మొదటి రోజే కిరికిరి
పత్తి కొనుగోళ్లపై ప్రతిష్టంభన
తేమ పేరుతో చేతులెత్తేసిన సీసీఐ
కనీస మద్దతు ధర ఇచ్చేందుకు ప్రైవేటు వ్యాపారుల ససేమిరా
ఆందోళన బాట పట్టిన రైతులు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్/ ఆదిలాబాద్ అగ్రికల్చరల్ : అనుకున్నదే అయ్యింది. రైతులు ఆందోళన చెందినట్లుగానే మొదటిరోజే ఆందోళన కార్యక్రమాలు చేపట్టక తప్పలేదు. ఈ సీజన్‌లోనూ పత్తి రైతుకు నిరాశే ఎదురైంది. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని పండించిన పత్తిని విక్రయించేందుకు మార్కెట్ యార్డుకు అన్నదాతకు కనీసం మద్దతు ధర కూడా దొరక ని దుస్థితి వచ్చింది. పత్తి రైతుకు అండగా నిలవాల్సిన ప్రభుత్వ రంగ సంస్థ సీసీఐ తేమ శాతం పేరుతో కుంటిసాకులు చెప్పి చేతులెత్తేసింది. దీంతో పత్తి రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించక తప్పనిసరి పరిస్థితులు ఏర్పడ్డాయి. దీన్ని ఆసరాగా చేసుకున్న వ్యాపారులు దండుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.
కనీసం మద్దతు ధర క్వింటాల్‌కు రూ.4,050 చొప్పున చెల్లించాల్సి ఉన్నా.. రూ.3,200లకు మించి ఇవ్వలేమని తేల్చి చెప్పారు. కనీస మద్దతు ధర దక్కక, నామమాత్ర ధరకు విక్రయించుకోలేక పత్తి రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. దీంతో ఆదిలాబాద్ మార్కెట్ యార్డుల్లో పత్తి కొనుగోళ్లపై ప్రతిష్టంభన ఏర్పడింది. సీసీఐ అధికారులు ప్రైవేటు వ్యాపారులతో కుమ్మక్కై తేమ శాతం పేరుతో వ్యూహాత్మకంగా పక్కకు తప్పుకున్నారని, ఇరువురూ కలిసి తమను దోపిడీ చేస్తున్నారని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. రైతుల ఉత్పత్తులకు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాల్సిన జిల్లా అధికార యంత్రాంగం చేష్టలుడిగి చూడ్డం ప్రైవేటు వ్యాపారులకు వంత పాడినట్లే అవుతుందని రైతుల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రాత్రి వరకూ కొనసాగిన ఉద్రిక్తత..
జిల్లాలో ఆదిలాబాద్‌తో పాటు భైంసా, మంచిర్యాలల్లో సోమవారం నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభిస్తామని సీసీఐ అధికారులు ప్రక టించారు. దీంతో సోమవారం రైతులు కొనుగోలు కేంద్రాలకు పత్తిని తరలించారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డుకు సుమారు ఐదువందల వరకు పత్తి బండ్లు, వాహనాలు వచ్చాయి. ఎప్పటిలాగే సీసీఐ అధికారులు పత్తి కొనుగోళ్లకు కుంటిసాకులు చెప్పారు. 8 నుంచి 12 శాతం వరకు తేమ ఉన్న పత్తిని మాత్రమే కొనుగోలు చేస్తామని సీసీఐ అధికారులు కొర్రి పెట్టారు.
అంతకుమించి తేమ ఉంటే ఒక్కో శాతానికి క్వింటాల్‌కు రూ.40 చొప్పున ధరలో కోత విధిస్తామని, 15 శాతానికి మించి తేమ ఉంటే అసలు ఆ పత్తినే కొనుగోలు చేయలేమని తేల్చి చెప్పారు. దీంతో పత్తి రైతులు యార్డులో ఆందోళనకు దిగారు. సీసీఐ బ్రాంచ్ మేనేజర్ అర్జున్‌దవే, మార్కెటింగ్ శాఖ జాయింట్ డెరైక్టర్ సుధాకర్, ఏడీ శ్రీనివాస్‌లను ఘెరావ్ చేశారు. ఆదిలాబాద్ ఆర్డీవో సుధాకర్‌రెడ్డి, అదనపు ఎస్పీ జోయల్ డేవిస్ రైతులను సముదాయించినా ఫలితం లేకుండా పోయింది. మధ్యాహ్నం కలెక్టర్ యార్డుకు వచ్చి రైతులతో, సీసీఐ అధికారులతో చర్చలు జరిపారు. అవి ఫలించకపోవడంతో, తిరిగి రాత్రి ఏడు గంటలకు ప్రైవేటు వ్యాపారులతో చర్చించారు. పత్తి కొనుగోళ్లు ప్రారంభించాలని కోరారు.
ఎక్కడా లేని నిబంధన ఇక్కడెందుకు..
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక్క ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో మాత్రమే తేమ శాతం పేరుతో ధరలో కోత విధించడం ఏంటని అన్నదాతలు ప్రశ్నించారు. సాధారణంగా ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో 20 శాతం వరకు తేమ ఉంటుందని, నేరుగా పత్తి చేలల్లోకి వెళ్లి అక్కడే తేమ శాతాన్ని పరిశీలించినా 20 శాతం వరకు తేమ ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు. అలాంటిది ఇప్పుడు 12 శాతానికి మించి తేమ ఉంటే కొనుగోలు చేయడం కుదరదని చెప్పడం ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు.