సరిహద్దులో క్షిపణిపై చైనా లొడలొడ!
న్యూఢిల్లీ: కొద్దిరోజులుగా ఉద్రిక్తంగా మారిన భారత్- చైనా సరిహద్దు.. క్షిపణి మోహరింపుతో ఒక్కసారిగా వేడెక్కింది. తన అమ్ములపొదిలోని సూపర్ సానిక మిస్సైల్ ' బ్రహ్మోస్' ను భారత్..అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో మోహరింపజేసింది. కాగా, ఈ చర్యను చైనా తప్పుపట్టింది. సరిహద్దుల్లో నుంచి క్షిపణిని ఉపసంహరించుకోవాలని కోరింది. ఈ మేరకు చైనా ఆర్మీ(పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ) తన అధికార పత్రిక పీఎల్ఏ డైలీలో వ్యాఖ్యానం రాసింది.
బ్రహ్మోస్ వల్ల చైనామోహరింపును వ్యతిరేక సంకేతంగా భావిస్తున్నట్లు పీఎల్ఏ డైలీ పేర్కొంది. తద్వారా ఇరుపక్షాల్లో ఆగ్రహావేశాలు పెరిగే అవకాశం ఉందని, దీని ప్రభావం ఇండో-చైనా సంబంధాలపై పడుతుందని అభిప్రాయపడింది. అయితే భారత్ మాత్రం దీనినొక సాధారణ చర్యగానే పరిగణిస్తోంది. చైనా సరిహద్దులో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టిసారించిన భారత ప్రభుత్వం పెద్ద సంఖ్యలో యుద్ధట్యాంకులు, విమానాలను ఇప్పటికే అరుణాచల్ కు పంపింపిన సంగతి తెలిసిందే. బ్రహ్మోస్ మోహరింపు కూడా అందులో భాగమేనని రక్షణ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. నిజానికి బ్రహ్మోస్ మోహరింపు వల్ల ఎలాంటి ప్రమాదం లేకపోయినప్పటికీ, చైనా తనకు అలవాటైన రీతిగా భారత్ కు వ్యతిరేకంగా వాగుతోందంని విశ్లేషకులు అంటున్నారు.
రష్యా సహకారంతో దాదాపు రూ.4,500 కోట్ల వ్యయంతో రూపొందించిన బ్రహ్మోస్ సూపర్ సానిక్ క్రూయిజ్ క్షిపణికి భూ ఉపరితలం నుంచేకాక జలాంతర్గామి, నౌక, విమానాల నుంచి కూడా ప్రయోగించవచ్చు. 300 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేధించగల బ్రహ్మోస్.. గంటకు 3,400 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోగలదు.