రికార్డ్‌ స్థాయిల నుంచి పతనం | Sensex rises over 150 points, Nifty above 11750 | Sakshi
Sakshi News home page

రికార్డ్‌ స్థాయిల నుంచి పతనం

Published Thu, Apr 4 2019 6:15 AM | Last Updated on Thu, Apr 4 2019 6:15 AM

Sensex rises over 150 points, Nifty above 11750 - Sakshi

ఇంట్రాడేలో సూచీలు ఆల్‌టైమ్‌ హైలను తాకినట్లుగానే పలు షేర్లు జీవిత కాల గరిష్ట స్థాయిలకు ఎగిశాయి. ఏషియన్‌ పెయింట్స్, అతుల్, బజాజ్‌ ఫైనాన్స్, బజాజ్‌ ఫిన్‌సర్వ్, గోద్రేజ్‌ ప్రోపర్టీస్, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్, ఇండియన్‌ హోటల్స్, ముత్తూట్‌ ఫైనాన్స్, పిడిలైట్‌ ఇండస్ట్రీస్‌ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.

నాలుగు రోజుల స్టాక్‌మార్కెట్‌ లాభాలకు బుధవారం బ్రేక్‌ పడింది. ఈ ఏడాది సాధారణం కంటే తక్కువగానే వర్షాలు కురవవచ్చనే అంచనాలు, ముడి చమురు ధరలు భగ్గుమనడం...ఇన్వెస్టర్లను లాభాల స్వీకరణకు పురికొల్పాయి. దీంతో ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయిలకు పెరిగినప్పటికీ, సెన్సెక్స్, నిఫ్టీలు చివరకు నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్‌ 39,000 పాయింట్లు, నిఫ్టీ 11,700 పాయింట్ల దిగువకు పడిపోయాయి. అన్ని రంగాల సూచీలు నష్టపోయాయి. రోజంతా 443 పాయింట్ల రేంజ్‌లో కదలాడిన సెన్సెక్స్‌ చివరకు 180 పాయింట్లు పతనమై 38,877 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 69 పాయింట్లు నష్టపోయి 11,644 పాయింట్ల వద్దకు చేరింది.  

ఎల్‌నినోతో ‘తక్కువ’ వర్షాలు....
పసిఫిక్‌ మహా సముద్రంలో ఎల్‌నినో వృద్ది చెందుతోందని, ఫలితంగా ఈ ఏడాది సాధారణం కంటే తక్కువగానే వర్షాలు పడొచ్చనే అంచనాలను ప్రైవేట్‌ వాతావరణ సంస్థ, స్కైమెట్‌ వెలువరించింది. దీంతో వృద్ధి మందగించివచ్చనే భయాలతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. ముడి చమురు ధరలు భగ్గుమనడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ఐదు నెలల గరిష్ట స్థాయి, 70 డాలర్లకు చేరువ కావడం ప్రతికూల ప్రభావం చూపించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి పాలసీని ఆర్‌బీఐ నేడు(గురువారం) వెలువరించనున్నది. కీలక రేట్లను పావు శాతం మేర తగ్గించవచ్చనే అంచనాలున్నాయి. ఈ పావు శాతం రేట్ల కోతను మార్కెట్‌ ఇప్పటికే డిస్కౌంట్‌  చేసుకుందని విశ్లేషకులంటున్నారు.  

443 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్‌
సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల్లోనే ఆరంభమయ్యాయి. ఆసియా మార్కెట్ల జోష్‌తో మధ్యాహ్నం దాకా లాభాల్లోనే ట్రేడయ్యాయి. మధ్యాహ్నం తర్వాత లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో నష్టాల్లోకి జారిపోయాయి. సెన్సెక్స్‌ ఒక దశలో 213 పాయింట్లు పెరగ్గా, మరో దశలో 230 పాయింట్లు పతనమైంది. మొత్తం మీద రోజంతా 443 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. ఇక నిఫ్టీ ఒక దశలో 48 పాయింట్లు లాభపడగా, మరో దశలో 84 పాయింట్లు నష్టపోయింది. ఇంట్రాడే గరిష్ట స్థాయిల నుంచి చూస్తే, సెన్సెక్స్‌ 393 పాయింట్లు, నిఫ్టీ 117 పాయింట్ల మేర నష్టపోయినట్లయింది.


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement