కనికరించని చినుకు
జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితి
సాధారణం కంటే 31 శాతం తక్కువ నమోదు
14 మండలాల్లో మరీ ఘోరం
ఖరీఫ్ గండంపై ప్రణాళికశాఖ నివేదిక
విశాఖపట్నం : జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. మునుపెన్నడూలేనివిధంగా కొన్ని మండలాల్లో పరిస్థితి దయనీయంగా ఉంది. సాధారణం కంటే 31శాతం తక్కువ వర్షపాతం నమోదయింది. ఈపాటికే జలాశయాలు,నదులు,చెరువులు,పంటపొలాలు నిండుగాకళకళలాడాలి. ఎక్కడికక్కడ అడుగంటి వెక్కిరిస్తున్నాయి. ఆగస్టు రెండోవారం ముగిసిపోతున్నా వరుణుడు కరుణించకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఏజెన్సీలో మాత్రం సాధారణం కంటే ఎక్కువగా వర్షపాతం నమోదైంది.
జూన్ ఒకటో తేదీ నుంచి ఆగస్టు 13వరకు
జిల్లావ్యాప్తంగా మండలాల వారీ వర్షపాత వివరాలు సేకరించిన ప్రణాళికశాఖ అధికారులు తీవ్ర వర్షాభావ పరిస్థితులను చూసి
ఆందోళన చెందుతున్నారు. జూన్ నుంచి ఆగస్టు వరకు మొత్తం 407.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వాలి. ఇంతవరకు 280.5 మిల్లీమీటర్లు నమోదైంది. అంటే 31శాతం తక్కువ. 14మండలాల్లో సాధారణంలో సగం కూడా కురవకపోవడంతో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ముఖ్యంగా అచ్యుతాపురంలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సాధారణ వర్షపాతం 338.8 మిల్లీమీటర్లు. ఇక్కడ కేవలం 122.8 మిల్లీమీటర్లే నమోదైంది. పరవాడ (55శాతం), బుచ్చయ్యపేట (55శాతం), కశింకోట (54శాతం), సబ్బవరం (52శాతం), మాకవరపాలెం (56శాతం), కె.కోటపాడు (54శాతం), ఎలమంచిలి (47శాతం), పెందుర్తి (40శాతం), కొయ్యూరు (61శాతం), చోడవరం (47శాతం) చొప్పున తక్కువగా వర్షపాతం నమోదైనట్లు అధికారులు తేల్చారు. ఏజెన్సీలో ముంచంగిపుట్టులో సాధారణం కంటే 4శాతం, పాడేరు 11శాతం, పాయకరావుపేటలో 8శాతం, విశాఖపట్నం అర్బన్ 28శాతం చొప్పున ఎక్కువ వర్షపాతం నమోదైంది.
జిల్లాలో ఖరీఫ్ సాగు విస్తీర్ణం 2,27,400 హెక్టార్లు. వర్షాభావం కారణంగా ఇంతవరకు కేవలం 56,500 హెక్టార్లలోనే పంటలు చేపట్టారు. వరి సాధారణ విస్తీర్ణం 1.10లక్షల హెక్టార్లు కాగా, ఇంతవరకు 3,400హెక్టార్లలో మాత్రమే నాట్లు పడ్డాయి. ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ పరిస్థితులను అధికారులు నివేదించారు. అయితే ఇంకా వర్షాలు పడే అవకాశం ఉన్నందున మరికొంత కాలం ఆగి కరువు మండలాల జాబితా తయారుచేయాలని జిల్లా అధికారులు భావిస్తున్నారు.