోవైపు ఆర్మీ, నేవీ, వాయుసేనలు రూ 27,150 కోట్ల విలువైన ఆర్డర్లను ఇవ్వడం బ్రహ్మోస్ పట్ల భారత సేనల ఆసక్తిని స్పష్టం చేస్తున్నాయి. -
'చైనా వార్నింగ్ పట్టించుకోం.. బ్రహ్మోస్ దించుతాం'
న్యూఢిల్లీ: చైనా హెచ్చరికలను భారత్ పక్కన పెట్టింది. తమ దేశ వ్యవహారంలో తలదూర్చవద్దని చైనాకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. తమ దేశ సరిహద్దు వ్యవహారం తమ ఇష్టమని, తమ భూభాగంలో ఉన్న సమస్యల దృష్ట్యా ఎలాంటి పనైనా చేసుకుంటామని, అది వేరే దేశాలకు సంబంధించినది కానందున ప్రతి అంశాన్ని చెప్పాల్సిన అవసరం లేదని పేర్కొన్నట్లు సమాచారం. ప్రస్తుతం అరుణా చల్ ప్రదేశ్ వద్ద ఉన్న భారత సరిహద్దు ప్రాంతంలో భారత్ బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణులను విస్తరిస్తున్న విషయం తెలిసిందే. వీటిని ఎక్కడి నుంచైనా ప్రయోగించేందుకు అవకాశం ఉంటుంది. అయితే, చైనా మాత్రం వీటి విషయంలో ఆందోళన వ్యక్తం చేసింది. అయితే, తాము చైనా ప్రభావానికి లోనై ఈ పనిచేయడం లేదని, రక్షణ అనేది తమ వ్యక్తిగత ఆందోళన అయినందున తాము ఈ పనిచేస్తున్నామని చైనాకు వెల్లడించినట్లు ఆర్మీ టాప్ అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది. -
సరిహద్దులో క్షిపణిపై చైనా లొడలొడ!
న్యూఢిల్లీ: కొద్దిరోజులుగా ఉద్రిక్తంగా మారిన భారత్- చైనా సరిహద్దు.. క్షిపణి మోహరింపుతో ఒక్కసారిగా వేడెక్కింది. తన అమ్ములపొదిలోని సూపర్ సానిక మిస్సైల్ ' బ్రహ్మోస్' ను భారత్..అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో మోహరింపజేసింది. కాగా, ఈ చర్యను చైనా తప్పుపట్టింది. సరిహద్దుల్లో నుంచి క్షిపణిని ఉపసంహరించుకోవాలని కోరింది. ఈ మేరకు చైనా ఆర్మీ(పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ) తన అధికార పత్రిక పీఎల్ఏ డైలీలో వ్యాఖ్యానం రాసింది. బ్రహ్మోస్ వల్ల చైనామోహరింపును వ్యతిరేక సంకేతంగా భావిస్తున్నట్లు పీఎల్ఏ డైలీ పేర్కొంది. తద్వారా ఇరుపక్షాల్లో ఆగ్రహావేశాలు పెరిగే అవకాశం ఉందని, దీని ప్రభావం ఇండో-చైనా సంబంధాలపై పడుతుందని అభిప్రాయపడింది. అయితే భారత్ మాత్రం దీనినొక సాధారణ చర్యగానే పరిగణిస్తోంది. చైనా సరిహద్దులో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టిసారించిన భారత ప్రభుత్వం పెద్ద సంఖ్యలో యుద్ధట్యాంకులు, విమానాలను ఇప్పటికే అరుణాచల్ కు పంపింపిన సంగతి తెలిసిందే. బ్రహ్మోస్ మోహరింపు కూడా అందులో భాగమేనని రక్షణ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. నిజానికి బ్రహ్మోస్ మోహరింపు వల్ల ఎలాంటి ప్రమాదం లేకపోయినప్పటికీ, చైనా తనకు అలవాటైన రీతిగా భారత్ కు వ్యతిరేకంగా వాగుతోందంని విశ్లేషకులు అంటున్నారు. రష్యా సహకారంతో దాదాపు రూ.4,500 కోట్ల వ్యయంతో రూపొందించిన బ్రహ్మోస్ సూపర్ సానిక్ క్రూయిజ్ క్షిపణికి భూ ఉపరితలం నుంచేకాక జలాంతర్గామి, నౌక, విమానాల నుంచి కూడా ప్రయోగించవచ్చు. 300 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేధించగల బ్రహ్మోస్.. గంటకు 3,400 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోగలదు. -
బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం
న్యూఢిల్లీ : భూ ఉపరితల లక్ష్యాలను ఛేదించే సూపర్సోనిక్ క్షిపణి బ్రహ్మోస్‌ని భారత్ శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది. రాజస్తాన్‌లోని పోఖ్రాన్ కేంద్రంలో భారత వాయుసేన ఈ పరీక్ష నిర్వహించింది. అనుకున్న లక్ష్యాలను క్షిపణి కచ్చితత్వంతో అధిగమించిందని బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రకటించింది. లోపరహిత సామర్థ్యాలు కలిగిన ఈ వ్యవస్థ త్రివిధ దళాలకు సాధికారత చేకూర్చనుం ది.మన విమానాల రాకపోకలను పసిగట్టేందుకు శత్రుదేశాలు సరిహద్దుల వెంట ఏర్పాటుచేసిన రాడార్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలను కూల్చేసేందుకు ఈ క్షిపణిని భారత వాయుసేన గత ఏడాది తీసుకుంది. -
