![Ministry of Defence says no transaction with Pegasus spyware maker NSO - Sakshi](/styles/webp/s3/article_images/2021/08/10/Untitled-2.gif.webp?itok=sGaI1eFV)
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌ఓ గ్రూప్ టెక్నాలజీ సంస్థతో తాము ఎలాంటి లావాదేవీలు జరుపలేదని భారత రక్షణ శాఖ తేల్చిచెప్పింది. ప్రస్తుతం భారత్‌ను కుదిపేస్తున్న పెగసస్ మిలటరీ–గ్రేడ్ స్పైవేర్‌ను ఇదే సంస్థ అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. రాజ్యసభలో సోమవారం సీపీఎం సభ్యుడు వి.సదాశివన్ అడిగిన ప్రశ్నకు రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ స్పందిస్తూ ఒక లిఖితపూర్వక ప్రకటన జారీ చేశారు. రక్షణ శాఖ చేసిన వ్యయాలపై ప్రశ్నలు సంధిస్తూ ఎన్‌ఎస్‌ఓ గ్రూప్‌తో ఏవైనా లావాదేవీలు నిర్వహించారా? అని సదాశివన్ అడిగారు.
2018–19 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో రక్షణ శాఖకు కేంద్రం రూ.4,04,364 కోట్లు కేటాయించిందని, ఇందులో రూ.4,03,459 కోట్లు ఖర్చు చేసినట్లు అజయ్ భట్ తెలిపారు. 2019–20లో రూ.4,31,010 కోట్లు కేటాయించగా, వ్యయం మాత్రం రూ.4,51,902 కోట్లకు చేరినట్లు పేర్కొన్నారు. 2020–21లో రూ.4,71,378 కోట్లు కేటాయించగా, ఖర్చు రూ.4,85,726 కోట్లకు చేరిందన్నారు. కేంద్ర ప్రభుత్వ మొత్తం బడ్జెట్‌లో రక్షణకు శాఖకు కేటాయించిన నిధులు 2018–19లో 16.56 శాతం, 2019–20లో 15.47 శాతం, 2020–21లో 15.49 శాతమని అజయ్ భట్ వివరించారు. విదేశాల నుంచి ఆయుధాలు, రక్షణ పరికరాల కొనుగోలు కోసం 2019–20లో రూ.47,961 కోట్లు, 2020–21లో రూ.53,118 కోట్లు వెచ్చించామని తెలియజేశారు.
పార్లమెంట్‌లో ఆరని పెగసస్ మంటలు
భారత ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులు, జర్నలిస్టులు, జడ్జీల ఫోన్లపై నిఘా పెట్టిందని, ఇందుకోసం ఎన్‌ఎస్‌ఓ గ్రూప్ నుంచి కొనుగోలు చేసిన పెసగస్ స్పైవేర్‌ను ఉపయోగిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఉభయ సభల్లో ఆందోళనలు, నినాదాలు కొనసాగిస్తున్నాయి. పెగసస్ వ్యవహారంలో పార్లమెంట్‌లో చర్చించాలని, దేశ భద్రతకు సంబంధించిన ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
జూలై 19న పార్లమెంట్ సమావేశాలు మొదలైనప్పటి నుంచి ఉభయ సభల్లో పెగసస్ మంటలు ఆరడం లేదు. అయితే, ప్రతిపక్షాల ఆరోపణలను ఎన్‌ఎస్‌ఓ గ్రూప్ కొట్టిపారేసింది. భారత పౌరులపై ప్రభుత్వం నిఘా పెట్టిందంటూ మీడియాలో వస్తున్న వార్తలను కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇదివరకే లోక్‌సభలో ఖండించారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థను అప్రతిష్ట పాలు చేయడమే లక్ష్యంగా సరిగ్గా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందే ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారని మండిపడ్డారు. దేశంలో ఎన్నో నియంత్రణ వ్యవస్థలు ఉన్నాయని, అనధికార వ్యక్తులు చట్టవిరుద్ధంగా పౌరులపై నిఘా పెట్టడం భారత్‌లో సాధ్యం కాదని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment