పోర్ట్ మోర్స్బీ: తరచూ భూకంపాల బారిన పడే ఫసిఫిక్ ద్వీపదేశం.. పపువా న్యూ గినియా Papua New Guinea మరోసారి భారీ భూకంపంతో వణికిపోయింది. భారత కాలమానం ప్రకారం.. ఈ వేకువ ఝామున 4 గంటల ప్రాంతంలో రిక్టర్ స్కేల్‌పై 7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.
ఇది శక్తివంతమైన భూకంపమే అయినా.. ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు స్థానిక విపత్తుల విభాగం. అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించిన వివరాల ప్రకారం.. తీర ప్రాంత పట్టణమైన వెవాక్ నుంచి 97 కిలోమీటర్ల దూరంలో చంబ్రీ లేక్ కేంద్రంగా భారీ భూకంపం సంభవించింది. దాదాపు 62 కిలోమీటర్ల లోతులో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 7.0గా నమోదైంది. ఈ ప్రాంతం.. ఇండోనేషియా సరిహద్దుకు తూర్పున 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
మొత్తని నేల స్వభావం వల్ల.. భూకంపం సంభవించిన ప్రాంతంలో నష్టం భారీగానే కలిగే అవకాశముందని అమెరికా జియోలాజికల్ సర్వే అభిప్రాయపడింది. అయితే.. సునామీ సంకేతాలు లేకపోవడం వల్లే హెచ్చరిక జారీ చేయలేదని అధికారులు చెప్తున్నారు. ఇదిలా ఉంటే.. తరచూ భూకంపాలతో ఈ ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు.
భూకంప కేంద్రానికి 250 కిలోమీటర్ల దూరంలోని హైలాండ్ ప్రావిన్స్‌లోనూ ప్రకంపనల ప్రభావం కనిపించింది. సుమారు 45 సెకండ్లపాటు భారీగా భూమి కంపించిందని స్థానికుడొకరు చెప్తున్నాడు. ఫసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ దేశాల్లో ఒకటిగా ఉన్న పపువా న్యూ గినియా.. బయోడైవర్సిటీకి ఫేమస్. అలాగే అక్కడ కొండ ప్రాంతాలు అధికం. భూకంపాలు సంభవించిన సమయంలో కొండచరియలు విరిగి పడడం ద్వారా భారీగా నష్టం చేస్తుంటుంది. తద్వారా పేదరికంలో ఉన్న దేశం పరిస్థితి.. నానాటికీ మరింతగా దిగజారిపోతోంది.
కిందటి ఏడాది సెప్లెంబర్‌లో.. 7.6 తీవ్రతతో సంభవించిన భూకంపం 21 మంది బలి తీసుకుంది. ఇక 2018లో సంభవించిన భూకంపం ఏకంగా 200 మందిని పొట్టనబెట్టుకుంది. వీళ్లలో కొండచరియల కింద నలిగి మరణించిన వాళ్లే అధికం.
Comments
Please login to add a commentAdd a comment