ట్రంప్ తన అధ్యక్షపదవీ ప్రమాణ స్వీకారోత్సవంలో... ‘పనామా కాలువ నిర్వహణ చైనా చేస్తోంది. దాన్ని మేం పనామాకు ఇచ్చాము కానీ చైనాకు కాదు గనుక ఆ కాలువ అధికారాన్ని పనామా నుండి వెనుకకు తీసేసుకుంటాము’ అన్నారు. పనామా కాలువ నిర్వహణను పనామా తటస్థ వైఖరితో చేయాలనీ, చైనా లేదా మరెవ్వరి జోక్యం ఉండ కూడదనీ, అమెరికాపై, దాని నావికాదళంపై, వాణిజ్య నౌకల ద్వారా వ్యాపారం చేస్తున్న కార్పోరేషన్లపై అధిక టోల్ ధరలు, ప్రయాణ రేట్లను వసూలు చేసే అధికారం పనామాకు ఇవ్వలేదనీ ట్రంప్ గత డిసెంబరు 22 నాడు అన్నారు. సెంట్రల్ అమెరికా దగ్గర అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాలను 80 కిలోమీటర్ల కృత్రిమ పనామా కాలువ కలుపుతుంది.
అనేక కష్టాలతో 25 వేలమంది శ్రామికుల బలిదానంతో నిర్మించిన ఈ కాలువను ప్రారంభంలో అమెరికా ఉంచుకొని ప్రెసిడెంట్ కార్టర్ కాలం (1978)లో దశలవారీగా పనామాకు ఇవ్వటానికి ఒప్పుకొని, 1999 నాటికి పూర్తిగా ఇచ్చారు. 2021లో ఈ కాలువ అజమా యిషీకి మరొక 25 సంవత్సరాల గడువు పెంచారు. ప్రస్తుతం నాల్గింట మూడువంతుల నౌకా రవాణా అమెరికా చేస్తుండగా చాలా వ్యత్యాసంతో చైనా 2వ స్థానంలో ఉంది. పనామా జీడీపీలో 7.7% వాటా ఈ కాలువ ద్వారానే లభిస్తోంది. ప్రపంచ నౌకా రవాణా మార్గంలో 6 శాతం ఈ కాలువకు వాటా ఉంది. 80 కిలోమీటర్ల పనామా కాలువ దాటడానికి ఒక నౌకకు 8 గంటలు పడుతుంది. అదే నౌక దక్షిణ అమెరికా చివరి భాగమైన కేప్‌హోర్న్ మీదుగా ప్రయాణం చేయాలంటే వారం రోజులు పడుతుంది. దూరం సుమారు 20 వేల కిలోమీటర్లు ఉంటుంది.
లాటిన్ అమెరికా దేశాలలో చైనా ప్రతిష్ఠ పెరుగుతుండగా, గత 10సంవత్సరాల కాలంలో చైనా అనేక వర్తక, వాణిజ్య ఒప్పందాలు చేసుకొంది.
ముఖ్యంగా చైనా ‘బెల్ట్ అండ్ రోడ్’ ప్రాజెక్టులోకి దక్షిణ అమెరికా దేశాలు చేరు తున్నాయి. ప్రప్రథమంగా 2017లో పనామా చేరింది. చైనా పెట్టుబడులకు ప్రతిఫలంగా పనామా తనకు తైవాన్‌తో గల దౌత్య సంబంధాలను కూడా రద్దు చేసుకొంది. పనామా కాలువను స్వాధీనం చేసుకోవటం ద్వారా చైనా ఆధిప త్యాన్ని తగ్గించే వ్యూహంలో ట్రంప్ ఉన్నారు.
కాలువకు రెండు వైపుల హాంకాంగ్‌కు చెందిన హాచిసన్ వాంపోవా కంపెనీకి అట్లాంటిక్ వైపు క్రిస్టోబాల్, పసిఫిక్ వైపు బాల్హోవాకి నౌకాశ్రయాలు ఉన్నాయి. హాంకాంగ్ లీజు యూకేతో ముగిసి ప్రస్తుతం స్వయం ప్రతిపత్తిగల దేశంగా ఉన్నప్పటికీ, దౌత్యపరంగా చూస్తే ఎప్పటికైనా చైనాలో అంతర్భాగంగా పరిగణించాలి గనుక బహుశా ఈ రెండు నౌకాశ్రయాల్ని ట్రంప్ చైనాకు చెందినవిగా అనుకొంటూ ఉండవచ్చు. కాలువకు ఆనుకుని ఉన్న మొత్తం 5 ఓడరేవుల్లో అమెరికాకు చెందినది ఒకటీ, మిగతావి విదేశాలకు చెందినవీ ఉన్నాయి. కానీ ఈ ఓడరేవులన్నీ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా పనిచేస్తున్నాయనేది పనామా వాదన.
పనామా కాలువ ఆలోచన మొట్టమొదటిసారిగా స్పానిష్ విజేత వాస్కోలార్బోవా మెదడు నుండి ఉద్భవించి పనామా ఇస్తమన్‌ను భూమార్గం ద్వారా దాటాడు. ఆ తర్వాత నౌకామార్గం కోసం రెండు అమెరికా ఖండాల మధ్య కాలువను తవ్వాలనే కోరిక యూరప్ దేశాల్లో పుట్టింది. అప్పటికి నేటి అమెరికా ఇంకా లేనే లేదు. సూయిజ్ కెనాల్‌కు ఆద్యుడు ఫ్రెంచ్ ఫెడినాంగ్ లెస్పెప్స్ ఆలోచనతో ఫ్రాన్స్ సామ్రాజ్యం 1881–1899 మధ్య పనామా కాలువ తవ్వక పనులు చేపట్టింది. అయితే ఆర్థిక ఇబ్బందులు, వర్షారణ్య అడవుల్లో వేలాదిమంది కార్మికులు చనిపోవటంతో మధ్యలోనే ప్రాజెక్టును ఆపేసింది.
తదనంతరం నూతన సాంకే తిక పరిజ్ఞానంతో 1904 సంవత్సరం నుండి 1914 వరకూ అమెరికా ఈ కాలువ పనులను ముమ్మరం చేసి అప్పట్లో 40 కోట్ల డాలర్ల వ్యయంతో కాలువ నిర్మాణాన్ని పూర్తి చేసి, 1999 వరకూ షరతులతో తన ఆధీనంలో ఉంచుకొని ప్రతిఫలాలను అను భవించింది. దీనికోసమై పనామా దేశాన్ని కొలంబియా నుంచి విమోచన చేయించి దౌత్య సంబంధాలను ప్రారంభించింది. తనకు అనుకూల ప్రభుత్వం పనామాలో లేదని 1989లో బుష్ ప్రభుత్వం యుద్ధానికి దిగి తన కీలుబొమ్మ ప్రభు త్వాన్ని స్థాపించుకొంది.
ప్రపంచ వాణిజ్యానికి జల రవాణా అతి ప్రధానమైన అంశం గనుకనే ఈ జల మార్గాల దగ్గర అగ్రరాజ్యాలు ముఖ్యంగా అమెరికా అనేక ప్రత్యక్ష లేక పరోక్ష యుద్ధాలకు దిగుతూ ఆధిపత్యం చలాయిస్తోంది. ఈజిప్టు అధ్యక్షుడు సూయజ్ కాలువను జాతీయం చేయగానే బ్రిటన్, ఫ్రాన్స్, ఇజ్రాయిల్ దేశాలు 1956లో యుద్ధానికి దిగిన సంగతీ ఇక్కడ గమనార్హం. పనామా – ఈజిప్టులు కాలువల ద్వారా ఆర్థికాభివృద్ధి ఎంత సాధిస్తున్నాయో అంతకంటే ఎక్కువ రవాణా ఖర్చు లను, రవాణా సమయాన్ని ప్రపంచ దేశాలన్నీ పొదుపు చేస్తూ ప్రపంచ వాణిజ్యంతో లబ్ధి పొందుతున్నాయనటం అతిశయోక్తి కానేకాదు. ట్రంప్ చైనాను దెబ్బ తీయాలనే తలంపుతో దుందుడుకు ప్రకటనలు చేయడం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను ఒడిదుడుకులపాలు చేస్తోందన్నది వాస్తవం!
- బుడ్డిగ జమిందార్‌వ్యాసకర్త అసోసియేట్ ప్రొఫెసర్, కె.ఎల్. యూనివర్సిటీ ‘ 98494 91969
Comments
Please login to add a commentAdd a comment