న్యూఢిల్లీ: ప్రముఖ ప్రైవేటు వాతావరణ అంచనా సంస్థ స్కైమెట్ భారత రైతులకు చేదు వార్తను తెలిపింది. ఈ ఏడాది సాధారణం కంటే తక్కువస్థాయి వర్షపాతం నమోదవుతుందని స్కైమెట్ అంచనా వేసింది. నైరుతీ రుతుపవనాల ప్రభావంతో జూన్–సెప్టెంబర్ మధ్యకాలంలో దీర్ఘకాలిక సగటు(ఎల్‌పీఏ)లో 93 శాతం వర్షపాతం మాత్రమే నమోదయ్యే అవకాశముందని వెల్లడించింది. పసిఫిక్ మహాసముద్రంలో జలాలు సాధారణం కంటే అధికంగా వేడెక్కిన నేపథ్యంలో ఎల్‌నినో ఏర్పడొచ్చనీ, ఇది నైరుతీ రుతుపవనాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంది. 1951 నుంచి 2000 వరకూ కురిసిన వర్షపాతాన్ని ఎల్‌పీఏగా వ్యవహరిస్తారు. ఇది 89 సెం.మీగా ఉంది. భారత్‌లో వ్యవసాయ రంగానికి జీవనాధారమైన నైరుతీ రుతుపవనాలు జూన్ 1న కేరళ తీరాన్ని తాకనున్నాయి.
కోస్తాంధ్రలో సాధారణ వర్షమే..
ఒకవేళ ఈ అంచనాలు నిజమైతే వరుసగా రెండో ఏడాది కూడా భారత్‌లో లోటు వర్షపాతం నమోదైనట్లు అవుతుంది. అదే జరిగితే రుతుపవనాల తొలి అర్ధభాగంలో తూర్పు, మధ్య భారత్‌లోని రాష్ట్రాల్లో తీవ్రమైన వర్షపాత లోటు నెలకొంటుందని స్కైమెట్ తెలిపింది. అయితే కోస్తా ఆంధ్రా, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని చాలాప్రాంతాల్లో సీజన్ మొత్తం సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని వెల్లడించింది. ఈ విషయమై సంస్థ సీఈవో జతిన్ సింగ్ మాట్లాడుతూ..‘జూన్ నెలలో దీర్ఘకాలిక సగటులో 77 శాతం వర్షపాతం నమోదుకావొచ్చు. అదే జూలైలో కొంచెం పెరిగి 91 శాతానికి చేరుకోవచ్చు. ఇక ఆగస్టులో 102 శాతం, సెప్టెంబర్‌లో 99 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశముంది’ అని పేర్కొన్నారు. సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు 55 శాతం ఉండగా, సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు 30 శాతం ఉన్నాయనీ, సాధారణం కంటే ఎక్కువ–అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలు లేవని తేల్చిచెప్పారు.
రుతుపవనాలపై ఎల్‌నినో ఎఫెక్ట్..
పసిఫిక్ మహాసముద్రంలోని జలాలు ఈసారి సాధారణం కంటే అధికంగా వేడెక్కాయని స్కైమెట్ సంస్థ తెలిపింది. దీని కారణంగా ఎల్‌నినో ఏర్పడుతుందనీ, ఇది నైరుతీ రుతుపవనాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వెల్లడించింది. ఈ విషయమై స్కైమెట్ అధ్యక్షుడు జి.పి. శర్మ మాట్లాడుతూ..‘మా అంచనాల ప్రకారం మార్చి–మే మధ్యకాలంలో ఎల్‌నినో ఏర్పడే అవకాశాలు 80 శాతం ఉన్నాయి. జూన్–ఆగస్టు నాటికి ఈ సగటు 60 శాతానికి పడిపోతుంది. మే–జూన్–జూలై కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఎల్‌నినో ఏర్పడే అవకాశాలు 66 శాతం ఉండగా, స్థిర వాతావరణం కొనసాగే అవకాశం 32 శాతం, లానినా ఏర్పడే అవకాశాలు 2 శాతం ఉన్నాయి. లానినా వల్ల పసిఫిక్‌లో ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ఇది నైరుతీ రుతుపవనాలకు మంచిది’ అని పేర్కొన్నారు. హిందూ మహాసముద్రంలోని జలాలు సరైన ఉష్ణోగ్రతతో ఉన్న నేపథ్యంలో ఎల్‌నినో ప్రభావాన్ని కొంతవరకూ అడ్డుకునే అవకాశముందని అభిప్రాయపడ్డారు.
ఈసారీ లోటు వర్షపాతమే
Published Thu, Apr 4 2019 5:15 AM | Last Updated on Thu, Apr 4 2019 5:15 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment