![ICGS Vigraha Ship Reached Visakhapatnam - Sakshi](/styles/webp/s3/article_images/2021/09/12/vigraha_0.jpg.webp?itok=h7Y4WziR)
సాక్షి, విశాఖపట్నం: భారతతీర గస్తీ దళం అమ్ముల పొదిలో చేరిన అధునాతన నౌక విశాఖ కేంద్రంగా సేవలందించేందుకు సిద్ధమైంది. అడ్వాన్స్‌డ్ ఫైర్ పవర్‌తో, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఐసీజీఎస్ విగ్రహ నౌకని గత నెల 28న చెన్నైలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ జాతికి అంకితం చేశారు. అనంతరం కోస్ట్‌గార్డు ఈస్ట్రన్ సీబోర్డు ప్రధాన స్థావరమైన విశాఖ నుంచి కార్యకలాపాలు నిర్వర్తించేందుకు శుక్రవారం ఇక్కడికి చేరుకుంది. విగ్రహ నౌకకు విశాఖలోని కోస్ట్‌గార్డ్ సిబ్బంది.. అధికారులు స్వాగతం పలికారు. కోస్ట్‌గార్డ్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్, జిల్లా కమాండర్(ఏపీ) యోగిందర్ ఢాకా నేతృత్వంలోని బృందం విగ్రహ షిప్‌ని ఇండియన్ కోస్ట్‌గార్డ్‌లోకి స్వాగతించారు.
ఆఫ్‌షోర్ పెట్రోల్ వెసల్ సిరీస్‌లో ఏడో నౌక అయిన దీనిని చెన్నైలోని ఎల్ అండ్ టీ షిప్ బిల్డింగ్ లిమిటెడ్ సంస్థ తయారుచేసింది. 98 మీటర్ల పొడవు, 15 మీటర్ల వెడల్పు, 3.6 మీటర్ల డ్రాట్, 2,200 టన్నుల బరువుతో తయారైన విగ్రహ.. 9,100 కిలోవాట్స్ డీజిల్ సామర్థ్యం ఉన్న రెండు ఇంజిన్లతో 26 నాటికల్ మైళ్ల వేగంతో 5 వేల కి.మీ ప్రయాణించగల సామర్థ్యం సొంతం చేసుకుంది.
అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ రాడార్లు, నేవిగేషన్, కమ్యూనికేషన్ పరికరాలు, సెన్సార్లు, సముద్ర స్థితిగతులకు అనుగుణంగా దిశ మార్చుకునే యంత్ర సామర్థ్యంతో దీనిని రూపొందించారు. రెస్క్యూ ఆపరేషన్లకు ఉపయోగపడేలా ఒక ట్విన్ ఇంజిన్ హెలికాఫ్టర్, నాలుగు హైస్పీడ్ బోట్లను తీసుకెళ్లగలదు. షిప్‌లో 12 మంది అధికారులు, 90 మంది సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. తొలి కమాండెంట్‌గా పీఎన్ అనూప్‌కు బాధ్యతలు అప్పగించారు. ఐసీజీఎస్ విగ్రహ చేరికతో కోస్ట్‌గార్డ్ జాబితాలో 157 నౌకలు, 66 విమానాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment