‘బోరబండ’.. ఏదీ అండ | Low Rainfall, No water in Borabanda Reservoir | Sakshi
Sakshi News home page

‘బోరబండ’.. ఏదీ అండ

Published Fri, Aug 23 2013 2:11 AM | Last Updated on Fri, Sep 1 2017 10:01 PM

Low Rainfall, No water in Borabanda Reservoir

గజ్వేల్, న్యూస్‌లైన్: బహుళ ప్రయోజన రిజర్వాయర్ ‘బోరబండ’ చుక్కనీరు లేక వెలవెలబోతోంది. తక్కువ వర్షపాతం కారణంగా ఎగువ ప్రాంతం నుంచి వరదనీరు రాకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. సాగునీటి కొరతతో తల్లడిల్లుతున్న రైతాంగానికి ఊరటనివ్వాల్సిన ఈ జలాశయం లక్ష్యానికి దూరంగా ఉంది. నిర్మాణం పూర్తయి 23 ఏళ్లు గడుస్తున్నా పంట పొలాలకు నీరందించాల్సిన కాల్వలు ప్రవాహానికి నోచుకోవడంలేదు. జలాశయం నిండితే మరెన్నో చెరువులకు నీటిని పంపే అవకాశమున్నా ఆ దిశగా సంబంధిత యంత్రాంగం చొరవ చూపడంలేదు. జగదేవ్‌పూర్ మండలంలోని పీర్లపల్లి-ధర్మారం గ్రామాల మధ్య 1990లో రూ. 56 లక్షల వ్యయంతో బోరబండ రిజర్వాయర్‌ను నిర్మించారు. 115 ఎకరాల విస్తీర్ణంలో 36.80 మిలియన్ ఘనపుటడుగుల నీటినిల్వ సామర్థ్యంతో ఈ జలాశయం నిర్మాణమైంది.
 
క్షామంతో తల్లడిల్లుతున్న జగదేవ్‌పూర్ మండలంలోని వివిధ గ్రామాలకు ఆరుతడి పంటలకు కాల్వల ద్వారా సాగునీటిని అందించడంతో పాటు గజ్వేల్ నియోజకవర్గంలో భూగర్భజలాల పెంపొందించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. సాగునీటిని పొలాలకు అందించడం కోసం 2.6 కిలోమీటర్ల పొడవున కుడి, 1.94 కిలోమీటర్ల పొడవునా ఎడమ కాల్వల నిర్మాణాన్ని పూర్తిచేశారు. ప్రాజెక్టు పరిధిలో 832 ఎకరాల ఆయకట్టు భూములున్నాయి. ఇందులో కుడికాల్వ ద్వారా ధర్మారం, వర్దరాజ్‌పూర్, ఇటిక్యాల,కొత్తపేట, పీర్లపల్లి గ్రామాల్లోని 568 ఎకరాల పంట పొలాలకు సాగునీరు అందించడానికి, ఎడమ కాల్వ ద్వారా ధర్మారం, పీర్లపల్లిలోని మరికొంత భాగంలో వున్న 264 ఎకరాల ఆరుతడి పంటలకు సాగునీరు అందించడానికి నిర్ణయించారు. కానీ రిజర్వాయర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు కాల్వలు ప్రవాహానికి నోచుకోలేదు.
 
ఫలితంగా ఆయకట్టు భూముల రైతులకు నిరాశే మిగిలింది. మూడేళ్లుగా తక్కువ వర్షపాతం కారణంగా వల్ల ఈ జలాశయం ఎండుముఖం పట్టింది. ఈసారి విచిత్రంగా జిల్లాలోని చాలా ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదుకాగా ‘బోరబండ’ ఎగువ ప్రాంతంలో అతి తక్కువగా వర్షాలు కురవడంతో వరద రాక రిజర్వాయర్‌లోకి చుక్కనీరు చేరలేదు. ఇదిలా ఉండగా వర్షాల వల్ల ప్రాజెక్టు నిండిన సందర్భంలోనూ కాల్వల ద్వారా నీరందించేందుకు తూములను ఎత్తకపోవడంతో ప్రాజెక్టు వల్ల ఆశించిన స్థాయిలో ప్రయోజనం చేకూరలేదనే చెప్పాలి. మరోపక్క కాల్వలు సక్రమంగా లేకపవడంతో  రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి ప్రాజెక్టు నిర్మించాలంటే సుమారు రూ.15 కోట్లకు పైగానే ఖర్చవుతుందని చెబుతున్న ఇరిగేషన్ శాఖ అధికారులు 23 ఏళ్ల కిందట నిర్మించిన తక్కువ ఖర్చుతో అద్భుతంగా నిర్మించిన రిజర్వాయర్ అభివద్ధిపై నిర్లక్ష్యం వహించడంపై నిరసన వ్యక్తమవుతోంది.

అరకొరగా అభివృద్ధి పనులు....
సామూహిక చెరువుల యాజమాన్య పథకం కింద ‘బోరబండ’ రిజర్వాయర్ అభివృద్ధికి 2008లో ప్రభుత్వం రూ. 84 లక్షలు మంజూరు చేసింది. ఈ నిధులను సద్వినియోగం చేసేందుకు ప్రణాళికలు తయారుచేసి సాంకేతిక అనుమతి పొందాల్సి ఉండగా దానిని పూర్తిచేయడంలో అధికారులు ఏళ్ల తరబడి నిర్లక్ష్యం ప్రదర్శించారు. ఎట్టకేలకు అధికారులు స్పందించి ఏడాది క్రితం టెండర్ల ప్రక్రియను పూర్తిచేసి పనులు చేపట్టారు. శిథిలమైన కాల్వలను పటిష్టం చేయడం, తూముల మరమ్మతు, కట్టను పటిష్టం చేయడం తదితర పనులు వంటి పనులు అరకొరగా సాగాయి. ఎతైన ప్రదేశంలో ఉన్నా బోరబండ రిజర్వాయర్ నిండితే జగదేవ్‌పూర్ మండలంలోని పలు చెరువులతోపాటు పక్కనే ఉన్న నల్గొండ జిల్లాలోని వివిధ గ్రామాల చెరువులకు నీటిని పంపే అవకాశముంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement