Russia Ukraine War: Russia Promises Safe Corridor for Ships to Leave Black Sea - Sakshi
Sakshi News home page

Russia Ukraine War: విదేశీ నౌకలకు సేఫ్‌ కారిడార్‌

Published Fri, May 27 2022 6:18 AM | Last Updated on Fri, May 27 2022 9:15 AM

Russia Ukraine War: Russia Promises Safe Corridor for Ships to Leave Black Sea - Sakshi

కీవ్‌/దావోస్‌: నల్ల సముద్రంలోని ఓడ రేవుల నుంచి విదేశీ నౌకలు భద్రంగా బయటకు వెళ్లేందుకు వీలుగా సేఫ్‌ కారిడార్‌ తెరుస్తామని రష్యా రక్షణ శాఖ హామీ ఇచ్చింది. మారియూపోల్‌ నుంచి నౌకలు వెళ్లడానికి మరో కారిడాన్‌ ప్రారంభించనున్నట్లు రష్యా రక్షణశాఖ ప్రతినిధి మైఖేల్‌ మిజింజ్‌సెవ్‌ చెప్పారు. ఒడెసా, ఖేర్సన్, మైకోలైవ్‌తో సహా నల్లసముద్రంలోని ఆరు పోర్టుల్లో ప్రస్తుతం 16 దేశాలకు చెందిన 70 నౌకలు ఉన్నాయని అన్నారు.

కారిడార్లు ప్రతిరోజూ తెరిచే ఉంటాయని పేర్కొన్నారు. మారియూపోల్‌ పోర్టులో కార్యకలాపాలు మూడు నెలల తర్వాత        పునఃప్రారంభమైనట్లు రష్యా సైన్యం తెలియజేసింది. నల్లసముద్రంలోని ఓడ రేవుల్లో రష్యా సైన్యం పాగావేసింది. నౌకల రాకపోకలను అడ్డుకుంటోంది. దీనివల్ల ఉక్రెయిన్‌ నుంచి విదేశాలకు ఆహార ధాన్యాల సరఫరా నిలిచిపోయింది.     ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడంతో రష్యా దిగివచ్చింది.

ఉక్రెయిన్‌ ఆయుధ సామగ్రి ధ్వంసం: రష్యా
ఉక్రెయిన్‌లోని పొక్రోవ్‌స్క్‌లో ఓ రైల్వేస్టేషన్‌ వద్ద ఉక్రెయిన్‌ ఆయుధ సామగ్రిని తమ సైన్యం ధ్వంసం చేసిందని రష్యా రక్షణ శాఖ తెలిపింది. యుద్ధ విమానాలతో రైల్వేస్టేషన్‌పై దాడి చేసినట్లు చెప్పారు. మైకోలైవ్‌ రీజియన్‌లోని దినిప్రొవ్‌స్కీలో ఉక్రెయిన్‌ ఎలక్ట్రానిక్‌ ఇంటెలిజెన్స్‌ సెంటర్‌ను నేలమట్టం చేశామని వివరించారు. ఈ ఘటనలో11 మంది ఉక్రెయిన్‌ సైనికులు, 15 మంది విదేశీ నిపుణులు మరణించారని పేర్కొన్నారు. గత 24 గంటల్లో ఉక్రెయిన్‌పై భీకర దాడులు జరిపినట్లు కొనాషెంకోవ్‌ వివరించారు. 500 టార్గెట్లపై విరుచుకుపడినట్లు తెలిపారు. లుహాన్‌స్క్, డొనెట్‌స్క్‌లో ప్రస్తుతం 8,000 మంది ఉక్రెయిన్‌ జవాన్లు తమ ఆధీనంలో ఉన్నారని వేర్పాటువాదుల ప్రతినిధి రొడియోన్‌ మిరోష్నిక్‌ చెప్పారు.   

వాస్తవాన్ని ఉక్రెయిన్‌ గుర్తించాలి: పెస్కోవ్‌
క్రిమియాపై రష్యా సార్వభౌమత్వాన్ని ఉక్రెయిన్‌ గుర్తిస్తుందని ఆశిస్తున్నామని రష్యా అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్‌ గురువారం అన్నారు.  ప్రపంచ దేశాలకు ఉక్రెయిన్‌ నుంచి ఆహార ధాన్యాల సరఫరా పునఃప్రారంభం కావాలంటే రష్యాపై కొన్ని ఆంక్షలను పశ్చిమ దేశాలు సడలించాలని పెస్కోవ్‌ తెలిపారు.

మళ్లీ వడ్డీ రేటు తగ్గించిన రష్యా సెంట్రల్‌ బ్యాంకు
ద్రవ్యోల్బణానికి కళ్లెం వేయడానికి గాను రష్యా సెంట్రల్‌ బ్యాంకు రుణాలపై వడ్డీ రేటును 14 శాతం నుంచి 11 శాతానికి తగ్గించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో వడ్డీ రేటును ఏకంగా 20 శాతం పెంచింది. అప్పటి నుంచి వడ్డీ రేటును మూడు పాయింట్లు తగ్గించడం ఇది మూడోసారి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement