న్యూఢిల్లీ: ఈ ఏడాది దేశంలో నైరుతి రుతుపవనాలు సాధారణంగానే ఉంటాయని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ బుధవారం అంచనా వేసింది. దక్షిణ రాష్ట్రాలతో పాటు ఈశాన్య ప్రాంతాల్లో కొన్ని చోట్ల మాత్రం సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నట్లు తెలిపింది. రుతుపవనాల లాంగ్ పీరియడ్ యావరేజీ(ఎల్‌పీఏ) వంద శాతంగా ఉండేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పేర్కొంది. ఎల్‌పీఏ 96–104 శాతం మధ్య ఉంటే సాధారణ వర్షపాతంగా పరిగణిస్తారు. 90–96 శాతం మధ్య నమోదైతే సాధారణం కన్నా దిగువ స్థాయిగా భావిస్తారు.
ఈ ఏడాది సాధారణం కన్నా ఎక్కువ వర్షాలు కురిసేందుకు అవకాశాలు 20 శాతమని, అంతకు దిగువ స్థాయిలో నమోదయ్యేందుకు కూడా 20 శాతం అవకాశాలున్నట్లు స్కైమెట్ తెలిపింది. జూన్‌లో అధిక, జూలైలో సాధారణ, ఆగస్టులో సాధారణం కన్నా తక్కువగా వర్షపాతం నమోదయ్యేందుకు అవకాశాలున్నట్లు పేర్కొంది. సెప్టెంబర్‌లో రుతుపవనాలు మళ్లీ పుంజుకుంటాయని అంచనా వేసింది. బిహార్, ఒడిశా, జార్ఖండ్ లాంటి రాష్ట్రాలు సీజన్ అంతా సాధారణ వర్షపాతమే పొందుతాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా కరవు, లోటు వర్షపాతం ఏర్పడేందుకు అవకాశాలు లేవని తెలిపింది. అయితే ఏప్రిల్ అంచనాల్లో స్కైమెట్ రాబోయే రోజుల్లో మార్పులు చేసే అవకాశాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment