Low Rainfall
-
ఖరీఫ్సాగు ప్రశ్నార్థకమేనా?
సాక్షి, ధరూరు: వరుణుడి కరుణ కోసం రైతులు ఎదురుచూపులు చూస్తున్నారు. వాస్తవానికి మే నెలాఖరు లేదా జూన్ మొదటివారంలోనే ఏటా సమృద్ధిగా వర్షాలు కురిసి ఈపాటికే నెలరోజుల పంట సాగయ్యేది. ఈసారి వర్షాలు ఆలస్యం కావడంతో రైతులు ఒక్క ఎకరంలో కూడా పంటసాగును చేయలేకపోయారు. ఇప్పటికే పంటపొలాలను దున్నుకొని సిద్ధం చేసుకున్న రైతులు ఎరువులు, విత్తనాలను సిద్ధం చేసుకొని వరుణదేవుడి కరుణ కోసం ఎదురుచూస్తున్నారు. ఊరిస్తున్న మబ్బులు.. ప్రతిరోజూ సాయంత్రం వేళల్లో తేలికపాటి జల్లులు కురుస్తూ రైతులను ఊరిస్తున్నాయి. ఆశగా ఎదురుచూస్తున్న రైతులకు నిత్యం నిరాశే ఎదురవుతుంది. ఆరుతడి పంటలతో పాటు మెట్టపంటల సాగును చేసుకునేందుకు రైతులు ఎదురుచూస్తున్నారు. ఒక్క భారీ వర్షం కూడా కురవకపోవడంతో ఎటు చూసినా వ్యవసాయ పొలాలు బీడు భూములుగా దర్శనమిస్తున్నాయి. ఏ రైతును కదిలించినా దీనగాథలే బయటకు వస్తున్నాయి. అడుగంటుతున్న భూగర్భ జలాలు.. భూగర్భ జలాలు కూడా రోజురోజుకు అడుగంటిపోతున్నాయి. బోరుబావుల్లో నుంచి నెలరోజుల క్రితం వరకు రెండు ఈంచుల నీళ్లు వచ్చే బోర్లు, ఒక్క నెలరోజుల వ్యవధిలోనే ఈంచు, అర ఈంచుకు తగ్గిపోయాయి. దీంతో పంటలను సాగు చేసుకునేందుకు బోరుబావులు ఉన్న రైతులు కూడా ముందుకు రావడం లేదు. ధైర్యం చేసి కొంతమంది రైతులు సీడ్‌పత్తి పంటను సాగు చేసుకున్నారు. బోర్లలో రోజురోజుకు నీళ్లు తగ్గుముఖం పడుతుండటంతో వేలాది రూపాయలు ఖర్చుపెట్టి సాగుచేసిన పత్తి పంటపై కూడా రైతులకు ఆశలు సన్నగిల్లుతున్నాయి. ప్రస్తుతం వ్యవసాయశాఖ అధికారులు రైతులకు అవసరమయ్యే సబ్సిడీ ఎరువులు, విత్తనాలను కూడా అందుబాటులోకి తేలేదు. మరో పది పదిహేను రోజులు ఇదే గడ్డు పరిస్థితి ఉంటే ఖరీఫ్ పంటసాగు లేనట్లేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జూరాల ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలోని కర్ణాటక, మహారాష్ట్రలో కూడా వర్షాలు కురవకపోవడంతో జూరాలకు సైతం నీళ్లు రాలేదు. ప్రాజెక్టుకైనా నీళ్లు వచ్చి ఉంటే నెట్టెంపాడు ఎత్తిపోతల పంపుల ద్వారా రిజర్వాయర్లను నింపి కాస్తో, కూస్తో పంటలను సాగు చేసుకునే వారమని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ పరిస్థితి కూడా లేకపోవడంతో తమ పరిస్థితి రెంటికి చెడిన రేవడిలా తయారైందని వాపోతున్నారు. -
రికార్డ్ స్థాయిల నుంచి పతనం
ఇంట్రాడేలో సూచీలు ఆల్‌టైమ్ హైలను తాకినట్లుగానే పలు షేర్లు జీవిత కాల గరిష్ట స్థాయిలకు ఎగిశాయి. ఏషియన్ పెయింట్స్, అతుల్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, గోద్రేజ్ ప్రోపర్టీస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇండియన్ హోటల్స్, ముత్తూట్ ఫైనాన్స్, పిడిలైట్ ఇండస్ట్రీస్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. నాలుగు రోజుల స్టాక్‌మార్కెట్ లాభాలకు బుధవారం బ్రేక్ పడింది. ఈ ఏడాది సాధారణం కంటే తక్కువగానే వర్షాలు కురవవచ్చనే అంచనాలు, ముడి చమురు ధరలు భగ్గుమనడం...