సిడ్నీ: ఆస్ట్రేలియాకు చెందిన ఓ నావికుడు రోజుల తరబడి సముద్రంలో ఒంటరిగా గడిపాడు. తన పడవ ప్రయాణం మధ్యలో చిక్కుకుపోవడంతో సముద్రంలో దిక్కుతోచని స్థితిలో గుండెధైర్యంతో కాలాన్ని నెట్టుకొచ్చాడు. పడవలో అతనికి తోడుగా అతని పెంపుడు కుక్క మాత్రమే ఉంది. రెండు నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మెక్సికో ఓడ ఒకటి అటుగా రావడంతో వారు అతనిని గుర్తించి రక్షించారు.
ఆస్ట్రేలియా నావికుడు టిమ్ షాడోక్ తన పెంపుడు కుక్క బెల్లాతో కలిసి మెక్సికో తీరంలోని లా పాజ్ నగరం నుండి 6000 కిలోమీటర్లు ప్రయాణించి ఫ్రెంచ్ పాలినీషియా చేరుకునేందుకు ప్రయాణమయ్యాడు. కానీ దురదృష్టకర పరిస్థితుల్లో పడవలో సాంకేతిక లోపం తలెత్తి టిమ్ పసిఫిక్ మహాసముద్రం మధ్యలో చిక్కుకుపోయాడు. చుట్టూ నీరు, అలల హోరు తప్ప మరొకటి కానరాక రెండు నెలలపాటు సాగరం మధ్యలో అలమటించాడు.
సముద్రం అలల తాకిడికి పడవలోని ఎలక్ట్రానిక్ సామాగ్రి బాగా దెబ్బతింది. సరైన ఆహారం లేక ఆకలికి పచ్చి చేపలను తింటూ, దాహానికి వర్షపు నీళ్లను తాగుతూ ఎలాగోలా తనతో పాటు తన కుక్క ప్రాణాలను కూడా నిలబెట్టుకున్నాడు.
మెక్సికోకు చెందిన ఒక పెద్ద ఓడ వారిని గుర్తించి రక్షించింది. అప్పటికే టిమ్ షాడోక్ బాగా గడ్డం పెరిగి, బక్కచిక్కి గుర్తు పట్టలేనంతగా మారిపోయాడు. సహాయక బృందాలు అతడిని రక్షించిన తర్వాత తన పెంపుడు కుక్కతో తిరిగి మెక్సికో చేరుకుని వైద్యపరీక్షలు చేయించుకుని సరైన ఆహారం తీసుకోవాలని అన్నాడు.
ఇది కూడా చదవండి: లోదుస్తుల్లో పాములు.. ఎయిర్ పోర్టులో పట్టుబడిన మహిళ
Comments
Please login to add a commentAdd a comment