
ఉక్రెయిన్‌పై యుద్ధంలో తొలిసారిగా కింజల్ హైపర్‌సోనిక్ ఏరో బాలిస్టిక్ మిస్సైళ్లు ప్రయోగించినట్లు రష్యా రక్షణ శాఖ శనివారం అధికారికంగా ప్రకటించింది. అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదిస్తాయంటున్న ఈ మిస్సైళ్లపై ఇప్పుడు అందరి దృష్టీ పడింది...
► కింజల్ అంటే రష్యన్ భాషలో పిడిబాకు. ‘కేహెచ్–47ఎం2 కింజల్’గా పిలిచే ఈ అత్యాధునిక క్షిపణులను రష్యా అధ్యక్షుడు పుతిన్ 2018 మార్చి నెలలో ఆవిష్కరించారు. వీటిని ఐడియల్ వెపన్ (ఆదర్శ ఆయుధం)గా అభివర్ణించారు. ఇతర ఆధునిక క్షిపణులతో పోలిస్తే కింజల్ వేగం, కచ్చితత్వం చాలా ఎక్కువ.
► కింజల్ మిస్సైళ్లను గగనతలం నుంచి భూమిపైకి ప్రయోగిస్తారు. ధ్వనివేగం కంటే 10 రెట్లు అధిక వేగంతో దూసుకెళ్లగలవు. ప్రత్యర్థి గగనతల రక్షణ వ్యవస్థల నుంచి సులువుగా తప్పించుకునే సామర్థ్యం వీటి సొంతం. అడ్డొచ్చే క్షిపణులను, ఆయుధాలను నిర్వీర్యం చేస్తూ దూసుకెళ్తాయి.
► గంటలో ఏకంగా 12,350 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. భూమి లోతుల్లోకీ చొచ్చుకెళ్లగలవు.
► 1,500 కిలోమీటర్ల నుంచి 2,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తాయి. 480 కిలోల బరువైన సంప్రదాయ లేదా అణు పేలోడ్లను మోసుకెళ్తాయి. ఇది రెండో ప్రపంచయుద్ధ సమయంలో జపాన్‌లోని హిరోషిమాపై అమెరికా ప్రయోగించిన ఫ్యాట్‌మ్యాన్ బాంబు బరువు కంటే 33 రెట్లు ఎక్కువ!
► టూ–22ఎం3 లేదా మిగ్–31కే ఇంటర్‌సెప్టర్ల నుంచి వీటిని ప్రయోగిస్తారు.
► ఇస్కాండర్–ఎం షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైళ్లను అభివృద్ధి చేసి కింజల్ క్షిపణులను రూపొందించిందని రక్షణ నిపుణుల అంచనా.
Comments
Please login to add a commentAdd a comment