ఇన్వెస్టర్లను లాభాల స్వీకరణకు పురికొల్పాయి. దీంతో ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయిలకు పెరిగినప్పటికీ, సెన్సెక్స్, నిఫ్టీలు చివరకు నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 39,000 పాయింట్లు, నిఫ్టీ 11,700 పాయింట్ల దిగువకు పడిపోయాయి. అన్ని రంగాల సూచీలు నష్టపోయాయి. రోజంతా 443 పాయింట్ల రేంజ్లో కదలాడిన సెన్సెక్స్ చివరకు 180 పాయింట్లు పతనమై 38,877 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 69 పాయింట్లు నష్టపోయి 11,644 పాయింట్ల వద్దకు చేరింది. ఎల్‌నినోతో ‘తక్కువ’ వర్షాలు.... పసిఫిక్ మహా సముద్రంలో ఎల్‌నినో వృద్ది చెందుతోందని, ఫలితంగా ఈ ఏడాది సాధారణం కంటే తక్కువగానే వర్షాలు పడొచ్చనే అంచనాలను ప్రైవేట్ వాతావరణ సంస్థ, స్కైమెట్ వెలువరించింది. దీంతో వృద్ధి మందగించివచ్చనే భయాలతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. ముడి చమురు ధరలు భగ్గుమనడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. బ్యారెల్ బ్రెంట్ చమురు ఐదు నెలల గరిష్ట స్థాయి, 70 డాలర్లకు చేరువ కావడం ప్రతికూల ప్రభావం చూపించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి పాలసీని ఆర్బీఐ నేడు(గురువారం) వెలువరించనున్నది. కీలక రేట్లను పావు శాతం మేర తగ్గించవచ్చనే అంచనాలున్నాయి. ఈ పావు శాతం రేట్ల కోతను మార్కెట్ ఇప్పటికే డిస్కౌంట్ చేసుకుందని విశ్లేషకులంటున్నారు. 443 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్ సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల్లోనే ఆరంభమయ్యాయి. ఆసియా మార్కెట్ల జోష్‌తో మధ్యాహ్నం దాకా లాభాల్లోనే ట్రేడయ్యాయి. మధ్యాహ్నం తర్వాత లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో నష్టాల్లోకి జారిపోయాయి. సెన్సెక్స్ ఒక దశలో 213 పాయింట్లు పెరగ్గా, మరో దశలో 230 పాయింట్లు పతనమైంది. మొత్తం మీద రోజంతా 443 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ఇక నిఫ్టీ ఒక దశలో 48 పాయింట్లు లాభపడగా, మరో దశలో 84 పాయింట్లు నష్టపోయింది. ఇంట్రాడే గరిష్ట స్థాయిల నుంచి చూస్తే, సెన్సెక్స్ 393 పాయింట్లు, నిఫ్టీ 117 పాయింట్ల మేర నష్టపోయినట్లయింది. -
ఈసారీ లోటు వర్షపాతమే
న్యూఢిల్లీ: ప్రముఖ ప్రైవేటు వాతావరణ అంచనా సంస్థ స్కైమెట్ భారత రైతులకు చేదు వార్తను తెలిపింది. ఈ ఏడాది సాధారణం కంటే తక్కువస్థాయి వర్షపాతం నమోదవుతుందని స్కైమెట్ అంచనా వేసింది. నైరుతీ రుతుపవనాల ప్రభావంతో జూన్–సెప్టెంబర్ మధ్యకాలంలో దీర్ఘకాలిక సగటు(ఎల్పీఏ)లో 93 శాతం వర్షపాతం మాత్రమే నమోదయ్యే అవకాశముందని వెల్లడించింది. పసిఫిక్ మహాసముద్రంలో జలాలు సాధారణం కంటే అధికంగా వేడెక్కిన నేపథ్యంలో ఎల్‌నినో ఏర్పడొచ్చనీ, ఇది నైరుతీ రుతుపవనాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంది. 1951 నుంచి 2000 వరకూ కురిసిన వర్షపాతాన్ని ఎల్‌పీఏగా వ్యవహరిస్తారు. ఇది 89 సెం.మీగా ఉంది. భారత్‌లో వ్యవసాయ రంగానికి జీవనాధారమైన నైరుతీ రుతుపవనాలు జూన్ 1న కేరళ తీరాన్ని తాకనున్నాయి. కోస్తాంధ్రలో సాధారణ వర్షమే.. ఒకవేళ ఈ అంచనాలు నిజమైతే వరుసగా రెండో ఏడాది కూడా భారత్‌లో లోటు వర్షపాతం నమోదైనట్లు అవుతుంది. అదే జరిగితే రుతుపవనాల తొలి అర్ధభాగంలో తూర్పు, మధ్య భారత్‌లోని రాష్ట్రాల్లో తీవ్రమైన వర్షపాత లోటు నెలకొంటుందని స్కైమెట్ తెలిపింది. అయితే కోస్తా ఆంధ్రా, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని చాలాప్రాంతాల్లో సీజన్ మొత్తం సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని వెల్లడించింది. ఈ విషయమై సంస్థ సీఈవో జతిన్ సింగ్ మాట్లాడుతూ..‘జూన్ నెలలో దీర్ఘకాలిక సగటులో 77 శాతం వర్షపాతం నమోదుకావొచ్చు. అదే జూలైలో కొంచెం పెరిగి 91 శాతానికి చేరుకోవచ్చు. ఇక ఆగస్టులో 102 శాతం, సెప్టెంబర్‌లో 99 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశముంది’ అని పేర్కొన్నారు. సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు 55 శాతం ఉండగా, సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు 30 శాతం ఉన్నాయనీ, సాధారణం కంటే ఎక్కువ–అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలు లేవని తేల్చిచెప్పారు. రుతుపవనాలపై ఎల్‌నినో ఎఫెక్ట్.. పసిఫిక్ మహాసముద్రంలోని జలాలు ఈసారి సాధారణం కంటే అధికంగా వేడెక్కాయని స్కైమెట్ సంస్థ తెలిపింది. దీని కారణంగా ఎల్‌నినో ఏర్పడుతుందనీ, ఇది నైరుతీ రుతుపవనాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వెల్లడించింది. ఈ విషయమై స్కైమెట్ అధ్యక్షుడు జి.పి. శర్మ మాట్లాడుతూ..‘మా అంచనాల ప్రకారం మార్చి–మే మధ్యకాలంలో ఎల్‌నినో ఏర్పడే అవకాశాలు 80 శాతం ఉన్నాయి. జూన్–ఆగస్టు నాటికి ఈ సగటు 60 శాతానికి పడిపోతుంది. మే–జూన్–జూలై కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఎల్‌నినో ఏర్పడే అవకాశాలు 66 శాతం ఉండగా, స్థిర వాతావరణం కొనసాగే అవకాశం 32 శాతం, లానినా ఏర్పడే అవకాశాలు 2 శాతం ఉన్నాయి. లానినా వల్ల పసిఫిక్‌లో ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ఇది నైరుతీ రుతుపవనాలకు మంచిది’ అని పేర్కొన్నారు. హిందూ మహాసముద్రంలోని జలాలు సరైన ఉష్ణోగ్రతతో ఉన్న నేపథ్యంలో ఎల్‌నినో ప్రభావాన్ని కొంతవరకూ అడ్డుకునే అవకాశముందని అభిప్రాయపడ్డారు. -
అంచనాలు తగ్గించనున్న ఐఎండీ
న్యూఢిల్లీ: ఆగస్టు, సెప్టెంబర్ మాసాలకు రుతుపవనాలపై తన అంచనాలను భారత వాతావరణ విభాగం(ఐఎండీ) తగ్గించే అవకాశం ఉంది. ఫలితంగా ఈ సీజన్ మొత్తానికి అంచనాలు దిగివచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదవుతుందని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ ఇప్పటికే అంచనాలను కుదించిన సంగతి తెలిసిందే. దీర్ఘకాలిక సగటు(ఎల్పీఏ)ని 92 శాతంగా సవరించింది. ఎల్పీఏ 96–104 శాతం మధ్య ఉంటే, ఆ పరిస్థితిని సాధారణ వర్షపాతంగా భావిస్తారు. ఈ సీజన్లో 100 శాతం ఎల్పీఏతో వర్షాలు పడతాయని ఏప్రిల్‌లో ఐఎండీ అంచనా వేసిన సంగతి తెలిసిందే. -
కనికరించని చినుకు
జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితి సాధారణం కంటే 31 శాతం తక్కువ నమోదు 14 మండలాల్లో మరీ ఘోరం ఖరీఫ్ గండంపై ప్రణాళికశాఖ నివేదిక విశాఖపట్నం : జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. మునుపెన్నడూలేనివిధంగా కొన్ని మండలాల్లో పరిస్థితి దయనీయంగా ఉంది. సాధారణం కంటే 31శాతం తక్కువ వర్షపాతం నమోదయింది. ఈపాటికే జలాశయాలు,నదులు,చెరువులు,పంటపొలాలు నిండుగాకళకళలాడాలి. ఎక్కడికక్కడ అడుగంటి వెక్కిరిస్తున్నాయి. ఆగస్టు రెండోవారం ముగిసిపోతున్నా వరుణుడు కరుణించకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఏజెన్సీలో మాత్రం సాధారణం కంటే ఎక్కువగా వర్షపాతం నమోదైంది. జూన్ ఒకటో తేదీ నుంచి ఆగస్టు 13వరకు జిల్లావ్యాప్తంగా మండలాల వారీ వర్షపాత వివరాలు సేకరించిన ప్రణాళికశాఖ అధికారులు తీవ్ర వర్షాభావ పరిస్థితులను చూసి ఆందోళన చెందుతున్నారు. జూన్ నుంచి ఆగస్టు వరకు మొత్తం 407.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వాలి. ఇంతవరకు 280.5 మిల్లీమీటర్లు నమోదైంది. అంటే 31శాతం తక్కువ. 14మండలాల్లో సాధారణంలో సగం కూడా కురవకపోవడంతో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ముఖ్యంగా అచ్యుతాపురంలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సాధారణ వర్షపాతం 338.8 మిల్లీమీటర్లు. ఇక్కడ కేవలం 122.8 మిల్లీమీటర్లే నమోదైంది. పరవాడ (55శాతం), బుచ్చయ్యపేట (55శాతం), కశింకోట (54శాతం), సబ్బవరం (52శాతం), మాకవరపాలెం (56శాతం), కె.కోటపాడు (54శాతం), ఎలమంచిలి (47శాతం), పెందుర్తి (40శాతం), కొయ్యూరు (61శాతం), చోడవరం (47శాతం) చొప్పున తక్కువగా వర్షపాతం నమోదైనట్లు అధికారులు తేల్చారు. ఏజెన్సీలో ముంచంగిపుట్టులో సాధారణం కంటే 4శాతం, పాడేరు 11శాతం, పాయకరావుపేటలో 8శాతం, విశాఖపట్నం అర్బన్ 28శాతం చొప్పున ఎక్కువ వర్షపాతం నమోదైంది. జిల్లాలో ఖరీఫ్ సాగు విస్తీర్ణం 2,27,400 హెక్టార్లు. వర్షాభావం కారణంగా ఇంతవరకు కేవలం 56,500 హెక్టార్లలోనే పంటలు చేపట్టారు. వరి సాధారణ విస్తీర్ణం 1.10లక్షల హెక్టార్లు కాగా, ఇంతవరకు 3,400హెక్టార్లలో మాత్రమే నాట్లు పడ్డాయి. ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ పరిస్థితులను అధికారులు నివేదించారు. అయితే ఇంకా వర్షాలు పడే అవకాశం ఉన్నందున మరికొంత కాలం ఆగి కరువు మండలాల జాబితా తయారుచేయాలని జిల్లా అధికారులు భావిస్తున్నారు. -
ఆగస్టుపైనే ఆశలు !
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : జిల్లాలో గడిచిన రెండు నెలల్లో ఏ ఒక్క మండలంలోనూ సాధారణ స్థాయి వర్షపాతం నమోదు కాలేదు. ఆగస్టు నెల ప్రారంభలో అడపాదడపా చిరుజల్లులు కురుస్తున్నా పంటలు విత్తే స్థాయిలో వానల్లేవు. ఇప్పటికే వరి సాగు ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో వ్యవసాయాధికారులు పత్తి, సోయాబీన్ సాగు చేయవద్దని రైతులకు సూచిస్తున్నారు. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని చెబుతున్నారు. సాధారణం కంటే తక్కువ.. గతేడాది జూలై నెలాఖరు వరకు 987.6 మిల్లీమీటర్ల వర్షం కురవగా, ఆగస్టు నెలలో 359.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణం కంటే రెట్టింపు వర్షం కురిసింది. 5.85 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు(ఆగస్టు 9వ తేదీ) సాధారణ వర్షపాతం 618.8 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా 261.7 మిల్లీమీటర్లు నమోదైంది. ఇందులో జూన్‌లో సాధారణ వర్షపాతం 199.5 మిల్లీమీటర్లకు 73.1 మిల్లీమీటర్లు కురిసింది. జూలైలో 329.2 మిల్లీమీటర్లకు 158.4 మిల్లీమీటర్ల వర్షం పడింది. ఇక ఆగస్టులో సాధారణ వర్షపాతం 314 మిల్లీమీటర్లు నమోదు కావాల్సి ఉంది. గడిచిన పదేళ్ల గణాంకాల ప్రకారం ఏటా ఆగస్టు నెలలోనే అత్యధిక వర్షపాతం నమోదైంది. పంటలపై ఆశలు గల్లంతే.. జిల్లాలో ప్రధానంగా పత్తి, సోయాబీన్ సాగు చేస్తుంటారు. 90 శాతం వర్షాలపై ఆధారపడి సాగు చేస్తుంటారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో జిల్లాలో 6.50 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయాధికారులు ప్రణాళిక రూపొందించారు. వర్షాభావ పరిస్థితులతో ఇప్పటి వరకు 5.22 లక్షల హెక్టార్లలో పంటలు సాగవుతున్నాయని చెబుతున్నా అంతకంటే తక్కువ విస్తీర్ణంలో సాగవుతున్నట్లు తెలుస్తోంది. గతేడాది అధిక వర్షాలతో పంటలు నీటిపాలు కాగా.. ఈ యేడు వర్షాల జాడలేక విత్తిన పంటలపై రైతులు ఆశలు వదులుకుంటున్నారు. రెండుమూడుసార్లు విత్తినా విత్తనాలు మొలకెత్తకపోగా.. మెలకెత్తిన చోట మొక్కలు మాడిపోతున్నాయి. ఈ మొక్కలను రక్షించుకోవడానికి రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. నీటి వసతి ఉన్నవారూ కరెంటు కోతలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విత్తన దశలోనే సుమారు రూ.2 కోట్ల వరకు జిల్లా రైతులు నష్టపోయినట్లు సమాచారం. కళ తప్పిన జాలశయాలు వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా జిల్లాలో ఉన్న 11 ప్రాజెక్టుల్లో ఏ ఒక్కటి సాధారణ స్థాయి నీటిమట్టానికి చేరుకోలేదు. దీంతో ఆయా ప్రాజెక్టుల కింద సాగు విస్తీర్ణం ప్రశ్నార్థకంగా మారింది. గతేడాది ఇప్పటికే ఆయా ప్రాజెక్టుల్లోకి నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరడంతో పలుమార్లు గేట్లు తెరిచి నీటిని బయటకు వదలాల్సి వచ్చింది. అయితే ఈ ఏడాది మాత్రం పరిస్థితి అందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. నీళ్లు లేక జలాశయాలు వెలవెలబోతున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి నీటి ప్రవాహం అంతగా లేకపోవడంతో ప్రాజెక్టులు కళ తప్పాయి. ఆయా ప్రాజెక్టుల కింద సుమారు 75 వేల హెక్టార్లు సాగవుతుండగా ఈ సారి వర్షాభావ పరిస్థితులతో సాగుపై ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాలో ప్రధానంగా శ్రీరాంసాగర్, కడెం ప్రాజెక్టుల్లో ఆశించిన స్థాయిలో నీరు చేరకపోవడంతో వరి నాట్లు 20 శాతమే వేసుకున్నారు. వరి విత్తనాలు ఆలస్యంగా అలికి వర్షాలు పడితే నాట్లు వేసుకుందామని రైతులు వరుణుడి కరుణ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే నాట్లేసినవారు ప్రాజెక్టుల్లో సరిపడా నీరులేక అయోమయానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టులో కురిసే వర్షాలపైనే రైతులు గంపెడాశలు పెట్టుకున్నారు. ఇకనైనా వరుణుడు కరుణించాలని వేడుకుంటున్నారు. -
ఖరీఫ్ కరువు
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: ఖరీఫ్ కలిసొచ్చే పరిస్థితులు కానరావడం లేదు. పెట్టుబడులు దక్కుతాయోలేదోనని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వర్షాభావ పరిస్థితులు కారణంగా జిల్లాలో కరువు చాయలు అలముకున్నాయి. సగానికి పైగా మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదైంది. కొన్ని ప్రాంతా ల్లో ఇప్పటికీ నాట్లు వేస్తున్నారు. ముదురునారు తో ఆలస్యంగా నాట్లుతో పంటకు తెగుళ్లు ఆశిస్తున్నాయి. దిగుబడులపై దీని ప్రభావం ఉంటుంద ని వ్యవసాయశాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చే స్తున్నారు. ప్రధానంగా నారు ముదిరిపోవడంతో పంట దిగుబడి సగానికి తగ్గిపోతుందని పేర్కొం టున్నారు. రైతులు ఇక ఖరీఫ్ నాట్లను ఆపేసి వర్షాల స్థితిగతులను బట్టి రబీలో స్వల్పకాలిక వంగడాలు చేపట్టాలని సూచిస్తున్నారు. ఈ సీజ న్లో వరి సాధారణ విస్తీర్ణం 92,885 హెక్టార్లు. సుమారు లక్ష హెక్టార్లలో వరి సాగవుతుందని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. రుతుపవనాలు కూడా ముందుగానే ప్రవేశించడంతో ఆశించిన స్థాయిలో వానలు పడతాయని సాగుపనులకు రైతులు సిద్ధమయ్యారు. అయితే ఆశించిన విధంగా వర్షాలు అనుకూలించలేదు. దాదాపుగా 30 మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదైంది. ముంచంగిపుట్టు, పెదబయలు, గూడెంకొత్తవీధి మండలాల్లో మాత్రం అత్యధిక వర్షం కురిసింది. దీంతో మొత్తంగా 56 వేల హెక్టార్లలో మాత్రమే నాట్లు పడినట్టు వ్యవసాయాధికారులు లెక్కలు తేల్చారు. నివేదికకు సమైక్య సెగ వర్షాభావ పరిస్థితులతో జిల్లాలో కరవు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆగస్టు 30 వరకు వర్షపాతాన్ని మండలాల వారీగా పరిశీలించి తదనుగుణంగా కరవు అంచనాలను సిద్ధం చేయాల్సి ఉంది. కాని అందుకు ఆస్కారం లేకుండా పోయింది. వ్యవసాయ శాఖ అధికారుల నుంచి రెవెన్యూ సిబ్బంది వరకు అందరూ సమైక్యాంధ్ర సమ్మెలో ఉన్నారు. వాస్తవానికి సోమవారానికే మండలాల వారీగా వర్షపాతం వివరాలను నమోదు చేయాల్సి ఉండగా సిబ్బంది లేకపోవడంతో ఆ వివరాలు ఇప్పటి వరకు రాలేదు. దీంతో కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ ఆ బాధ్యతలను ఆర్డీవోలకు అప్పగించారు. మండలాల వారీగా వర్షపాతం వివరాలను సేకరించి చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్‌కు పంపించాలని ఆదేశించారు. కొన్ని చోట్ల తప్పుడు సమాచారం వచ్చినా సిబ్బంది సమ్మె అనంతరం వాటిని సరిచేసే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. కొన్ని మండలాల్లో వర్షాపాతం నమోదుకు ఆటోమేటిక్ రెయిన్‌ఫాల్ రికార్డింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. వీటి లో నమోదైన వివరాలను సేకరించనున్నారు. ఆర్డీవోల నుంచి వివరాలు వచ్చిన తరువాత కరవుపై ఒక నివేదికను తయారు చేసి కలెక్టర్ ప్రభుత్వానికి పంపించనున్నారు. రబీకి కార్యాచరణ ఖరీఫ్ సీజన్ సెప్టెంబర్ నెలాఖరుతో ముగిసింది. రబీకి కార్యాచరణ సిద్ధం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యాయి. వ్యవసాయాధికారులు సమ్మెలో ఉండటంతో దీనికీ కొంత జాప్యం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పంట సాగు లక్ష్యంతో పాటు రైతులకు రుణ లక్ష్యంపైగా కూడా త్వరలో నిర్ణయాలు చేయనున్నారు. రుణ లక్ష్యంపై ఈ నెల తొలివారంలో డీసీసీ సమావేశం నిర్వహించాలని కలెక్టర్ నిర్ణయించారు. ఇందులో బ్యాంకర్లతో సమావేశమై పంట రుణ లక్ష్యాలను నిర్దేశించనున్నారు. రబీకి సంబంధించి ఇప్పటికే జిల్లాకు అవసరమైన మొత్తంలో ఎరువులను అందుబాటులో ఉంచారు. రబీకి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ తెలిపారు. -
‘బోరబండ’.. ఏదీ అండ
గజ్వేల్, న్యూస్‌లైన్: బహుళ ప్రయోజన రిజర్వాయర్ ‘బోరబండ’ చుక్కనీరు లేక వెలవెలబోతోంది. తక్కువ వర్షపాతం కారణంగా ఎగువ ప్రాంతం నుంచి వరదనీరు రాకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. సాగునీటి కొరతతో తల్లడిల్లుతున్న రైతాంగానికి ఊరటనివ్వాల్సిన ఈ జలాశయం లక్ష్యానికి దూరంగా ఉంది. నిర్మాణం పూర్తయి 23 ఏళ్లు గడుస్తున్నా పంట పొలాలకు నీరందించాల్సిన కాల్వలు ప్రవాహానికి నోచుకోవడంలేదు. జలాశయం నిండితే మరెన్నో చెరువులకు నీటిని పంపే అవకాశమున్నా ఆ దిశగా సంబంధిత యంత్రాంగం చొరవ చూపడంలేదు. జగదేవ్‌పూర్ మండలంలోని పీర్లపల్లి-ధర్మారం గ్రామాల మధ్య 1990లో రూ. 56 లక్షల వ్యయంతో బోరబండ రిజర్వాయర్‌ను నిర్మించారు. 115 ఎకరాల విస్తీర్ణంలో 36.80 మిలియన్ ఘనపుటడుగుల నీటినిల్వ సామర్థ్యంతో ఈ జలాశయం నిర్మాణమైంది. క్షామంతో తల్లడిల్లుతున్న జగదేవ్‌పూర్ మండలంలోని వివిధ గ్రామాలకు ఆరుతడి పంటలకు కాల్వల ద్వారా సాగునీటిని అందించడంతో పాటు గజ్వేల్ నియోజకవర్గంలో భూగర్భజలాల పెంపొందించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. సాగునీటిని పొలాలకు అందించడం కోసం 2.6 కిలోమీటర్ల పొడవున కుడి, 1.94 కిలోమీటర్ల పొడవునా ఎడమ కాల్వల నిర్మాణాన్ని పూర్తిచేశారు. ప్రాజెక్టు పరిధిలో 832 ఎకరాల ఆయకట్టు భూములున్నాయి. ఇందులో కుడికాల్వ ద్వారా ధర్మారం, వర్దరాజ్‌పూర్, ఇటిక్యాల,కొత్తపేట, పీర్లపల్లి గ్రామాల్లోని 568 ఎకరాల పంట పొలాలకు సాగునీరు అందించడానికి, ఎడమ కాల్వ ద్వారా ధర్మారం, పీర్లపల్లిలోని మరికొంత భాగంలో వున్న 264 ఎకరాల ఆరుతడి పంటలకు సాగునీరు అందించడానికి నిర్ణయించారు. కానీ రిజర్వాయర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు కాల్వలు ప్రవాహానికి నోచుకోలేదు. ఫలితంగా ఆయకట్టు భూముల రైతులకు నిరాశే మిగిలింది. మూడేళ్లుగా తక్కువ వర్షపాతం కారణంగా వల్ల ఈ జలాశయం ఎండుముఖం పట్టింది. ఈసారి విచిత్రంగా జిల్లాలోని చాలా ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదుకాగా ‘బోరబండ’ ఎగువ ప్రాంతంలో అతి తక్కువగా వర్షాలు కురవడంతో వరద రాక రిజర్వాయర్‌లోకి చుక్కనీరు చేరలేదు. ఇదిలా ఉండగా వర్షాల వల్ల ప్రాజెక్టు నిండిన సందర్భంలోనూ కాల్వల ద్వారా నీరందించేందుకు తూములను ఎత్తకపోవడంతో ప్రాజెక్టు వల్ల ఆశించిన స్థాయిలో ప్రయోజనం చేకూరలేదనే చెప్పాలి. మరోపక్క కాల్వలు సక్రమంగా లేకపవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి ప్రాజెక్టు నిర్మించాలంటే సుమారు రూ.15 కోట్లకు పైగానే ఖర్చవుతుందని చెబుతున్న ఇరిగేషన్ శాఖ అధికారులు 23 ఏళ్ల కిందట నిర్మించిన తక్కువ ఖర్చుతో అద్భుతంగా నిర్మించిన రిజర్వాయర్ అభివద్ధిపై నిర్లక్ష్యం వహించడంపై నిరసన వ్యక్తమవుతోంది. అరకొరగా అభివృద్ధి పనులు.... సామూహిక చెరువుల యాజమాన్య పథకం కింద ‘బోరబండ’ రిజర్వాయర్ అభివృద్ధికి 2008లో ప్రభుత్వం రూ. 84 లక్షలు మంజూరు చేసింది. ఈ నిధులను సద్వినియోగం చేసేందుకు ప్రణాళికలు తయారుచేసి సాంకేతిక అనుమతి పొందాల్సి ఉండగా దానిని పూర్తిచేయడంలో అధికారులు ఏళ్ల తరబడి నిర్లక్ష్యం ప్రదర్శించారు. ఎట్టకేలకు అధికారులు స్పందించి ఏడాది క్రితం టెండర్ల ప్రక్రియను పూర్తిచేసి పనులు చేపట్టారు. శిథిలమైన కాల్వలను పటిష్టం చేయడం, తూముల మరమ్మతు, కట్టను పటిష్టం చేయడం తదితర పనులు వంటి పనులు అరకొరగా సాగాయి. ఎతైన ప్రదేశంలో ఉన్నా బోరబండ రిజర్వాయర్ నిండితే జగదేవ్‌పూర్ మండలంలోని పలు చెరువులతోపాటు పక్కనే ఉన్న నల్గొండ జిల్లాలోని వివిధ గ్రామాల చెరువులకు నీటిని పంపే అవకాశముంది.