‘బ్రహ్మోస్’ పరీక్ష సక్సెస్
న్యూఢిల్లీ: నేవీ కొత్త యుద్ధనౌక ‘ఐఎన్ఎస్ కోల్‌కతా’ నుంచి శనివారం బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్షిపణిని గోవా తీరంలో విజయవంతంగా పరీక్షించారు. ధ్వని కంటే 1.4 రెట్ల వేగం(సెకనుకు 343 మీటర్లు)తో దూసుకెళ్లే ఈ క్షిపణి 290 కి.మీ.ల పరిధిలోని లక్ష్యాలను ధ్వంసం చేయగలదు. ఈ క్షిపణి సైన్యం, నేవీల్లోకి ఇదివరకే చేరింది. యుద్ధవిమానాల నుంచి సైతం దూసుకెళ్లే బ్రహ్మోస్ క్షిపణి తుదిదశ అభివృద్ధిలో ఉంది. ఐఎన్ఎస్ కోల్‌కతా 2014లో నేవీ అమ్ములపొదికి చేరింది. మిగతా యుద్ధనౌకల ద్వారా ఒకేసారి 8 బ్రహ్మోస్ క్షిపణుల ప్రయోగించేందుకు వీలుండగా..దీన్నుంచి 16 బ్రహ్మోస్‌లను ప్రయోగించొచ్చు. -
ఆధునిక బ్రహ్మాస్ క్షిపణి పరీక్ష విజయవంతం
బలాసోర్: భారత్ రక్షణ రంగంలో మరో ముందడుగు వేసింది. 290 కిలో మీటర్ల పరిధి గల ఆధునిక బ్రహ్మాస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు. ఈ క్షిపణి దాదాపు 500 సెకన్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. మంగళవారం ఒడిశా సముద్రతీర ప్రాంతం చాందీపూర్ క్షిపణి పరీక్షా కేంద్రం నుంచి దీన్ని ప్రయోగించినట్టు బ్రహ్మాస్ చీఫ్ శివథాను పెళ్లై చెప్పారు. పర్వతాలలో, భవంతులలో దాక్కున్న శత్రువుల స్థావరాలను వంద శాతం కచ్చితత్వంతో ధ్వంసం చేయగల సామర్థ్యం ఈ క్షిపణి ప్రత్యేకత. 300 కిలోల పేలుడు పదార్థాన్ని మోసుకుపోగల సామర్థ్యం ఉంది. బ్రహ్మాస్, డీఆర్డీఓ వాస్త్రవేత్తలు ఈ ప్రయోగంలో పాల్గొన్నారు. -
‘బ్రహ్మోస్’ పరీక్ష సక్సెస్
న్యూఢిల్లీ: బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి మరోసారి సత్తా చాటింది. తొలిసారిగా సాల్వో మోడ్ (ఒకేసారి సమాంతరంగా క్షిపణులను ప్రయోగించడం) పద్ధతిలో నిర్వహించిన పరీక్షలో కూడా ఈ క్షిపణి విజయం సాధించింది. అరేబియా సముద్రంలో నేవీ యుద్ధనౌక ఐఎన్ఎస్ త్రిఖండ్పై నుంచి రెండు క్షిపణులతో నిర్వహించిన ఈ పరీక్ష విజయవంతమైందని గురువారమిక్కడ డీఆర్డీవో అధికారులు వెల్లడించారు. భవిష్యత్తులో ఒకేసారి ఎనిమిది క్రూయిజ్ క్షిపణులను కూడా ప్రయోగించనున్నట్లు తెలిపారు. ఘన, ద్రవ ఇంధనంతో నడిచే బ్రహ్మోస్ క్షిపణిని సైన్యం, నేవీల్లో ఇదివరకే ప్రవేశపెట్టారు. ఇది 290 కి.మీ. పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు. వాయుసేనలో ప్రవేశపెట్టనున్న బ్రహ్మోస్ వెర్షన్‌కు తుది పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఇండో-రష్యన్ కంపెనీ బ్రహ్మోస్ ఏరోస్పేస్ దీనిని అభివృద్ధిపర్చింది. -
‘బ్రహ్మోస్’ పరీక్ష విజయవంతం
న్యూఢిల్లీ: ఆధునీకరించిన ‘బ్రహ్మోస్’ సూపర్సోనిక్ క్షిపణిని సోమవారం భారత సైన్యం విజయవంతంగా పరీక్షించింది. రాజస్థాన్‌లోని పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్లో కొత్త గెడైన్స్ వ్యవస్థను అమర్చిన ‘బ్రహ్మోస్’ బ్లాక్-3 వేరియంట్‌ను ఉదయం 10.55 గంటలకు పరీక్షించారు. క్లిష్టమైన లక్ష్యాలను ఛేదించడంలో చేపట్టిన ఈ పరీక్ష విజయవంతమైందని ‘బ్రహ్మోస్’ అధికారులు తెలిపారు. పరీక్ష కోసం లక్ష్యాలుగా ఏర్పాటు చేసిన కాంక్రీట్ నిర్మాణాలను ఈ క్షిపణి ధ్వంసం చేయగలిగిందని చెప్పారు. ‘బ్రహ్మోస్’ క్షిపణి 290 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. తనతో 300 కిలోల బరువు గల సంప్రదాయక ఆయుధాలను మోసుకుపోగలదు. లెఫ్టినెంట్ జనరల్ అమిత్ శర్మ సమక్షంలో ‘బ్రహ్మోస్’ అధికారులు ఈ క్షిపణిని పరీక్షించారు. ఆర్మీ, నేవీలలో ‘బ్రహ్మోస్’ క్షిపణిని ఇప్పటికే ప్రవేశపెట్టారు.