Skymet Weather Services
-
రుతు పవనాల రాక మరింత ఆలస్యం
న్యూఢిల్లీ: రుతుపవనాల రాక మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ తాజాగా అంచనా వేసింది. రుతుపవనాల్లో మందగమనం కారణంగా జూన్ 7వ తేదీకి రెండు రోజులు అటూఇటుగా కేరళను తాకనున్నాయని పేర్కొంది. ఇంతకు ముందు అంచనా ప్రకారం జూన్ 4వ తేదీకి రెండు రోజులు అటూఇటుగా కేరళను తాకవచ్చని తెలిపింది. రుతుపవనాల పురోగమనం మందకొడిగా సాగడంతో ఈ అంచనాలను మార్చుకోవాల్సి వచ్చిందని స్కైమెట్ ప్రెసిడెంట్ జీపీ శర్మ తెలిపారు. రుతుపవనాలు నెమ్మదిగా కదలటానికి సొమాలియా తీరంలో అల్పపీడనం, మధ్య అరేబియా సముద్రంపై అధికపీడనం, సొమాలియా తీరంపై వైపు నుంచి వీస్తున్న బలమైన గాలులే కారణమన్నారు. -
రికార్డ్ స్థాయిల నుంచి పతనం
ఇంట్రాడేలో సూచీలు ఆల్‌టైమ్ హైలను తాకినట్లుగానే పలు షేర్లు జీవిత కాల గరిష్ట స్థాయిలకు ఎగిశాయి. ఏషియన్ పెయింట్స్, అతుల్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, గోద్రేజ్ ప్రోపర్టీస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇండియన్ హోటల్స్, ముత్తూట్ ఫైనాన్స్, పిడిలైట్ ఇండస్ట్రీస్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. నాలుగు రోజుల స్టాక్‌మార్కెట్ లాభాలకు బుధవారం బ్రేక్ పడింది. ఈ ఏడాది సాధారణం కంటే తక్కువగానే వర్షాలు కురవవచ్చనే అంచనాలు, ముడి చమురు ధరలు భగ్గుమనడం...ఇన్వెస్టర్లను లాభాల స్వీకరణకు పురికొల్పాయి. దీంతో ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయిలకు పెరిగినప్పటికీ, సెన్సెక్స్, నిఫ్టీలు చివరకు నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 39,000 పాయింట్లు, నిఫ్టీ 11,700 పాయింట్ల దిగువకు పడిపోయాయి. అన్ని రంగాల సూచీలు నష్టపోయాయి. రోజంతా 443 పాయింట్ల రేంజ్లో కదలాడిన సెన్సెక్స్ చివరకు 180 పాయింట్లు పతనమై 38,877 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 69 పాయింట్లు నష్టపోయి 11,644 పాయింట్ల వద్దకు చేరింది. ఎల్‌నినోతో ‘తక్కువ’ వర్షాలు.... పసిఫిక్ మహా సముద్రంలో ఎల్‌నినో వృద్ది చెందుతోందని, ఫలితంగా ఈ ఏడాది సాధారణం కంటే తక్కువగానే వర్షాలు పడొచ్చనే అంచనాలను ప్రైవేట్ వాతావరణ సంస్థ, స్కైమెట్ వెలువరించింది. దీంతో వృద్ధి మందగించివచ్చనే భయాలతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. ముడి చమురు ధరలు భగ్గుమనడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. బ్యారెల్ బ్రెంట్ చమురు ఐదు నెలల గరిష్ట స్థాయి, 70 డాలర్లకు చేరువ కావడం ప్రతికూల ప్రభావం చూపించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి పాలసీని ఆర్బీఐ నేడు(గురువారం) వెలువరించనున్నది. కీలక రేట్లను పావు శాతం మేర తగ్గించవచ్చనే అంచనాలున్నాయి. ఈ పావు శాతం రేట్ల కోతను మార్కెట్ ఇప్పటికే డిస్కౌంట్ చేసుకుందని విశ్లేషకులంటున్నారు. 443 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్ సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల్లోనే ఆరంభమయ్యాయి. ఆసియా మార్కెట్ల జోష్‌తో మధ్యాహ్నం దాకా లాభాల్లోనే ట్రేడయ్యాయి. మధ్యాహ్నం తర్వాత లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో నష్టాల్లోకి జారిపోయాయి. సెన్సెక్స్ ఒక దశలో 213 పాయింట్లు పెరగ్గా, మరో దశలో 230 పాయింట్లు పతనమైంది. మొత్తం మీద రోజంతా 443 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ఇక నిఫ్టీ ఒక దశలో 48 పాయింట్లు లాభపడగా, మరో దశలో 84 పాయింట్లు నష్టపోయింది. ఇంట్రాడే గరిష్ట స్థాయిల నుంచి చూస్తే, సెన్సెక్స్ 393 పాయింట్లు, నిఫ్టీ 117 పాయింట్ల మేర నష్టపోయినట్లయింది. -
ఈసారీ లోటు వర్షపాతమే
న్యూఢిల్లీ: ప్రముఖ ప్రైవేటు వాతావరణ అంచనా సంస్థ స్కైమెట్ భారత రైతులకు చేదు వార్తను తెలిపింది. ఈ ఏడాది సాధారణం కంటే తక్కువస్థాయి వర్షపాతం నమోదవుతుందని స్కైమెట్ అంచనా వేసింది. నైరుతీ రుతుపవనాల ప్రభావంతో జూన్–సెప్టెంబర్ మధ్యకాలంలో దీర్ఘకాలిక సగటు(ఎల్పీఏ)లో 93 శాతం వర్షపాతం మాత్రమే నమోదయ్యే అవకాశముందని వెల్లడించింది. పసిఫిక్ మహాసముద్రంలో జలాలు సాధారణం కంటే అధికంగా వేడెక్కిన నేపథ్యంలో ఎల్‌నినో ఏర్పడొచ్చనీ, ఇది నైరుతీ రుతుపవనాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంది. 1951 నుంచి 2000 వరకూ కురిసిన వర్షపాతాన్ని ఎల్‌పీఏగా వ్యవహరిస్తారు. ఇది 89 సెం.మీగా ఉంది. భారత్‌లో వ్యవసాయ రంగానికి జీవనాధారమైన నైరుతీ రుతుపవనాలు జూన్ 1న కేరళ తీరాన్ని తాకనున్నాయి. కోస్తాంధ్రలో సాధారణ వర్షమే.. ఒకవేళ ఈ అంచనాలు నిజమైతే వరుసగా రెండో ఏడాది కూడా భారత్‌లో లోటు వర్షపాతం నమోదైనట్లు అవుతుంది. అదే జరిగితే రుతుపవనాల తొలి అర్ధభాగంలో తూర్పు, మధ్య భారత్‌లోని రాష్ట్రాల్లో తీవ్రమైన వర్షపాత లోటు నెలకొంటుందని స్కైమెట్ తెలిపింది. అయితే కోస్తా ఆంధ్రా, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని చాలాప్రాంతాల్లో సీజన్ మొత్తం సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని వెల్లడించింది. ఈ విషయమై సంస్థ సీఈవో జతిన్ సింగ్ మాట్లాడుతూ..‘జూన్ నెలలో దీర్ఘకాలిక సగటులో 77 శాతం వర్షపాతం నమోదుకావొచ్చు. అదే జూలైలో కొంచెం పెరిగి 91 శాతానికి చేరుకోవచ్చు. ఇక ఆగస్టులో 102 శాతం, సెప్టెంబర్‌లో 99 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశముంది’ అని పేర్కొన్నారు. సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు 55 శాతం ఉండగా, సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు 30 శాతం ఉన్నాయనీ, సాధారణం కంటే ఎక్కువ–అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలు లేవని తేల్చిచెప్పారు. రుతుపవనాలపై ఎల్‌నినో ఎఫెక్ట్.. పసిఫిక్ మహాసముద్రంలోని జలాలు ఈసారి సాధారణం కంటే అధికంగా వేడెక్కాయని స్కైమెట్ సంస్థ తెలిపింది. దీని కారణంగా ఎల్‌నినో ఏర్పడుతుందనీ, ఇది నైరుతీ రుతుపవనాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వెల్లడించింది. ఈ విషయమై స్కైమెట్ అధ్యక్షుడు జి.పి. శర్మ మాట్లాడుతూ..‘మా అంచనాల ప్రకారం మార్చి–మే మధ్యకాలంలో ఎల్‌నినో ఏర్పడే అవకాశాలు 80 శాతం ఉన్నాయి. జూన్–ఆగస్టు నాటికి ఈ సగటు 60 శాతానికి పడిపోతుంది. మే–జూన్–జూలై కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఎల్‌నినో ఏర్పడే అవకాశాలు 66 శాతం ఉండగా, స్థిర వాతావరణం కొనసాగే అవకాశం 32 శాతం, లానినా ఏర్పడే అవకాశాలు 2 శాతం ఉన్నాయి. లానినా వల్ల పసిఫిక్‌లో ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ఇది నైరుతీ రుతుపవనాలకు మంచిది’ అని పేర్కొన్నారు. హిందూ మహాసముద్రంలోని జలాలు సరైన ఉష్ణోగ్రతతో ఉన్న నేపథ్యంలో ఎల్‌నినో ప్రభావాన్ని కొంతవరకూ అడ్డుకునే అవకాశముందని అభిప్రాయపడ్డారు. -
ముందుగానే రుతుపవనాలు!
సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది నిర్ణీత గడువుకంటే ముందుగానే దేశంలోకి ప్రవేశించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి సానుకూల సంకేతాలు అగుపిస్తున్నాయి. వేసవి ఆరంభం(మార్చి ఆఖరు)లోనే క్యుములోనింబస్ మేఘాలు ఆవరించడం, ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షాలు కురవడం వంటి పరిణామాలు ముందస్తు రుతుపవనాలకు దోహదం చేయనున్నాయని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు. నిజానికి జూన్ మొదటి తేదీ నాటికి ఈ రుతుపవనాలు కేరళను తాకాల్సి ఉంది. కానీ అంతకంటే ఐదు నుంచి 8 రోజుల ముందుగానే ఇవి కేరళను తాకుతాయని వారు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం దక్షిణ హిందూ మహాసముద్రం నుంచి నీటి ఆవిరి కలిగిన మేఘాలు భూమధ్యరేఖ దాటి ఉత్తరార్థ గోళంలోకి ప్రవేశిస్తున్నాయి. బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో యాంటీ సైక్లోన్లు(అధిక పీడనాలు) బలంగా ఉన్నాయి. ఇవి దక్షిణం వైపు నుంచి తేమ గాలులతో తూర్పు, పశ్చిమతీరాలకు వస్తున్నాయి. ఫలితంగా ఈ ఎండాకాలంలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షాల(వాతావరణ పరిభాషలో థండర్ స్టార్మ్ యాక్టివిటీగా పిలుస్తారు)కు కారణమవుతున్నాయి. అదే సమయంలో నైరుతి రుతుపవనాలు ముందుగా ప్రవేశించేందుకు దోహదపడే పశ్చిమ ఆటంకాలు ఉత్తరం వైపునకు కదులుతున్నాయి. అనుకూలంగా లానినా పరిస్థితులు.. సాధారణంగా పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటే ఎల్‌నినో ఏర్పడి వర్షాభావ పరిస్థితులు తలెత్తుతాయి. అదే ఉపరితల ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటే లానినా పరిస్థితులు ఏర్పడతాయి. అంటే రుతుపవనాలకు అనుకూలమన్నమాట. ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నాయి. దీనివల్ల లానినా పరిస్థితులేర్పడి జూన్ దాకా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది నైరుతి రుతుపవనాలు ముందస్తు ఆగమనానికి అనుకూల పరిణామమని రిటైర్డ్ వాతావరణ శాస్త్రవేత్త రాళ్లపల్లి మురళీకృష్ణ ‘సాక్షి’తో చెప్పారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి జూన్ మొదటితేదీకి 5 నుంచి 8 రోజుల ముందుగా రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించే వీలుందని పేర్కొన్నారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజనులో సా«ధారణ వర్షపాతం నమోదవుతుందని ఇప్పటికే ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ ప్రకటించడం తెలిసిందే. -
ఈసారి వర్షపాతం సాధారణమే
న్యూఢిల్లీ: ఈ ఏడాది దేశంలో నైరుతి రుతుపవనాలు సాధారణంగానే ఉంటాయని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ బుధవారం అంచనా వేసింది. దక్షిణ రాష్ట్రాలతో పాటు ఈశాన్య ప్రాంతాల్లో కొన్ని చోట్ల మాత్రం సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నట్లు తెలిపింది. రుతుపవనాల లాంగ్ పీరియడ్ యావరేజీ(ఎల్పీఏ) వంద శాతంగా ఉండేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పేర్కొంది. ఎల్పీఏ 96–104 శాతం మధ్య ఉంటే సాధారణ వర్షపాతంగా పరిగణిస్తారు. 90–96 శాతం మధ్య నమోదైతే సాధారణం కన్నా దిగువ స్థాయిగా భావిస్తారు. ఈ ఏడాది సాధారణం కన్నా ఎక్కువ వర్షాలు కురిసేందుకు అవకాశాలు 20 శాతమని, అంతకు దిగువ స్థాయిలో నమోదయ్యేందుకు కూడా 20 శాతం అవకాశాలున్నట్లు స్కైమెట్ తెలిపింది. జూన్‌లో అధిక, జూలైలో సాధారణ, ఆగస్టులో సాధారణం కన్నా తక్కువగా వర్షపాతం నమోదయ్యేందుకు అవకాశాలున్నట్లు పేర్కొంది. సెప్టెంబర్‌లో రుతుపవనాలు మళ్లీ పుంజుకుంటాయని అంచనా వేసింది. బిహార్, ఒడిశా, జార్ఖండ్ లాంటి రాష్ట్రాలు సీజన్ అంతా సాధారణ వర్షపాతమే పొందుతాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా కరవు, లోటు వర్షపాతం ఏర్పడేందుకు అవకాశాలు లేవని తెలిపింది. అయితే ఏప్రిల్ అంచనాల్లో స్కైమెట్ రాబోయే రోజుల్లో మార్పులు చేసే అవకాశాలున్నాయి. -
పడగెత్తిన ఎల్‌నినో!
ఈసారి రుతుపవనాల రాక ఆలస్యం.. వర్షాలూ అంతంతే: స్కైమెట్ అంచనా ► వర్షపాతం సాధారణం కంటే తక్కువే ► ఎల్‌నినో పరిస్థితులకు 50 శాతం అవకాశం ► మండిపోనున్న ఎండలు.. రానున్న 2 నెలలూ భగభగలే ► చుక్కలు చూపనున్న మే.. 45 డిగ్రీల దాకా నమోదయ్యే చాన్స్ ► ఎండలకు రాష్ట్రంలో 8 మంది మృతి సాక్షి, హైదరాబాద్ మేలో దంచికొట్టాల్సిన ఎండలు ఏప్రిల్‌లోనే ఠారెత్తిస్తున్నాయి.. నెల రోజుల ముందుగానే మండిపోతున్నాయి.. ఈసారి రికార్డు స్థాయిలో హీటెక్కిస్తాయన్న సంకేతాలూ వెలువడుతున్నాయి.. మరి వానల సంగతేంటి? మంచి వర్షాలే ఉంటాయని అంతా చెబుతున్నా వాతావరణ నిపుణుల తాజా అంచనాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. ఈసారి ఎల్‌నినో ముప్పు పొంచి ఉందని, ఫలితంగా ‘చల్లని’కబురు లేటుగా అందుతుందని పేర్కొంటున్నారు. అంతేకాదు జూన్–సెప్టెంబర్ మధ్య సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదవుతుందని స్పష్టంచేస్తున్నారు. వాతావరణ పరిశోధన సంస్థ స్కైమెట్తోపాటు నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్పియరిక్ అడ్మినిస్ట్రేషన్ సంస్థ తాజా అధ్యయనంలో ఇదే విషయం తేలింది. పసిఫిక్ మహాసముద్రం ఉపరితలం వేడెక్కి సముద్రం మీదుగా వీచే పవనాలు గతి తప్పడంతో వాతావరణంలో పెనుమార్పులు చోటుచేసుకుంటాయి. దీన్నే ఎల్నినోగా వ్యవహరిస్తారు. దీని ప్రభావంతో వేసవిలో ఎండలు మండి పోవడం, అకాల వర్షాలు, రుతుపవనాల్లో జాప్యం వంటి విపరిణామాలు చోటుచేసుకుంటాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఖరీఫ్ పంటలకు ఇబ్బందేనా? రుతుపవనాలు సాధారణంగా జూన్ 1న కేరళ తీరాన్ని తాకి క్రమంగా దేశమంతా విస్తరిస్తాయి. ఈ సమయంలో మంచి వర్షాలు కురిస్తేనే ఖరీఫ్ సాగు జోరుగా సాగుతుంది. రుతుపవనాల రాక ఆలస్యమైనా, తగినన్ని వర్షాలు లేకపోయినా పంటల సాగు ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈసారి రుతుపవనాలు ఆలస్యంగా రావడంతోపాటు సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందన్న స్కైమెట్ అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ‘‘ఎల్‌నినో ఏర్పడితేనే వర్షాలు కురవవని చెప్పలేం. పరిస్థితులు ఎల్‌నినో ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నా కరువు ఏర్పడుతుంది. 2014లో ఇదే జరిగింది. ఆ ఏడాది ఎల్‌నిలో లేదు కానీ వర్షాలు చాలా తక్కువగా కురిసి కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈసారి ఎల్‌నినో ఏర్పాటుకు 50 శాతం పరిస్థితులకు అనుకూలంగా ఉన్నాయి. దీంతో జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌లో తక్కువ వర్షాలు పడొచ్చు’’అని స్కైమెట్ అధినేత జతిన్ సింగ్ పేర్కొన్నారు. ఎండ ప్రచండమే.. రాష్ట్రంలో ఏప్రిల్ రెండో వారంలోనే 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. మరో 60–70 రోజులపాటు పగటి ఉష్ణోగ్రతలు ఠారెత్తిస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో సాధారణంగా మే నెలలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. గతంలో ఏప్రిల్‌లో ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు ఒకటి లేదా రెండురోజులు మాత్రమే నమోదైన దాఖలాలున్నాయి. కానీ ఈసారి అందుకు భిన్నంగా ఇప్పట్నుంచే ఎండలు మండిపోతున్నాయి. హైదరాబాద్‌లో 1973 ఏప్రిల్ 30న అత్యధికంగా 43.3 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రత నమోదవడం ఇప్పటివరకు రికార్డు. ఈసారి ఈ రికార్డు బద్దలయ్యే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. మే నెలలో గరిష్టంగా 44–45 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు. రామగుండం, నిజామాబాద్‌లలో 42.4 డిగ్రీలు ఆదివారం రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లోనూ 40 డిగ్రీలకు మించి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రామగుండం, నిజామాబాద్‌లలో 42.4 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. ఆదిలాబాద్‌లో 42, మహబూబ్‌నగర్‌లో 41.5, మెదక్‌లో 41.6, భద్రాచలంలో 41.2 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మం, హైదరాబాద్, హన్మకొండ, నల్లగొండల్లో 40 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సోమవారం కొన్నిచోట్ల సాధారణం కంటే రెండు మూడు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, మరికొన్నిచోట్ల ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వడదెబ్బతో 8 మంది మృతి సాక్షి, నెట్వర్క్: ఎండ వేడిమికి తాళలేక ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 8 మంది చనిపోయారు. వనపర్తి జిల్లాలో ముగ్గురు, నల్లగొండ జిల్లాల్లో ముగ్గురు మహబూబ్‌నగర్ జిల్లాలో ఒకరు, నాగర్‌కర్నూల్ జిల్లాలో ఒకరు మరణించారు. గత పదేళ్లుగా ఏప్రిల్ నెలలో గ్రేటర్ హైదరాబాద్‌లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలివీ.. సంవత్సరం తేదీ ఉష్ణోగ్రత 2016 14 43 2015 30 40.6 2014 29 40.3 2013 30 40.6 2012 30 40.5 2011 29 40.4 2010 16 42.7 2009 30 41.9 2008 30 41.6 2007 30 41.1 ఇప్పటివరకు రికార్డు..1973 ఏప్రిల్ 30: 43.3 డిగ్రీలు వర్షాలపై స్కైమెట్ అంచనా ఇదీ.. పరిస్థితి శాతం అధిక వర్షపాతానికి అవకాశం – 0 సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం – 10 సాధారణ వర్షపాతం – 50 సాధారణం కంటే తక్కువ వర్షపాతం – 25 కరువు పరిస్థితులు – 15