
అండమాన్ సముద్రతీరంలో కురుస్తున్న వర్షం (ఫైల్)
సాక్షి, విశాఖపట్నం: ఈ ఏడాది జూన్ 15వ తేదీకి రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రతి ఏడాదీ మే 20 నాటికి అండమాన్ సముద్రం, దక్షిణ బంగాళాఖాతంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. జూన్ 1 నాటికి కేరళను తాకుతాయి. అప్పట్నుంచే దేశంలో నైరుతి రుతుపవనాల ప్రభావం మొదలవుతుంది. అయితే ఈ ఏడాది ‘నైరుతి’ మూడు రోజులు ఆలస్యంగా జూన్ 4 నాటికి కేరళను తాకే అవకాశం ఉందని ఇప్పటికే భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
గతేడాది మే 20వ తేదీ కంటే వారం రోజుల ముందే నైరుతి రుతుపవనాలు అండమాన్ సముద్రంలోకి ప్రవేశించాయి. ఈసారి మాత్రం ఒకటి, రెండు రోజుల ముందు ప్రవేశించి.. ఈనెల 22 నాటికి అండమాన్, నికోబార్ దీవుల అంతటికీ విస్తరిస్తాయని ఐఎండీ పేర్కొంది. మరోవైపు రుతుపవనాల ప్రవేశానికి సూచికగా మూడు రోజులుగా అండమాన్, నికోబార్ దీవుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
చదవండి: సీఎం జగన్ విజయవాడ పర్యటన షెడ్యూల్ ఇదే..
అనంతరం రుతుపవనాలు జూన్ 4 నాటికి కేరళను తాకనుండటంతో.. ఆ ప్రభావం ఏపీపైనా ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి నైరుతి రుతుపవనాలు కేరళను తాకిన పది రోజుల్లోగా రాయలసీమ మీదుగా ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తాయి. అనంతరం మరో వారం రోజుల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు విస్తరిస్తాయి. అంతా అనుకూలిస్తే జూన్ 10కి బదులు 15వ తేదీకల్లా రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశముందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ సీజన్‌లోనూ రాష్ట్రంలో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
రాగల ఐదు రోజుల పాటు వర్షాలు..
కోస్తా నుంచి దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాగల ఐదు రోజుల పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నిన్నటితో పోలిస్తే ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టనున్నాయి.నిన్న జంగమహేశ్వరం లో 45.2 బాపట్ల 45 నరసాపురం 43.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. విశాఖపట్నం, ఆరోగ్యవరం, కళింగపట్నం ప్రాంతాల్లో సగటున 40 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రత నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment