ఆదిలాబాద్ అగ్రికల్చర్ : జిల్లాలో గడిచిన రెండు నెలల్లో ఏ ఒక్క మండలంలోనూ సాధారణ స్థాయి వర్షపాతం నమోదు కాలేదు. ఆగస్టు నెల ప్రారంభలో అడపాదడపా చిరుజల్లులు కురుస్తున్నా పంటలు విత్తే స్థాయిలో వానల్లేవు. ఇప్పటికే వరి సాగు ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో వ్యవసాయాధికారులు పత్తి, సోయాబీన్ సాగు చేయవద్దని రైతులకు సూచిస్తున్నారు. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని చెబుతున్నారు.
సాధారణం కంటే తక్కువ..
గతేడాది జూలై నెలాఖరు వరకు 987.6 మిల్లీమీటర్ల వర్షం కురవగా, ఆగస్టు నెలలో 359.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణం కంటే రెట్టింపు వర్షం కురిసింది. 5.85 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు(ఆగస్టు 9వ తేదీ) సాధారణ వర్షపాతం 618.8 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా 261.7 మిల్లీమీటర్లు నమోదైంది. ఇందులో జూన్‌లో సాధారణ వర్షపాతం 199.5 మిల్లీమీటర్లకు 73.1 మిల్లీమీటర్లు కురిసింది. జూలైలో 329.2 మిల్లీమీటర్లకు 158.4 మిల్లీమీటర్ల వర్షం పడింది. ఇక ఆగస్టులో సాధారణ వర్షపాతం 314 మిల్లీమీటర్లు నమోదు కావాల్సి ఉంది. గడిచిన పదేళ్ల గణాంకాల ప్రకారం ఏటా ఆగస్టు నెలలోనే అత్యధిక వర్షపాతం నమోదైంది.
పంటలపై ఆశలు గల్లంతే..
జిల్లాలో ప్రధానంగా పత్తి, సోయాబీన్ సాగు చేస్తుంటారు. 90 శాతం వర్షాలపై ఆధారపడి సాగు చేస్తుంటారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలో 6.50 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయాధికారులు ప్రణాళిక రూపొందించారు. వర్షాభావ పరిస్థితులతో ఇప్పటి వరకు 5.22 లక్షల హెక్టార్లలో పంటలు సాగవుతున్నాయని చెబుతున్నా అంతకంటే తక్కువ విస్తీర్ణంలో సాగవుతున్నట్లు తెలుస్తోంది. గతేడాది అధిక వర్షాలతో పంటలు నీటిపాలు కాగా.. ఈ యేడు వర్షాల జాడలేక విత్తిన పంటలపై రైతులు ఆశలు వదులుకుంటున్నారు.
రెండుమూడుసార్లు విత్తినా విత్తనాలు మొలకెత్తకపోగా.. మెలకెత్తిన చోట మొక్కలు మాడిపోతున్నాయి. ఈ మొక్కలను రక్షించుకోవడానికి రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. నీటి వసతి ఉన్నవారూ కరెంటు కోతలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విత్తన దశలోనే సుమారు రూ.2 కోట్ల వరకు జిల్లా రైతులు నష్టపోయినట్లు సమాచారం.
కళ తప్పిన జాలశయాలు
వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా జిల్లాలో ఉన్న 11 ప్రాజెక్టుల్లో ఏ ఒక్కటి సాధారణ స్థాయి నీటిమట్టానికి చేరుకోలేదు. దీంతో ఆయా ప్రాజెక్టుల కింద సాగు విస్తీర్ణం ప్రశ్నార్థకంగా మారింది. గతేడాది ఇప్పటికే ఆయా ప్రాజెక్టుల్లోకి నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరడంతో పలుమార్లు గేట్లు తెరిచి నీటిని బయటకు వదలాల్సి వచ్చింది. అయితే ఈ ఏడాది మాత్రం పరిస్థితి అందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. నీళ్లు లేక జలాశయాలు వెలవెలబోతున్నాయి.
ఎగువ ప్రాంతాల నుంచి నీటి ప్రవాహం అంతగా లేకపోవడంతో ప్రాజెక్టులు కళ తప్పాయి. ఆయా ప్రాజెక్టుల కింద సుమారు 75 వేల హెక్టార్లు సాగవుతుండగా ఈ సారి వర్షాభావ పరిస్థితులతో సాగుపై ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాలో ప్రధానంగా శ్రీరాంసాగర్, కడెం ప్రాజెక్టుల్లో ఆశించిన స్థాయిలో నీరు చేరకపోవడంతో వరి నాట్లు 20 శాతమే వేసుకున్నారు. వరి విత్తనాలు ఆలస్యంగా అలికి వర్షాలు పడితే నాట్లు వేసుకుందామని రైతులు వరుణుడి కరుణ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే నాట్లేసినవారు ప్రాజెక్టుల్లో సరిపడా నీరులేక అయోమయానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టులో కురిసే వర్షాలపైనే రైతులు గంపెడాశలు పెట్టుకున్నారు. ఇకనైనా వరుణుడు కరుణించాలని వేడుకుంటున్నారు.
ఆగస్టుపైనే ఆశలు !
Published Mon, Aug 11 2014 12:41 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement
Advertisement